
ఈ ఐపీఎల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన జట్లు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. గత పదేండ్లలో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్ చేరని పంజాబ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈసారి అసాధారణంగా ఆడుతూ ఏకంగా టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది.
కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలో అన్ని విభాగాల్లో అదరగొడుతూ ప్రత్యర్థి వేదికల్లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్సీబీ సైతం సమాన విజయాలు, పాయింట్లు సాధించింది. రన్‌రేట్‌లో కొంచెం తేడాతో రెండో ప్లేస్‌తో ప్లేఆఫ్స్ చేరుకుంది.ఈ టాప్2 జట్లూ గురువారం జరిగే క్వాలిఫయర్–1లో అమీతుమీకి రెడీ అయ్యాయి.
పిచ్/వాతావరణం
ముల్లన్పూర్ వికెట్ బ్యాట్, బాల్‌కు సమతూకంగా ఉంది. ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌లో ఒక్కసారి మాత్రమే 200 రన్స్ వచ్చాయి. గత నెలలో కేకేఆర్‌పై 111 రన్స్ టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ కాపాడుకుంది. గురువారం రాత్రి వర్ష సూచన లేదు.
జోష్‌లో ఆర్సీబీ
స్టార్ ప్లేయర్లతో కూడిన బెంగళూరుకు ఈ సీజన్లో కెప్టెన్ రజత్ పటీదార్, జితేశ్ శర్మ లాంటి యంగ్స్టర్లు నిలకడను తెచ్చిపెట్టారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో నెగ్గిన ఆర్సీబీ సత్తా చాటింది. గత పోరులో లక్నో ఇచ్చిన 228 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేసి క్వాలిఫయర్–1కు చేరుకున్న ఆర్సీబీ ఫుల్ జోష్‌లో ఉంది. తన కెరీర్లో లోటుగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని ఎలాగైనా అందుకోవాలని చూస్తున్న లెజెండరీ విరాట్ కోహ్లీ ఖతర్నాక్ ఫామ్‌లో ఉన్నాడు. 8 ఫిఫ్టీలు కొట్టిన కోహ్లీ (602 రన్స్) టాపార్డర్‌లో ఆర్సీబీకి వెన్నెముకగా నిలిచాడు.
మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ పవర్‌ప్లేలో విధ్వంసకర రీతిలో ఆడటం, లీగ్ దశలో ఇదే వేదికపై పంజాబ్ కింగ్స్ పై నెగ్గడం ఆర్సీబీ కాన్ఫిడెన్స్‌ను పెంచే అంశాలు. గత మ్యాచ్‌లో జితేశ్ అద్భుతంగా ఆడాడు. తను అదే జోరును కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. పడిక్కల్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా టచ్‌లోకి రావడంతో బ్యాటింగ్ యూనిట్ మరింత బలంగా మారింది. అయితే, బౌలింగ్‌లోనే ఆర్సీబీకి ఇబ్బందులు ఉన్నాయి.
స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌తో పాటు టిమ్ డేవిడ్ ఫిట్నెస్ సాధించి టీమ్ సెలెక్షన్‌కు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. చేతి వేలి గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రజత్ పటీదార్ గత రెండు మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. కీలకమైన క్వాలిఫయర్ పోరులో తను పూర్తి స్థాయిలో ఉంటే మంచిది.