టార్గెట్ పాతాళం.. అంతుచిక్కని ప్రశ్నలకు జవాబులు!

టార్గెట్ పాతాళం.. అంతుచిక్కని ప్రశ్నలకు జవాబులు!
  • ఎర్త్​ అప్పర్​ మ్యాంటిల్​ వరకు చేరాలన్న ప్రయత్నం
  • సముద్ర గర్భం నుంచి  షిప్పులతో డ్రిల్లింగ్​
  • భూమి, జీవం రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రయోగం
  • ఇప్పటిదాకా తవ్విన లోతు 3 కిలోమీటర్లే​

భూమి పుట్టినప్పుడు ఏం జరిగింది? డైనోసార్లు అంతరించిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులుండేవి? భూమి వేడెక్కినప్పుడు, చల్లగైనప్పుడు జీవులకు ఎదురైన అనుభవమేంటి? అసలు, మనం ఎటు పోతున్నామో కొన్ని కోట్ల ఏళ్ల వయసున్న భూమి చరిత్ర చెబుతుందా?.. ఈ ప్రశ్నలకు సమాధానాలేంటి? బహుశా, వాటికి సమాధానాలు పాతాళంలో దాగి ఉన్నాయేమో!! అందుకే ఆ పాతాళాన్నే తవ్వేస్తే పోలే అనుకుంటున్నారు సైంటిస్టులు. అవును, గత నెలలో డైనోసార్ల అంతం గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నంలో సైంటిస్టులు న్యూజిలాండ్​లోని మహాసంద్రంలో పరిశోధనలు సాగించారు. అంతుచిక్కని ప్రశ్నలకు జవాబులు దొరకబట్టేందుకు ఆ పరిశోధనలను మరింత ‘లోతు’కు తీసుకెళ్లాలని అనుకున్నారు. అందులో భాగంగానే పాతాళంపై దృష్టి పెట్టారు.

ఏడు కిలోమీటర్లు తవ్వుతరంట

ఇప్పటిదాకా పురాతన చరిత్ర గురించి సైంటిస్టులు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తవ్వకాలు చేపడుతూ శిలాజాల ఆధారంగా ఆ చరిత్రకు అక్షర రూపం ఇస్తున్నారు. కానీ, అది కొంత వరకే. అయితే, మహా సముద్రాలు, భూ వాతావరణం, క్లైమేట్​ వంటి వాటి లోగుట్టు అంతా సెడిమెంట్లలో ఉంటుందని ఒరెగాన్​ స్టేట్​ యూనివర్సిటీ మెరీన్​ జియాలజీ సైంటిస్ట్​ ఆంథోనీ కాపర్స్​ చెబుతున్నారు. మరి, ఆ సెడిమెంట్లను తవ్వి తీయడం సాధ్యమేనా? సముద్ర గర్భం నుంచి తవ్వుకుంటూ పోతే సాధ్యమని అంటున్నారు. అక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు తవ్వేలా ప్లాన్​ చేస్తున్నారు. భూమితో పోలిస్తే సముద్ర గర్భం నుంచి తవ్వితే అక్కడ భూమి మందం తక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. సముద్ర గర్భం నుంచి తవ్వితే దగ్గరదగ్గర భూపటలం (మ్యాంటిల్​) వరకు వెళ్లొచ్చని కాపర్స్​ చెప్పారు.

ఇంతకు ముందు చేయలేదా?

నిజానికి ఈ పాతాళాన్ని తవ్వడమనే కాన్సెప్ట్​ 1950లోనే మొదలైంది. మాట అయితే అనుకున్నారు కానీ, అది ముందుకు సాగలేదు. ప్రాజెక్ట్​ మోహోల్​ పేరిట 1960ల్లో అమెరికా మొదటి సారి ఆ ప్రయత్నం చేసింది. కానీ, 601 అడుగులు మాత్రమే తవ్వగలిగింది. ఆ తర్వాత అందివచ్చిన టెక్నాలజీతో 3,250 మీటర్లు (3.25 కిలోమీటర్లు) వరకు తవ్వగలిగింది జపాన్​. అది కూడా గత ఏడాదే (2019) జరిగింది. చిక్యూ అనే జపాన్​ షిప్​ ఆ ఘనత సాధించింది. ఇప్పటిదాకా అత్యంత ఎక్కువ లోతు తవ్వింది ఆ ఓడే. అయితే, ఎంత లోతు తవ్వామన్నది కాదు.. దాని వల్ల మనం
ఏం సాధించాం.. ఏం తెలుసుకున్నామన్నదే ముఖ్యమంటున్నారు కాపర్స్​. సముద్ర గర్భం నుంచి భూమి లోతుల్లోకి వెళ్లడం ద్వారా సముద్రం కింద ఉన్న టెక్టానిక్​ ప్లేట్​ల తీరు, ఒకప్పుడు ఆర్కిటిక్​లో సబ్​ట్రాపికల్​ క్లైమేట్​, మీథేన్​ ఐస్​, సముద్ర గర్భంలో సూక్ష్మ జీవుల ఆనవాళ్ల వంటివి తెలిశాయి. అయితే, ఇప్పటిదాకా అంత లోతుకు తవ్వినా అది పైపైనేనని కాపర్స్​ చెబుతున్నారు. దాని వల్ల సమాధానాలకు బదులు మరిన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయన్నారు. కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకే మరింత లోతుకు వెళ్లేందుకు ప్లాన్​ చేస్తున్నట్టు చెప్పారు.

