దళితబంధు.. సగానికి సగం దోపిడీ.. సీఎం వ్యాఖ్యల తర్వాత బయటికొస్తున్న అక్రమాలు

దళితబంధు.. సగానికి సగం దోపిడీ.. సీఎం వ్యాఖ్యల తర్వాత బయటికొస్తున్న అక్రమాలు
  • దళితబంధు.. సగానికి సగం దోపిడీ
  • సీఎం వ్యాఖ్యల తర్వాత బయటికొస్తున్న అక్రమాలు
  • ఎనిమిది బర్ల దగ్గర ఫొటోలు దింపి ఇచ్చింది నాలుగే
  • షెడ్ల నిర్మాణంలోనూ చేతివాటం
  • కమీషన్లు తీసుకున్నా ఎంపిక చేయించలే
  • డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ లబ్ధిదారుల ఆందోళనలు


సూర్యాపేట, వెలుగు:  దళితబంధు పథకం అమలులో జరిగిన దోపిడీ కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు దళితబంధు లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకున్నట్టు తనకు సమాచారం ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అక్రమాలు బయటపడుతున్నాయి. మొదటి విడత దళితబంధులో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లీడర్ల కమీషన్లు లక్ష, రెండు లక్షలకే పరిమితం కాలేదని, కొన్నిచోట్ల సగానికి సగం అంటే రూ.4 నుంచి రూ.5 లక్షల దాకా దండుకున్నట్లు తెలుస్తున్నది. అప్పట్లో లబ్ధిదారుల వద్ద సుమారు 20 మంది ఎమ్మెల్యేలు రూ.2లక్షల నుంచి 3 లక్షల దాకా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. మిగిలిన సెగ్మెంట్లలోనూ ఎమ్మెల్యేల అనుచరులు, లోకల్ బీఆర్ఎస్​ లీడర్లు రూ.లక్ష నుంచి 2 లక్షల దాకా కమీషన్లు తీసుకొన్నారనే ఆరోపణలున్నాయి. ఇన్నాళ్లూ తమ గోడును ఎవరూ పట్టించుకోకపోవడంతో కుమిలిపోయిన లబ్ధిదారులు.. కేసీఆర్​మాటల తర్వాత ఒక్కొక్కరు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారు.  కొందరైతే తీసుకున్న కమీషన్లు వెనక్కి ఇచ్చేయాలంటూ ధర్నాలకు దిగుతున్నారు.

రూ.50 వేలతో షెడ్డు వేసి..  రూ.లక్ష నొక్కేశారు..

సూర్యాపేట జిల్లాలో దళిత బంధు స్కీమ్‌‌లో సగా నికి సగం దోపిడీ జరిగింది. రూ.4 లక్షలతోనే బర్ల యూ నిట్లు కొనిచ్చి.. రూ.8 లక్షలతో కొన్నట్టు లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలాన్ని దళితబంధు పైలట్ ప్రాజెక్ట్‌‌గా ఎంపిక చేశారు. ఈ మండలంలో 2,223 యూనిట్లు మంజూరు కాగా, చాలావరకు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయ్యింది. మండలంలోని మూడు గ్రామాల్లో 33 మినీ డెయిరీ ఫామ్​లు మంజూరయ్యాయి. తొండ గ్రామంలో 24, మామిడాలలో 8, జలాల్‌‌పురంలో ఒక యూనిట్ మంజూరైంది. ఒక్కో యూనిట్ కాస్ట్ రూ.9.90 లక్షలు కాగా, షెడ్ నిర్మాణానికి రూ.1.50 లక్షలు, బర్ల కొనుగోలుకు రూ.8.40 లక్షలు కేటాయించారు. ఏపీలోని తునిలో బర్లు కొనుగోలు చేశారు. ఎనిమిది బర్ల దగ్గర లబ్ధిదారులతో ఫొటో దింపి.. రూ. 4.05 లక్షలతో నాలుగు బర్లు కొనిచ్చారు. మరో నాలుగు బర్లు తర్వాత వస్తాయని నమ్మించి చెక్కులు లోకల్ లీడర్ తీసుకున్నారు. మిగిలిన నాలుగు బర్లను ఎంతకూ ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు నిలదీయడంతో బర్లకు బదులు డబ్బులు అకౌంట్‌‌లో వేస్తామని సదరు లీడర్ చెప్పారు. అయితే జీఎస్‌‌టీ, ట్రాన్స్‌‌పోర్ట్ ఖర్చులు పోను రూ.96 వేలు మాత్రమే వస్తాయ ని చెప్పడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డెయిరీ షెడ్ల నిర్మాణంలోనూ లీడర్లు అక్రమాలకు పాల్పడ్డారు. షెడ్ కోసం  రూ.1.50 లక్షలు కేటాయించగా రూ.50 వేలతో నిర్మించేసి.. రూ.లక్ష లీడరే నొక్కేశారు. నాలుగు పిల్లర్ల మీద రేకులు కప్పి  షెడ్ వేసినట్టు చెప్తున్నారు. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంకు చెందిన దాసరి నాగరత్నం అనే మహిళకు ఏడాది కింద పౌల్ట్రీ ఫామ్ మంజూరైంది. ఆమె ఖాతాలో రూ.10 లక్షలు జమయ్యాయి. అధికార పార్టీ నాయకులు ఆమెకు మాయమాటలు చెప్పి రూ.3.50 లక్షలు మరో ఖాతాకు ట్రాన్స్​ఫర్ చేయించారు. వినాయకపురంలోని ప్రభుత్వ భూమిలో షెడ్లు, బోరు వేయించారు. నాగరత్నం షెడ్ దగ్గరకు వెళ్లగా మరో  రూ.3.50 లక్షలు ఇవ్వాలని సదరు లీడర్లు డిమాండ్ చేశారు. దాంతో ఆమె అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. విషయం బయటకు రావడంతో సదరు లీడర్లు నాగరత్నానికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె వినలేదు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఏడీ సంజీవరావు విచారణ జరిపి.. డబ్బులు తీసుకున్న విషయం నిజమేనని తేల్చారు. నాగరత్నం దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దళితబంధు మంజూరైన నాగరత్నం ఎస్సీ కాదని, ఎస్టీ అయిన ఆమె పేర నకిలీ సర్టిఫికెట్​తయారు చేయించి బీఆర్ఎస్ లీడర్లే అధికారులను తప్పుదారి పట్టించారని దళితులు ఆందోళనకు దిగడం కొసమెరుపు.

