భారత ఇన్సూరెన్స్ రంగంలో రెగ్యులేటరీ సంస్థ IRDAI తీసుకువస్తున్న నూతన సంస్కరణలు ఫైనాన్షియల్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రుణాలు ఇస్తూనే వాటికి ఇన్సూరెన్స్ కలిపి అమ్ముకునే పద్ధతికి చరమగీతం పాడుతూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ ఇటీవల ఒక కఠినమైన ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది. దీంతో బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల షేర్లపై తీవ్ర ప్రభావం పడింది. ప్రధాన లెండర్లు, నాన్-బ్యాంకింగ్ సంస్థల షేర్లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి ఇవాళ్టి మార్కెట్లో.
బలవంతపు పాలసీ విక్రయాలకు చెక్:
'రీకాలిబ్రేటింగ్ ఎకనామిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్' పేరుతో IRDAI రూపొందించిన ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశం.. లోన్స్ తీసుకున్న వ్యక్తులపై ఇన్సూరెన్స్ రుద్దడాన్ని అడ్డుకోవడమే. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, మైక్రోఫైనాన్స్ లేదా పర్సనల్ లోన్స్ తీసుకునే సమయంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కచ్చితంగా క్రెడిట్-లైఫ్ లేదా ఇతర ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని షరతులు విధించడాన్ని ఈ ముసాయిదా పూర్తిగా నిషేధిస్తోంది.
అంతేకాకుండా.. లోన్స్ తీసుకునే కస్టమర్లకు వడ్డీ రేట్లు, ఇతర ఖర్చుల వివరాలను స్పష్టంగా చూపించాలని ఆదేశించింది. ఇన్సూరెన్స్ పాలసీని స్వచ్ఛందంగా తీసుకుంటే అయ్యే ఖర్చు ఎంత? తీసుకోకపోతే ఎంత? అనే రెండు పరిస్థితుల వివరాలను విడివిడిగా పక్కపక్కనే కస్టమర్లకు అర్థం అయ్యేలా స్పష్టంగా చూపాలని ఆదేశించింది. బ్యాంక్ ఉద్యోగులకు టార్గెట్స్ ఆధారిత సేల్స్ ఇన్సెన్టివ్స్ అంటే ఫారెన్ టూర్స్, క్యాష్ బోనస్‌లు, వాల్యూమ్ కాంటెస్ట్‌లు వంటివి ఇవ్వడాన్ని కూడా ఈ నిబంధనలు పూర్తిగా తప్పుపట్టాయి.
భారీగా తగ్గనున్న కమిషన్లు..
IRDAI కొత్త నిబంధనల వల్ల బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు సంపాదించే నాన్-ఇంట్రెస్ట్ ఫీజు ఆదాయానికి భారీ గండిపడనుంది. గతంలో గ్రూప్ క్రెడిట్ లైఫ్ పాలసీలపై డిస్ట్రిబ్యూటర్లకు సగటున 45 శాతం వరకు ఉన్న మొదటి సంవత్సరపు కమిషన్‌ను ఇప్పుడు ఏకంగా 2 శాతానికి నుంచి 2.5 శాతానికి పరిమితం చేసింది రెగ్యులేటర్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ కమిషన్‌ను ఓన్-డ్యామేజ్ పాలసీలకు 5 శాతానికి పరిమితం చేయగా, థర్డ్-పార్టీ కవర్‌కు సున్నాకి తగ్గించేసింది.
ఈ పరిణామాలతో సెప్టెంబర్ 24న మార్కెట్లో బ్యాంకింగ్ షేర్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియర్ L&T Finance షేరు 3.8 శాతం పడిపోయింది. ప్రైవేట్ రంగ దిగ్గజాలు యాక్సిస్ బ్యాంక్ 2.1 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.9 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.4 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.2 శాతం, SBI 0.5 శాతం మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగుతున్నాయి.
ప్రైవేట్ లెండర్లపైనే ఎక్కువ ప్రభావం..
మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో పోలిస్తే బ్యాంక్ అసూరెన్స్ భాగస్వామ్యాలపై ఎక్కువగా ఆధారపడే ప్రైవేట్ బ్యాంకులే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. మ్యాక్యూరీ ఈక్విటీ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. యాక్సిస్ బ్యాంకు లాభాల్లో బ్యాంకాస్యూరెన్స్ ఫీజుల వాటా సుమారు 12.5 శాతంగా ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఇది 7.3 శాతంగా ఉంది. అందువల్ల ఈ బ్యాంకులకు ఆదాయ పరంగా పెద్ద రిస్క్ పొంచి ఉంది.
ALSO READ : కొత్త ఇన్సూరెన్స్ రూల్స్: ఫోన్ నంబర్, ఈమెయిల్ ఇవ్వకుండానే పాలసీ రేట్లు తెలుసుకోవచ్చు!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థల ఆదాయంలో ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఫీజుల వాటా చాలా తక్కువగా ఉండటంతో అవి ఈ ప్రభావం నుంచి సురక్షితంగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఇన్సూరెన్స్ లెగ్యులేటరీ సంస్థ తీసుకువస్తున్న ఈ పారదర్శక విధానాలు భవిష్యత్తులో వినియోగదారులకు పెద్ద ఊరటనివ్వనున్నప్పటికీ.. ఫైనాన్షియల్ సంస్థల ఫీజు ఆదాయాన్ని మాత్రం తీవ్రంగా దెబ్బతీయనుంది.
