ఇజ్రాయిల్​కు 12ఏళ్లుగా 'ఐరన్​ డోమ్' రక్షణ.. నిజంగా ఇవాళ ఇది లేకుంటే..?

ఇజ్రాయిల్​కు 12ఏళ్లుగా 'ఐరన్​ డోమ్' రక్షణ.. నిజంగా ఇవాళ ఇది లేకుంటే..?

ఇజ్రాయిల్​, పాలస్తీనా మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయిల్​ పై హమాస్​ మిలిటెంట్లు గాజా నుంచి దాదాపు 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లతో దాడి చేశారు. ఈ ఐదు వేల రాకెట్లు నిజంగా ఇజ్రాయిల్ పై పడితే ఊహించలేని స్థాయిలో ప్రాణం నష్టం, ఆస్తి నష్టం జరిగి ఉండేది. అయితే.. ఆ నష్టాన్ని చాలా వరకు తగ్గించింది ఇజ్రాయిల్ లోని ఐరన్​ డోమ్ వ్యవస్థ. అవును.. ఇదే ఇప్పుడే ఆ దేశాన్ని కాపాడిందనే చెప్పాలి. 

హమాస్ మిలిటెంట్లు వేసిన రాకెట్లను ఆకాశంలోనే అంటే గగనతలంలోనే ఐరన్ డోమ్​ అడ్డుకుంది. ఇజ్రాయెల్‌ వద్ద ఉన్న ఐరన్‌ డోమ్‌ గగనతల రక్షణ వ్యవస్థ వీటిలో వందల రాకెట్లను మధ్యలోనే అడ్డుకుంది. ఐరన్​ డోమ్ ను 12 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ సేవలు అందిస్తోంది. ఈ వ్యవస్థ ఇప్పటి వరకు వేల కొద్దీ రాకెట్లను గాల్లోనే ధ్వంసం చేసింది. తాజాగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోవడం వల్ల మరోసారి ఈ గగనతల రక్షణ వ్యవస్థ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు దీని గురించే అందరూ చర్చించుకుంటున్నారు.  

చాలా దేశాలు సమీప దూరాల్లోని ప్రత్యర్థుల స్థావరాలను ధ్వంసం చేయడానికి స్వల్ప శ్రేణి రాకెట్లు, శతఘ్నులు, మోర్టార్లను వినియోగిస్తుంటాయి. దూరం తక్కువ ఉండటం వల్ల ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి శత్రువులకు తగినంత సమయం లభించదు. అటువంటి ముప్పులను ముందుగానే గమనించి గాల్లోనే ధ్వంసం చేసే వ్యవస్థను ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అమెరికా ఆర్థిక సహకారంతో 12 ఏళ్ల క్రితం అభివృద్ధి చేసింది. దీన్నే ఐరన్‌ డోమ్‌గా పిలుస్తుంటారు.

ALSO READ : వామ్మో.. ఇదెక్కడి ఐస్ క్రీం అంటూ జనాలు ఆగ్రహం.. 

2011లో ఐరన్ డోమ్​ను ఇజ్రాయిల్ వినియోగంలోకి తీసుకొచ్చింది. ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీన్ని మోహరించింది. గాజాపట్టీ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లు, శతఘ్ని గుండ్లను ఇది చాలా బలంగా ఎదుర్కొంటోంది. శత్రు దేశల రాకెట్లను బలంగా ధ్వంసం చేస్తుంటుంది. దీని రేంజ్​ 70 కిలోమీటర్ల వరకు ఉంటుందట. ఇది కాకుండా ఇజ్రాయెల్‌ వద్ద డేవిడ్‌స్లింగ్‌, యారో అనే రెండు వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇవి దీర్ఘశ్రేణి క్షిపణుల వంటి వాటిని ఎదుర్కొంటాయని చెబుతున్నారు.   

ఐరన్‌డోమ్‌ వ్యవస్థలో రాడార్లు, సాఫ్ట్‌వేర్‌, రాకెట్‌ ప్రయోగించే బ్యాటరీలు ఉంటాయి. గాజా పట్టీలో హమాస్​ మిలిటెంట్లు రాకెట్‌ ప్రయోగించిన వెంటనే రాడార్‌ పసిగట్టి.. దాని గమనాన్ని సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థకు పంపిస్తుంది. వచ్చే రాకెట్‌ ఏ ప్రదేశంలో పడుతుందో ముందుగానే గుర్తిస్తుంది. ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే రాకెట్‌ను ప్రయోగించదు. ఒకవేళ పబ్లిక్ పై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్‌ను ప్రయోగిస్తుంది. ఐరన్‌ డోమ్‌ నుంచి వెలువడిన టమిర్‌ క్షిపణి ప్రత్యర్థుల రాకెట్‌ను గాల్లోనే పేల్చి వేస్తుండడం దీని ప్రత్యేకత. 

ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ కీలక విభాగాలను ఇజ్రాయిల్‌ ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తోంది. కొత్త టెక్నాలజీతో మరింత తీర్చిదిద్దుతోంది.  హార్డ్‌వేర్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. ముప్పును విశ్లేషించే సాఫ్ట్‌వేర్‌ను మాత్రం బాగా అభివృద్ధి చేసింది. అంతకు ముందు గాజాపట్టీ వైపు నుంచి దాడులు జరిగితే అక్కడకు ఇజ్రాయెల్‌ సైన్యాన్ని పంపించాల్సి వచ్చేది. అప్పుడు మరిన్ని ఘర్షణలు జరిగి ఇరు వైపుల భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎక్కువగానే ఉండేది. కానీ.. ఈ వ్యవస్థ వచ్చాక ఇజ్రాయిల్ దళాలు అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. 

ఎప్పుడైనా సరే శత్రు దేశం నుంచి ముప్పు ఉందని ఐరన్​ డోమ్​ వ్యవస్థ అప్రమత్తం చేయగానే సైరన్‌ విని ప్రజలు సురక్షిత స్థానాలకు తరలివెళుతున్నారు. అమెరికా రక్షణ శాఖ కూడా ఇజ్రాయెల్‌ నుంచి ఈ వ్యవస్థలను కొనుగోలు చేసి వాడుతోంది. ఈ ఐరన్‌ డ్రోన్‌ రక్షణ వ్యవస్థను ఛేదించాలని హమాస్‌ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తాజా దాడిలో కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 5 వేల రాకెట్లతో దాడికి దిగింది.

మరోవైపు.. హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ కూడా తమ వద్ద ఉన్న రాకెట్లను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటోంది. ఇజ్రాయిల్‌లోని టెల్‌ అవివ్‌, జెరూసలెం వంటి నగరాలకు సైతం చేరేలా తమ రాకెట్లను మరింత అభివృద్ధి చేస్తోంది. చిన్న స్థాయి ఖాస్సామ్‌ రాకెట్లను భారీ సంఖ్యలో ప్రయోగిస్తోంది. దీనిని హమాసే ఇరాన్‌ సహకారంతో అభివృద్ధి చేసిందని చెబుతుంటారు. హమాస్‌ వద్ద వేల సంఖ్యలో ఖాస్సామ్‌ రాకెట్లు ఉన్నాయి. అందుకే ఒకేసారి 5 వేల రాకెట్లను అది ప్రయోగించింది. ఈ రాకెట్లకు అవసరమైన ముడిపదార్థాలను ఇరాన్‌ నుంచి ఈజిప్ట్‌ సరిహద్దుల మీదగా తీసుకొస్తారన్న ఆరోపణలు బలంగాఉన్నాయి.

ఏది ఏమైనా ప్రస్తుతం ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో అయినా ఏదైనా జరగొచ్చు. ఇజ్రాయిల్ పై జరిగిన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఇటు అమెరికా కూడా ఖండించింది. మరోవైపు.. పాలస్తీనాకు మాత్రం ఇరాన్ అండగా నిలిచింది. హమాస్ రాకెట్ల దాడిని ఇరాన్ దేశం సమర్థించింది.