బతికున్నోళ్లు చనిపోయారని.. రైతు బీమా పైసలు కొట్టేసిండు

బతికున్నోళ్లు చనిపోయారని.. రైతు బీమా పైసలు కొట్టేసిండు
  • చనిపోయిన రైతులు బతికున్నారని.. రైతు బంధు పైసలూ స్వాహా
  • రైతుబంధు, బీమాలో రూ. 2 కోట్ల చీటింగ్.. కొందుర్గు ఏఈవో శ్రీశైలం అరెస్ట్ 
  • మొత్తం150 మంది రైతులను దగా చేసిన ఏఈవో 
  • గద్వాల జిల్లాలో మరో ఏఈవో అవినీతి ఇటీవలే బట్టబయలు   
  • బీఆర్​ఎస్​ హయాంలో స్కీంల అమలులో నిర్లక్ష్యం
  • తాజాగా బయటపడుతున్న అవినీతి బాగోతాలు 

హైదరాబాద్‌‌, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పథకాల అమలులో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. పథకాల అమలులో నిర్లక్ష్యం వల్ల రైతుబంధు, రైతు బీమా పథకాలు పక్కదారి పట్టిన బాగోతాలు తాజాగా వెలుగుచూస్తున్నాయి. 

బతికి ఉన్న రైతులు చనిపోయారని.. చనిపోయిన రైతులు బతికి ఉన్నారని చూపి ఏకంగా రూ. 2 కోట్ల రైతు బీమా, రైతు బంధు డబ్బులు కొట్టేసిన రంగారెడ్డి జిల్లా కొందుర్గు అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) గోరేటి శ్రీశైలంను సైబరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. శ్రీశైలం 20 మంది రైతుల పేరుతో రైతు బీమా క్లెయిమ్‌ చేసుకున్నట్టు గుర్తించారు. 

అతనికి సహకరించిన క్యాబ్ డ్రైవర్‌‌ వీరస్వామిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొందుర్గు మండల కేంద్రంగా జరిగిన ఈ స్కామ్‌ వివరాలను ఈఓడబ్ల్యూ డీసీపీ కె. ప్రసాద్‌తో కలిసి సైబరాబాద్ సీపీ అవినాష్‌ మహంతి సోమవారం మీడియాకు  వెల్లడించారు. రైతు బీమా క్లెయిమ్ సందర్భంగా ఎల్ఐసీకి అడ్డంగా దొరికిపోవడంతో ఏఈవో శ్రీశైలం అవినీతి బండారం బయటపడింది. ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లాలోనూ ఒక ఏఈవో 64 మంది రైతులకు సంబంధించిన రూ. 36 లక్షలను స్వాహా చేసిన ఉదంతం వెలుగుచూసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లలోనూ ఆడిట్ నిర్వహిస్తే ఇలాంటి అక్రమాలు మరెన్నో బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.  

పోర్టల్స్‌ యాక్సెస్‌తో పక్కా స్కెచ్‌ 

కొందుర్గు మండలంలోని వెంకిర్యాల, తంగళ్లపల్లి, ఆగిర్యాల, చిన్నఎల్కిచర్ల సహా వివిధ గ్రామాలకు ఏఈవో శ్రీశైలం ఇంచార్జ్ గావ్యవహరిస్తున్నాడు.  రైతుబీమా, రైతుబంధు అప్లికేషన్లను అప్‌లోడ్‌ చేసేందుకు, సీసీఎల్‌ఏ ల్యాండ్‌ రికార్డులు చూసేందుకు అతనికి యాక్సెస్ ఇచ్చారు. మండలంలో దాదాపు14,000 మందికి పైగా రైతులు ఉండగా.. వీరిలో ఎన్‌ఆర్‌‌ఐలు సహా గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 2,000 మందికి వివిధ కారణాల వల్ల రైతుబంధు రావడంలేదు. దీనిని అవకాశంగా తీసుకున్న శ్రీశైలం డబ్బులు కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు. రైతుబంధు అందుకోని రైతులు సహా ఇతర దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌‌ఐలు, వ్యాపారవేత్తల వివరాలు తెలుసుకున్నాడు. 

మూడేండ్లలో రూ. 2 కోట్లు.. 

రైతు బీమా పోర్టల్‌ ద్వారా 20 మంది, సీసీఎల్‌ఏ ద్వారా130 మంది రైతుల పట్టాదార్‌ పాస్‌బుక్స్‌, ఆధార్‌‌ నంబర్స్‌ సేకరించాడు. ఈ వివరాలతో ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేశాడు. గతంలో మృతి చెందిన18 మంది రైతులకు సంబంధించిన డెత్‌ సర్టిఫికెట్లనూ ఫోర్జరీ చేశాడు. మరో ఇద్దరు రైతులు బ్రతికి ఉండగానే చనిపోయినట్లు ఫేక్ డెత్‌ సర్టిఫికెట్లు తయారు చేశాడు. 