మా డబ్బులు వాపసు ఇయ్యండి

దళితబంధు ఇప్పిస్తామంటూ కమీషన్లు తీసుకున్న నేతలను బాధితులు నిలదీస్తున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 50 మంది, చేర్యాల మండలం  ఆకునూరు, మరో రెండు గ్రామాల్లో 20 మంది నుంచి బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారు. దళితబంధు కింద ఎంపిక కావాలంటే రూ. 2 లక్షలు ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకుని, ఆరు నెలల కిందట ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకున్నారు. ఇంతవరకు స్కీమ్ రాకపోవడంతో తమ డబ్బులు వాపసు ఇవ్వాలని లీడర్లను బాధితులు నిలదీశారు. నేతలు స్పందించకపోవడంతో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాలతో కలిసి ఇటీవల చేర్యాల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. తమ డబ్బులు ఇచ్చేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో సదరు లీడర్లు దిగొచ్చి.. సంప్రదింపులు జరుపుతున్నారు. మద్దూరు మండలం బెక్కెల్, దుల్మిట, బైరాన్ పల్లిలో 20 మందికి దళితబంధు ఇప్పిస్తామని అధికార పార్టీ నేతలు ఒక్కొక్కరి నుంచి రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేశారు. ఆ సొమ్ము తిరిగి ఇచ్చివేయాలంటూ లబ్ధిదారులు లీడర్లను డిమాండ్ చేశారు.

4 బర్లు మళ్ల ఇస్తమన్నరు

దళితబంధు కింద నాకు రూ.4 లక్షలతో నాలుగు బర్లు కొనిచ్చిండ్రు. 8 బర్ల దగ్గర ఫొటోలు తీసుకున్నరు. మరో నాలుగు బర్లు తర్వాత పంపిస్తామన్నరు. ఇప్పటిదాంక ఇయ్యలే. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.

- పల్లెర్ల గోపాల్, తొండ గ్రామం, తిరుమలగిరి మండలం

సగం డబ్బులే ఇచ్చిన్రు

దళిత బంధు కింద రూ.10 లక్షలు రావాల్సి ఉంటే రూ.4 లక్షలతో బర్లు ఇచ్చి.. రూ.50 వేలతో షెడ్డు వేశారు. మిగిలిన బర్ల గురించి అడిగితే బర్లు రావని, ఖర్చులు పోను రూ.96 వేలు వస్తాయని అంటున్నరు.
- మంజుల, తొండ గ్రామం, తిరుమలగిరి మండలం

ఫిర్యాదు చేస్తే విచారిస్తం

తొండ గ్రామంలో దళిత బంధు అవకతవకలపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కంప్లైంట్ చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
- ఉమేశ్ చారి, ఎం‌‌పిపీడీ‌‌ఓ, తిరుమలగిరి మండలం, సూర్యాపేట