పదేళ్ల జోయిడిస్​ జర్నీ

జోయిడిస్​ రిజల్యూషన్​.. 41 ఏళ్లుగా డీప్​ సీ డ్రిల్లింగ్​లో పనిచేస్తున్న ఆయిల్​ షిప్​. ఇంటర్నేషనల్​ ఓషన్​ డిస్కవరీ ప్రోగ్రామ్​ (ఐవోడీపీ)లో అది భాగమైంది. గత నెలలో న్యూజీలాండ్​లోని క్యాంబెల్​ ప్లాట్యూలో చివరిసారి తన డ్రిల్లింగ్​ను చేసింది. కొన్ని శాంపిళ్లను సేకరించింది. ఆ శాంపిళ్లను ఆ షిప్​లోని 118 మంది సైంటిస్టుల్లో ఒకరైన రట్గర్స్​ యూనివర్సిటీ పోస్ట్​ డాక్టోరల్​ ఫెలో, సెడిమెంటాలజిస్ట్​ లారా హేన్స్​, హార్వర్డ్​ యూనివర్సిటీకి చెందిన ఫిజికల్​ ప్రాపర్టీస్​ స్పెషలిస్ట్​ ఎలిజబెత్​ సైబర్ట్​ కలిసి టెస్ట్​ చేశారు. ఆ షిప్పు దాదాపు ఏడు కిలోమీటర్ల లోతు వరకు తవ్వగలదని కాపర్స్​ చెప్పారు. అందుకు రెండు నెలల టైం పడుతుందన్నారు. ఆ క్రమంలో ఒక్క కిలోమీటర్​ లోతు వరకు వెళ్లినా గొప్పేనంటున్నారు. ఇప్పటికే 5.55 కోట్ల ఏళ్ల క్రితం నాటి వాతావరణ పరిస్థితులను అంచనా వేసే పాలియోసీన్​ఇవోసీన్​ థర్మల్​ మ్యాగ్జిమమ్​ను తెలుసుకునేందుకు ఇప్పటికే చాలా లోతు వరకు టీం తవ్విందని అన్నారు. ఇప్పుడు మరింత లోతుకు తవ్వేందుకూ ఆ షిప్​నే వాడుకోవాలన్న ఆలోచనలో సైంటిస్టులున్నారు.

తర్వాతేంటి..?

ఇప్పుడు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న సమస్య కార్బన్​ డయాక్సైడ్​. ఫ్యూచర్​లో ఆ కార్బన్​డయాక్సైడ్​ను సముద్రాలు ఎలా గ్రహిస్తున్నాయన్నది తెలుసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని కాపర్స్​ చెప్పారు. వచ్చే ముప్పై ఏళ్లలో ఐవోడీపీ చేపట్టబోయే డీప్​ ఎర్త్​ ప్రయోగాల్లో భాగంగా అప్పర్​ మ్యాంటిల్​ వరకు చేరుకోవడం ఒక గోల్​. దానికి దాదాపు ఏడాది టైం పడుతుందని కాపర్స్​ చెప్పారు. అందుకోసం హవాయి సహా కొన్ని ప్రాంతాల గురించి చర్చిస్తున్నట్టు చెప్పారు. అయితే, అంత లోతుకు వెళుతున్నప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య టెంపరేచర్​ అన్నారు. డ్రిల్​ చేసి పైపును బయటకు తీసేటప్పుడు ఆ హోల్​ ఆటోమేటిగ్గా పూడుకుపోతుందని, దానిని అధిగమించే టెక్నాలజీపైనా పనిచేయాల్సి ఉందని చెప్పారు. అలాంటి టెక్నాలజీ రావాలంటే మరో 20 ఏళ్లయినా పడుతుందని సైంటిస్టులు అంటున్నారు. ప్రస్తుతం జోయిడిస్​ రిజల్యూషన్​ 900 మీటర్ల కోర్​ సెడిమెంట్లను తవ్వింది. వాటిని తీసుకుని తీరానికి చేరబోతోంది.