మృతి చెందిన రైతులకు నామినీలుగా తన భార్య పేరు, ఇతరుల పేర్లు పెట్టేవాడు. వీటితో పాటు మృతి చెందిన రైతుల పట్టాదార్ పాస్‌బుక్స్, ఎల్‌ఐసీ క్లెయిమ్‌ డాక్యుమెంట్లతో రైతు బీమా పోర్టల్‌లో దరఖాస్తు చేసేవాడు. ఇలా మూడేండ్లుగా 20 మంది రైతులకు సంబంధించిన బీమా పేరుతో రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ. కోటి కొట్టేశాడు. అలాగే130 మంది రైతులకు రైతుబంధు పేరుతో మరో కోటి రూపాయలు కొట్టేశాడు.   

ఎల్ఐసీకి అడ్డంగా దొరికిండు 

మూడేండ్లుగా130 మంది రైతులకు చెందిన రైతుబంధుకు సంబంధించి రూ. కోటి.. 20 మంది రైతుల బీమాకు సంబంధించి మరో రూ.కోటి శ్రీశైలం కొట్టేశాడు. అయితే ఒకే అకౌంట్‌లో వివిధ రైతుల పేర్లతో రైతు బీమా క్లెయిమ్‌ డబ్బులు డిపాజిట్‌ అవుతుండడంతో ఎల్‌ఐసీ అధికారులకు అనుమానం వచ్చింది. రైతుల నామినీల పేర్లతో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించిన ఎల్‌ఐసీ అధికారులు రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్‌‌కు సమాచారం ఇచ్చారు. 

కొందుర్గు మండలానికి సంబంధించిన రైతు బీమా క్లెయిమ్స్‌ వివరాలను అందించారు. దీంతో డీఏవో సమగ్ర విచారణ జరిపి కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్‌ వింగ్‌ అధికారులు  శ్రీశైలంతో పాటు వీరస్వామిని అరెస్ట్ చేశారు.

క్యాబ్‌ డ్రైవర్, భార్య పేరుతో అకౌంట్లు 

రైతుల డాక్యుమెంట్లతో పొందే రైతు బంధు, రైతు బీమా డబ్బుల డిపాజిట్‌ కోసం వరంగల్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్‌‌ ఓదెల వీరస్వామి(47)తో బ్యాంక్‌ అకౌంట్లను శ్రీశైలం ఓపెన్ చేయించాడు. సైదాబాద్‌, సంతోష్‌నగర్‌‌, దిల్‌సుఖ్‌నగర్‌‌, శంషాబాద్‌లోని జాతీయ బ్యాంకుల్లో మొత్తం15 అకౌంట్లు తెరిపించాడు. ఇందుకోసం వీరస్వామికి రూ.4 లక్షలు ఇచ్చాడు. ఇలా సేకరించిన బ్యాంక్‌ పాస్‌బుక్‌లోని మొదటి పేజీలో సంబంధిత రైతు పేరును ఎడిట్‌ చేసేవాడు. రైతు బీమా, రైతు బంధు సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసేవాడు. అకౌంట్లతో లింక్ అయిన ఫోన్ నంబర్స్, డెబిట్ కార్డులను శ్రీశైలం మాత్రమే వినియోగించేవాడు. రైతు బీమా కోసం 7 అకౌంట్లను, రైతు బంధు కోసం 8 అకౌంట్లను ఉపయోగించాడు. 

తన భార్య మహేశ్వరి పేరుతో కూడా 4 అకౌంట్స్‌ ఓపెన్ చేయించాడు. మృతి చెందిన రైతులకు నామినీగా మహేశ్వరి పేరును చేర్చేవాడు. బ్యాంక్‌ పాస్‌బుక్‌లోని మొదటి పేజీలో ఎడిట్‌ చేసి పేర్లు మార్చి బీమా డబ్బులు క్లెయిమ్ చేసుకునేవాడు. మృతి చెందిన రైతులకు వ్యవసాయ భూమి లేకపోయినా ఉన్నట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసేవాడు. ఎల్‌ఐసీ ద్వారా ఒక్కో రైతుకు వచ్చే బీమా మొత్తం రూ.5 లక్షలు క్లెయిమ్‌ చేశాడు. అలాగే రైతు బంధు డబ్బుల డిపాజిట్ కోసం ఒక్కో అకౌంట్ ను 8 నుంచి 10 మంది రైతుల పేర్లతో వినియోగించాడు. 

ఆస్తులను స్వాధీనం చేసుకుంటం 

రైతు బీమా, రైతు బంధు ద్వారా కొట్టేసిన డబ్బుతో కొందుర్గులో 2.35 ఎకరాలు, తుమ్మలపల్లిలో 8.20 ఎకరాలు, కడ్తాల్‌‌‌‌, తలకొండపల్లిలో భూములు, ఓపెన్ ప్లాట్లను శ్రీశైలం కొనుగోలు చేశాడు. రైతు బంధుకు అర్హులైన రైతులను అతను మోసం చేసినట్లు వెల్లడైంది. శ్రీశైలం అవినీతిపై ఏసీబీకి సమాచారం అందిస్తాం. అతడు అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం.  
- అవినాశ్​ మహంతి, సీపీ, సైబరాబాద్‌‌‌‌