సగం మందికి ఇండ్లున్నయ్​!.. గృహలక్ష్మి కింద 47 మంది ఎంపిక

సగం మందికి ఇండ్లున్నయ్​!.. గృహలక్ష్మి కింద 47 మంది ఎంపిక
  •     ఖమ్మం జిల్లా బూడిదపాడులో సర్కారు సిత్రాలు 
  •     అర్హులకు బదులు అనర్హులకు ఇచ్చారంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో రాస్తోరోకో

ఖమ్మం టౌన్,వెలుగు : ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తుండగా, తాజాగా గృహలక్ష్మి పథకంలోనూ అక్రమాలు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదెంపాడు గ్రామంలో శుక్రవారం గృహలక్ష్మి పథకంలో అనర్హులను ఎంపిక చేశారంటూ నిరుపేదలు శుక్రవారం సర్పంచ్ షేక్ మీరా సాహెబ్ ఆధ్వర్యంలో ఇల్లెందు మెయిన్ ​రోడ్డుపై రాస్తోరోకో చేశారు.

ALSO READ: న్యాయం చేయాలంటూ..పీఆర్ఎల్ఐ ముంపు బాధితుల నిరసన

ఈ సందర్భంగా మీరా సాహెబ్ మాట్లాడుతూ గ్రామంలో గృహలక్ష్మి పథకం కింద 47 మందిని ఎంపిక చేశారని, ఇందులో సగానికిపైగా మందికి సొంత ఇండ్లు ఉన్నాయన్నారు. అర్హులైన  పేదలకు అన్యాయం జరిగిందన్నారు. వారు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ప్రస్తుతం ఫైనల్​ చేసిన లిస్టును రద్దు చేసి, మళ్లీ గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలని కలెక్టర్ గౌతమ్ ను కోరారు. ఆందోళనలో ఆరో వార్డు సభ్యుడు మంద గోపితో పాటు 4,7 వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఖమ్మంలో గృహలక్ష్మి స్కీంను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించడానికి ముందే అధికార పార్టీ సర్పంచ్ ఆధ్వర్యంలో నిరసన సెగ తగలడం చర్చనీయాంశంగా మారింది.