అంగట్లో ఔట్ సోర్సింగ్​ జాబ్స్.. మూడు లక్షల వరకు డిమాండ్!

అంగట్లో ఔట్ సోర్సింగ్​ జాబ్స్.. మూడు లక్షల వరకు  డిమాండ్!
  •  రూ.3 లక్షల వరకు  దండుకుంటున్న బ్రోకర్లు
  • మంచిర్యాల మెడికల్ కాలేజీలో 32 పోస్టులకు 3వేల అప్లికేషన్లు  
  • మావోళ్లకే ఇయ్యాలంటూ ఎమ్మెల్యేలు, లీడర్ల ఒత్తిళ్లు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల గవర్నమెంట్ ​మెడికల్​కాలేజీలో ఔట్​సోర్సింగ్​ పోస్టుల భర్తీ ప్రక్రియ కొందరు బ్రోకర్లకు వరంగా మారింది. జాబ్స్​పెట్టిస్తామని మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి దగ్గర రూ. రెండు నుంచి మూడు లక్షలు దండుకుంటున్నారు. మరోవైపు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. మావోళ్లకే జాబ్స్​ఇవ్వాలంటూ ఔట్​సోర్సింగ్​ఏజెన్సీతోపాటు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే ఓసారి అవినీతి, అక్రమాల ఆరోపణలతో నియామక ప్రక్రియ రద్దయింది. ఈసారి కలెక్టర్​ ఆధ్వర్యంలో మెరిట్​కమ్​రోస్టర్​ ప్రకారం ఎంపిక చేస్తే తప్ప అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు.   

నియామక ప్రక్రియ ఇలా...  

మెడికల్​ కాలేజీలో 32 ఔట్​సోర్సింగ్​పోస్టుల కాంట్రాక్ట్​ను సాన్వి సర్వీసెస్​ఔట్​సోర్సింగ్​ఏజెన్సీస్​కు అప్పగించారు. గత నెలలో నోటిఫికేషన్​జారీ చేసి డిసెంబర్​ 26 నుంచి 31 వరకు అప్లికేషన్లు స్వీకరించింది. డిసెక్షన్​ హాల్​అటెండెంట్స్​ 4, స్టోర్​కీపర్​ కమ్​క్లర్క్​3, ల్యాబ్​అటెండెంట్స్​4, పుస్తకదారులు/సహోద్యోగులు 7, రికార్డ్​​ అసిస్టెంట్స్​ 2, థియేటర్​ అసిస్టెంట్స్​ 4, స్టెనో టైపిస్ట్​ 1, స్టెనోగ్రాఫర్​1, డేటా ఎంట్రీ ఆపరేటర్​6.. మొత్తం 32 పోస్టులకు 3వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ప్రతి కేటగిరీలో మెరిట్ కమ్​రోస్టర్​విధానం పాటిస్తూ 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులను సెలక్షన్​ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్​గా, డిస్ట్రిక్ట్​ఎంప్లాయ్​మెంట్​ఆఫీసర్​కన్వీనర్​గా ఉంటారు. అడిషనల్​కలెక్టర్, డిస్ట్రిక్ట్​ ట్రెజరీ ఆఫీసర్​తో పాటు సంబంధిత డిపార్ట్​మెంట్​అధికారి ఒకరు మెంబర్స్​గా ఉంటారు. ఈ నియామకాలతో ఔట్​సోర్సింగ్​ఏజెన్సీకి గానీ, మెడికల్​కాలేజీ అధికారులకు గానీ ఎలాంటి సంబంధం ఉండదు.  

దళారుల వసూళ్ల దందా

ఒక్కో పోస్టుకు సగటున వంద అప్లికేషన్లు రావడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఇదే అదునుగా కొంతమంది దళారులు వసూళ్ల దందాకు తెరలేపారు. అభ్యర్థులకు మాయమాటలు చెప్పి రూ.లక్షలు దండుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు హైదరాబాద్​కు వెళ్లి మరీ డబ్బులు ముట్టజెప్పినట్టు సమాచారం. ఆయా కేటగిరీలకు రూ.15,600 నుంచి రూ.19,500 వరకు జీతం ఉండడంతో డిమాండ్​ను బట్టి రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలు గుంజుతున్నారు. నిరుడు మే నెలలో ఔట్​ సోర్సింగ్​ఏజెన్సీ ద్వారా కాకుండా మెడికల్​ కాలేజీ ద్వారా ప్రకటన ఇచ్చారు. అప్పుడు ఐదు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల ఎంపికలో అవినీతి, అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో నియామక ప్రక్రియ రద్దయింది. ఈసారి కూడా అదే రీతిలో వసూళ్లకు పాల్పడుతూ అభ్యర్థులను మోసం చేస్తున్నారు.

లీడర్ల ప్రెజర్​

 ఔట్​ సోర్సింగ్​ నియామకాల కోసం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నట్టు సమాచారం. మావోళ్లకు ఇయ్యాలంటే... మావోళ్లకే ఇయ్యాలె అంటూ ఏజెన్సీ నిర్వాహకులతో పాటు అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. జిల్లాలోని ఒక ఎమ్మెల్యే నాలుగు పోస్టులను తనవాళ్లకు ఇయ్యాలని కోరగా, ఎంపీ ఒక పోస్టు కోసం సిఫార్సు చేసినట్టు సమాచారం. మరో ఎమ్మెల్యే ఏకంగా అన్ని పోస్టుల్లో తనవాళ్లనే నియమించాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఇలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ లీడర్లు వారి మనుషులను నియమించాలని ప్రెజర్​ చేస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది.