పెద్ద షేర్లలో లాభాలు తగ్గడంతో..పెన్నీ షేర్ల వెనక ఇన్వెస్టర్లు

పెద్ద షేర్లలో లాభాలు తగ్గడంతో..పెన్నీ షేర్ల వెనక ఇన్వెస్టర్లు

తక్కువ టైమ్‌‌లో భారీ లాభాలు సంపాదించడమే టార్గెట్‌‌

సెబీ స్క్రూటినీ పెంచినా ఆగడంలే..

గత ఏడాది కాలంలో 3 వేల శాతం వరకు రిటర్న్ ఇచ్చిన 150 పెన్నీ షేర్లు

న్యూఢిల్లీ : ఇన్వెస్టర్లు పెన్నీ షేర్ల వెంటపడుతున్నారు. సెబీ స్క్రూటినీ పెంచినప్పటికీ సుమారు 150 షేర్లు  గత 12 నెలల్లో 200 నుంచి 3,000 శాతం వరకు పెరిగాయి. ఇప్పటి వరకు వినని షేర్లు కూడా ఈ 150 షేర్లలో ఉన్నాయి. వేగంగా లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో పెన్నీ షేర్ల బాట పడుతున్నారు ఇన్వెస్టర్లు. ముఖ్యంగా  రిస్క్ తీసుకోవడానికి వెనకడుగేయని వారు వీటి వెంటపడుతున్నారు. చాలా పెన్నీ షేర్లలో ట్రేడింగ్ యాక్టివిటీ అనుమానాస్పదంగా ఉందని, గతంలో ఇవి  పంప్ అండ్ డంప్‌‌‌‌‌ స్కీమ్స్‌‌ కింద భాగమయ్యాయని ఈటీ స్టడీ పేర్కొంది. వీటిపై సెబీ స్క్రూటినీ పెంచినప్పటికీ, ఈ షేర్లు 3,000 శాతం వరకు పెరిగాయని తెలిపింది. పైన పేర్కొన్న 150 షేర్లలో చాలా కంపెనీల రెవెన్యూ జీరో కాగా, వీటిలో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంది. 

ఈ షేర్లు దూసుకుపోయాయి..

ఈటీ స్టడీ ప్రకారం, సాఫ్ట్‌‌ట్రాక్‌‌ వెంచర్స్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ కిందటేడాది నవంబర్‌‌‌‌లో లిస్టింగ్ కాగా, అప్పటి నుంచి 3,368 శాతం ఎగిసింది. కంపెనీకి 2022 లో రూ.25 లక్షల రెవెన్యూ రాగా, రూ.10 లక్షల ప్రాఫిట్ వచ్చింది. బోహ్రా ఇండస్ట్రీస్ షేర్లు కిందటేడాది అక్టోబర్‌‌‌‌లో లిస్టింగ్ అయ్యాయి. ఈ షేరు లిస్టింగ్ ధర నుంచి 1,828 శాతం ర్యాలీ చేసింది.  ఈ కంపెనీ 2022 లో ఎటువంటి ఆపరేషనల్ రెవెన్యూని సాధించలేదు. రూ.1.37 కోట్లను ఇతర ఇన్‌‌కమ్ కింద ప్రకటించింది. ఈ కంపెనీకి  మార్చి, 2022 తో ముగిసిన ఏడాదిలో రూ.2.62 కోట్ల లాస్ వచ్చింది. శ్రీ గంగా ఇండస్ట్రీస్‌‌కు 2022 లో రూ.113 కోట్ల రెవెన్యూ, రూ.7 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఈ కంపెనీ షేర్లు కిందటేడాది ఏప్రిల్‌‌ 1 నుంచి 1,911 శాతం ర్యాలీ చేశాయి. ఏప్రిల్‌‌ 1, 2022 న రూ.2.71 దగ్గర ఉన్న కంపెనీ షేరు,  సెప్టెంబర్‌‌‌‌, 2022 నాటికి  రూ.242.55 కి పెరిగింది. అంటే ఏకంగా 8,800 శాతం ఎగిసింది. ఈ లెవెల్‌‌ నుంచి 74 శాతం పతనమై, ప్రస్తుతం ట్రేడవుతోంది. మెర్క్యూరి మెటల్స్‌‌, ఎస్‌‌ అండ్ టీ కార్ప్‌‌, కర్నవాటి ఫైనాన్స్‌‌, కే అండ్ ఆర్ రైల్‌‌ ఇంజినీరింగ్‌‌, టేలర్‌‌‌‌మేడ్ రెన్యూ, ఆస్కామ్‌‌  లీజింగ్‌‌, రీజెన్సీ సిరమిక్స్‌‌ వంటి షేర్లు గత 12 నెలల్లో 1,000 శాతం వరకు పెరిగాయి. గత కొంత కాలం నుంచి అనేక పెన్నీ షేర్లలో యాక్టివిటీ పెరిగిందని జియోజిత్‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ చీఫ్ ఇన్వెస్ట్‌‌మెంట్ స్ట్రాటజిస్ట్‌‌  వీకే విజయకుమార్ అన్నారు.  మార్కెట్‌‌లోని పెద్ద కంపెనీల నుంచి గత 17 నెలలుగా ఎటువంటి రిటర్న్స్ రాలేదని, అందుకే కొత్త ఇన్వెస్టర్లు పెన్నీ షేర్ల వెంట పడ్డారని చెబుతున్నారు. మార్కెట్‌‌పైన నాలెడ్జ్ తక్కువగా ఉన్నవారు, ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అంటే తెలియని వారు  పెన్నీ షేర్లలో  డబ్బులు పెడుతున్నారని అభిప్రాయపడ్డారు. ‘వీటిలో చాలా కంపెనీలు డొల్ల కంపెనీలయి ఉంటాయి. లేదా బిజినెస్ పెద్దగా లేని కంపెనీలయి ఉంటాయి. కానీ, వీటి వాల్యుయేషన్‌‌ మాత్రం ఎక్కువగా ఉంటోంది’ అని ఆనంద్‌‌ రాథి  ఎనలిస్ట్‌ నరేంద్ర సోలంకి అన్నారు.  రిటైల్ ఇన్వెస్టర్లు  పెన్నీ షేర్లలో ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని, కష్టపడి సంపాదించిన డబ్బులను ఇటువంటి షేర్లలో ఇరుక్కొని పోగొట్టుకోవద్దని  అన్నారు. తాజాగా యూట్యూబ్ ద్వారా షేరు మానిప్యులేషన్‌‌కు పాల్పడిన 55 మందిని  మార్కెట్‌‌ నుంచి సెబీ బ్యాన్‌‌ చేసిన విషయం తెలిసిందే.

బ్లాక్‌‌ మనీని వైట్‌‌గా మార్చేందుకు.. 

బ్లాక్ మనీని వైట్‌‌‌‌‌‌గా మార్చేందుకు పెన్నీ షేర్లను వాడుకుంటున్నారని కొంత మంది మార్కెట్ పార్టిసిపెంట్స్‌‌‌‌ అంటున్నారు. ‘బ్రోకర్లు కొన్ని రకాల షేర్లను క్లయింట్స్‌‌‌‌కు ‘ఎక్స్‌‌‌‌’ ధర దగ్గర అమ్ముతున్నారు.  మానిప్యులేట్ చేసి ఈ షేరు ధరను 4–6 రెట్లు పెంచుతున్నారు. తర్వాత  షేర్లను 4–6 రెట్ల ధర దగ్గర క్లయింట్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు’ అని క్రిస్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ ఫౌండర్ అరుణ్ కేజ్రివాల్‌‌‌‌ అన్నారు.  ఈ బ్రోకర్ తర్వాత క్లయింట్స్‌‌‌‌కు తమ ఫండ్స్‌‌‌‌ను ఇస్తున్నారు. హై రిటర్న్స్‌‌‌‌పై  క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టి క్లయింట్లు   బ్లాక్ మనీని వైట్‌‌‌‌గా మార్చుకుంటున్నారు. పెన్నీ షేర్లను వాడుకొని ట్యాక్స్ ఎగ్గొట్టే వారిని, మనీలాండరింగ్‌‌‌‌కు పాల్పడేవారిపై సెబీ, ట్యాక్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువ ట్యాక్స్ కట్టకుండా ఉండేందుకు మార్కెట్‌‌‌‌లో కావాలనే లాస్‌‌‌‌ను బుక్‌‌‌‌ చేసిన  వారిని 2015 లో సెబీ గుర్తించింది. లాంగ్‌‌‌‌ టెర్మ్‌‌‌‌ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌‌‌‌ మినహాయింపు పొందేందుకు ఇలా చేయడం పెరిగింది.  2018 లో ప్రభుత్వం ఈ మినహాయింపు రూల్‌‌‌‌ను తీసేసింది. మరో సంఘటనలో ఇల్లిక్విడ్‌‌‌‌ స్టాక్‌‌‌‌ ఆప్షన్స్‌‌‌‌ను వాడుకొని ట్యాక్స్ ఎగవేతకు పాల్పడిన 10 వేల మందిని  సెబీ బుక్ చేసింది.