
ఐపీఎల్ అభిమానులకు శుభవార్త. ఇక నుంచి ఐపీఎల్ రెండు నెలలకు పైగా జరగనుంది. 2023 ఐపీఎల్ను 75 రోజుల పాటు నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. ఇందుకోసం ఐసీసీ నుంచి అనుమతి తీసుకుంటామన్నారు. ఐసీసీ భవిష్యత్ టూర్ జాబితాలో ఐపీఎల్ను కూడా చేర్చేందుకు ఐసీసీని కోరాతమన్నాడు. వచ్చే నెలలో 2024 నుంచి -2031 భవిష్యత్ పర్యటనల కార్యాచరణను నిర్దేశించడానికి ఐసీసీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది.
ప్రస్తుతం ఐపీఎల్కు విపరీతమైన క్రేజ్ ఉందని జైషా అన్నాడు. ప్రపంచంలోనే టాప్ ప్లేయర్స్ ఇందులో పాల్గొంటారని..ఇందులో భాగంగానే క్రికెట్ ఫ్యాన్స్ కు మరింత ఎంటర్టైన్మెంట్ ను అందించాలన్న ఉద్దేశంతోనే టోర్నీ సమయాన్ని పెంచబోతున్నట్లు చెప్పాడు. అయితే మరిన్ని ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదన్నాడు. వచ్చే ఏడాది కూడా పది జట్లతోనే ఐపీఎల్ నిర్వహిస్తామని జైషా వెల్లడించాడు.
2008లో మొదలైన ఐపీఎల్ను ఇప్పటి వరకు రెండు నెలల పాటు నిర్వహించేవారు. 2021 వరకు 8 జట్లతోనే ఐపీఎల్ జరిగింది. తొలిసారిగా 2022లో పది జట్లు బరిలోకి దిగాయి. అటు ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి భారీగానే ఆదాయం సమకూరుతోంది. ఇప్పటికే మీడియా హక్కుల విక్రయం ద్వారా భారీ మొత్తంలో ఆదాయాన్ని దక్కించుకుంది. ఇక రెండున్నర నెలలు నిర్వహిస్తే..బీసీసీఐ ఆదాయం మరింత పెరగనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో 74 మ్యాచులు నిర్వహిస్తుండగా..రెండున్నర నెలలకు పెరిగితే మ్యాచుల సంఖ్య 94కు పెరిగే ఛాన్సుంది.