అభ్యర్థుల ఓట్లకు దగ్గరలో చెల్లని ఓట్లు

అభ్యర్థుల ఓట్లకు దగ్గరలో చెల్లని ఓట్లు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. అభ్యర్థుల ఓట్లకు దాదాపు సమానంగా చెల్లని ఓట్లు కూడా నమోదవుతున్నాయి. హైదరాబాద్ సెగ్మెంట్ తొలి రౌండ్‌లో 3 వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. నల్గొండ సెగ్మెంట్ తొలి రౌండులో 3 వేలకు పైగా ఓట్లు చెల్లలేదు. ఒక్కో రౌండ్‌లో 56 వేల ఓట్లు లెక్కిస్తున్నారు. అంటే మొదటి రౌండ్‌లో 5 నుంచి 7 శాతం ఓట్లు చెల్లలేదు. మొత్తం 7 రౌండ్లు పూర్తయ్యే సరికి పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రాడ్యుయేట్లు కూడా చెల్లని ఓట్లు వేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చెల్లని ఓట్లు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నల్గొండ సెగ్మెంట్‌లో రెండో రౌండ్ లోను భారీగా చెల్లని ఓట్లు పడ్డాయి. ఈ రౌండ్‌లో 3,009 ఓట్లు చెల్లలేదు. మొదటి రౌండులో 3,151 పైగా ఓట్లు చెల్లలేదు. దాంతో మొత్తం రెండు రౌండ్లలో కలిపి నల్గొండ సెగ్మెంట్‌లో 6,160 ఓట్లు చెల్లలేదు. అటు హైదరాబాద్ సెగ్మెంట్‌లోనూ చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఫలితాలు వెలువడిన తొలి రౌండులో హైదరాబాద్ సెగ్మెంట్‌లో 3,374 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. ఈ చెల్లని ఓట్లన్ని కలిపి చూస్తే.. ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి.