అఫ్ఘానిస్థాన్​ ఇప్పుడైనా శాంతిస్తుందా?

అఫ్ఘానిస్థాన్​ ఇప్పుడైనా శాంతిస్తుందా?

అక్కడ తుపాకీ పేలని రోజు ఉండదు. జనం రాకెట్​ లాంచర్లు చేసే శబ్దాలకు అలవాటు పడిపోయారు. రోజుకు కనీసం పాతిక మంది అమాయకులు బలైపోయే అఫ్ఘాన్​​లో ఇప్పుడు సైలెంట్​ వాతావరణం ఏర్పడబోతోంది. 14 నెలల్లో అమెరికా సైన్యం వెనక్కి వెళ్లనుంది. తాలిబన్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సహకరించబోతున్నారు. కానీ, ఎనలిస్టులు మాత్రం అమెరికా ఆడే వార్​ గేమ్​లో ఇదొక మలుపు కావచ్చునంటున్నారు. 

కోల్డ్​ వార్ ప్రపంచంలో చేసిన కల్లోలానికి బలమైన ఉదాహరణ అఫ్ఘానిస్థాన్​. అమెరికా–సోవియట్​ యూనియన్​ల మధ్య కోల్డ్​వార్​ ముగిసిన 30 ఏళ్లకు అఫ్ఘాన్​లో శాంతి వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం కుదిరిన పీస్​ డీల్​పై అమెరికా తరఫున ఖలీల్​జాద్, తాలిబన్​ ప్రతినిధి ముల్లా బరాదర్​ సంతకాలు చేశారు. ఈ డీల్​ ప్రకారం అమెరికా సైన్యం వచ్చే ఏడాది ఏప్రిల్​లోగా పూర్తిగా అఫ్ఘానిస్థాన్​ని విడిచిపెట్టేసి వెళ్లిపోతుంది. తాలిబన్లు  హింసాత్మక చర్యలకు పాల్పడకుండా దేశంలో ప్రజా ప్రభుత్వం కొనసాగడానికి సహకరించాలి. తమకు ఆర్థికంగా, స్ట్రేటజీ పరంగా సహాయ సహకారాలందిస్తున్న అల్​ ఖైదాతో తెగతెంపులు చేసుకోవాలి. ఇవన్నీ అమెరికా కనుసన్నల్లో సాగుతాయి. పీస్​ డీల్​కి తాలిబన్​ కట్టుబడి ఉన్నట్లుగా అమెరికా నమ్మితేనే సైన్యం వెనక్కి వెళ్తుంది. ఈ ఒప్పందం కుదరడంకోసం ‘రిడక్షన్​ ఇన్​ వయొలెన్స్ (ఆర్​ఐవీ)’ పేరుతో వారం రోజులపాటు సైన్యం, తాలిబన్లు సెల్ఫ్​ టెస్ట్​ చేసుకున్నారు. ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం మొదలెట్టి, 28వ తేదీ శుక్రవారం వరకు తుపాకులకు రెస్ట్​ ఇచ్చారు. ఆర్​ఐవీ సెల్ఫ్​ టెస్టులో పాసయ్యాకనే పీస్​ డీల్​పై సంతకాలు జరిగాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే… అఫ్ఘానిస్థాన్​లో ప్రజలు ఎన్నుకున్న ప్రెసిడెంట్​ అష్రాఫ్​ ఘని ప్రమేయంగానీ, అఫ్ఘాన్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​గా ఉన్న అబ్దుల్లా అబ్దుల్లా ప్రమేయంగానీ ఈ పీస్​ డీల్​లో లేవు. అంటే, తాలిబన్ల వ్యవహారంపై అమెరికా సంతృప్తి చెందితేనే సెకండ్​ ఫేజ్​కి ఓకే చెబుతుంది. అప్పుడు అఫ్ఘాన్​ ప్రభుత్వంతో తాలిబన్లు చర్చలు జరుపుతారు. సంపూర్ణ శాంతి ఒప్పందానికి వీలు ఏర్పడుతుంది.

తాను రగిలించిన నిప్పును తానే ఆర్పాలని అమెరికా చేసిన ప్రయత్నం ఫలితంగానే డీల్​ కుదిరిందన్నది వాస్తవం. కోల్డ్​ వార్​ టైమ్​లో అఫ్ఘాన్​కి తూర్పు, దక్షిణ సరిహద్దుల్లో ఉన్న పాకిస్థాన్​ని అమెరికా తన చెప్పుచేతల్లో  ఆడించుకునేది. ఎక్కడో దూరంగా ఉన్న అమెరికా పెత్తనాన్ని అడ్డుకోవాలంటే, తనతో బోర్డర్​ పంచుకునే అఫ్ఘాన్​పై పట్టు సాధించాలని సోవియట్​ రష్యా అనుకుంది. అనుకున్నదే తడవుగా 1979లో సోవియట్​ సైన్యం అఫ్ఘాన్​లో ప్రవేశించి, తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. అప్పట్నుంచీ అమెరికా పదే పదే ప్రయత్నించి, చివరికి ముజాహిదీన్ల అండతో అఫ్ఘాన్​లో సివిల్​ వార్​ వరకు పరిస్థితిని తీసుకెళ్లింది.  ఈ క్రమంలోనే అల్​ ఖైదా నాయకుడు ఒసామా బిన్​ లాడెన్​నికూడా తెరపైకి తెచ్చింది. ముజాహిదీన్లకు దండిగా నిధులు, ఆయుధాలు లాడెన్​ ద్వారా అందేవి. 1989లో రష్యా సైన్యం వెనక్కి వెళ్లాక ప్రొ–అమెరికా ప్రభుత్వం ఏర్పడింది. మళ్లీ నాలుగేళ్లకు ముజాహిదీన్​లలో చీలిక తెచ్చి, తాలిబన్లను వేరు చేసింది అమెరికా. 1996 నుంచి 2000 వరకు సాగిన తాలిబన్ల పాలనలో అఫ్ఘాన్​ మత చాందసవాదంలోకి వెళ్లిపోయింది.

అమెరికా పన్నాగాలతో విసిగెత్తిపోయిన లాడెన్​… తన పోరాటాన్ని అమెరికాపైకి మళ్లించాడు. 2001 సెప్టెంబర్​ 11న ట్విన్​ టవర్స్​పై టెర్రరిస్టుల దాడి లాడెన్​ వల్లనే జరిగింది. దీంతో అమెరికా మరోసారి రంగంలో దిగింది.  అఫ్ఘానిస్థాన్​లోని అల్-ఖైదా ట్రైనింగ్​ సెంటర్లు లేకుండా చేయాలని టార్గెట్​ పెట్టుకుంది. అల్​ఖైదా సంస్థ చీఫ్​ ఒసామా బిన్ -లాడెన్‌ని అప్పగించకపోతే తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతం చేస్తామని హెచ్చరించింది. పాకిస్థాన్​లో దాక్కున్న లాడెన్​ని 2011లో మట్టుబెట్టింది. ట్విన్​ టవర్స్​ కూల్చేసినప్పట్నుంచి 19 ఏళ్లుగా అమెరికా సైన్యం అక్కడే ఉండిపోయింది.

డొనాల్డ్​ ట్రంప్​ ఎన్నికల హామీ ప్రకారం… మూడేళ్ళుగా తాలిబన్లతో రెగ్యులర్​గా చర్చలు జరుపుతోంది. టెర్రరిస్టులు రోజూ దాడులకు పాల్పడుతూ అమాయక జనాన్ని బలి తీసుకుంటున్నా సంప్రదింపుల ప్రక్రియను మాత్రం అమెరికా విడిచిపెట్టలేదు. రియల్​ ఎస్టేట్​ వ్యాపారిగా ట్రంప్​కి ఈ విషయంలో ఫుల్​ క్లారిటీ ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఆస్తులను అమ్ముకునేవాళ్లతో బేరమాడడానికి చాన్స్‌ ఉంటుందని ఆయనకు తెలుసు. ఈ ట్రిక్స్ ఉపయోగించే ముందుగా తాలిబన్లకు అందుతున్న నిధులు, ఆయుధాలపై నిఘా పెంచి, అడ్డుకోవడం మొదలెట్టారు. చొరబాటుదారులు అఫ్ఘాన్​ను ఆక్రమిస్తుంటే గట్టిగా అడ్డుకుంటూ అంతర్జాతీయంగా సపోర్ట్​ కూడగట్టారు. ఇప్పుడు శాంతి పల్లవి ఎత్తుకున్నారు.

తాలిబన్లతో అమెరికా శాంతి రాయబారి జల్మే ఖలీల్​జాద్​ కుదుర్చుకున్న ‘ఫ్రేమ్​వర్క్​ అగ్రిమెంట్’​లో ఈ అంశాన్ని చేర్చారు. అఫ్ఘాన్​లో పుట్టి పెరిగిన ఖలీల్ ​జాద్.. ట్రంప్​ తరఫున చర్చలకు పెద్ద మనిషిగా వ్యవహరించారు. తాలిబన్ల తలబిరుసు గురించి ఖలీల్​జాద్​​కు బాగా తెలుసు. పీస్​ డీల్​పై సంతకాలు చేసినప్పటికీ వాళ్ల తీరు నమ్మదగింది కాదని ఆయన ఉద్దేశం. అయితే, ట్రూప్​లను వెనక్కి తీసుకెళ్లే విషయంలో ట్రంప్​ మొండి పట్టుకు అడ్డు చెప్పలేకపోయారు. ఖలీల్​ పరిస్థితి ప్రెసిడెంట్​ డెడ్​లైన్​కి లోబడి పనిచేసినట్లుగా ఉంది. ఆయనపై ట్రంప్​ ఒత్తిడి లేకపోతే… ఆర్మీని వెనక్కి రప్పించడంకన్నా​ సీజ్‌ ఫైర్‌, బందీల విడుదల వంటి అంశాల్ని చర్చకు తెచ్చేవారని అఫ్ఘాన్​ వ్యవహారాలు తెలిసిన ఎక్స్​పర్ట్​లు అంటున్నారు.

పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఒప్పందం ప్రకారం తాలిబన్లు తుపాకుల్ని నీళ్లలో ముంచేస్తారని, అమెరికా మిలటరీ వెనక్కి వెళ్లిపోతుందని అనుకుంటున్నారు. అఫ్ఘాన్​ జనంలో, ముఖ్యంగా ఆడవాళ్లలోమాత్రం ముప్పై ఏళ్ల కిందటి పరిస్థితులు మళ్లీ ఏర్పడతాయన్న భయం లేకపోలేదు.

ఖైదీల్ని వదలడానికి ససేమిరా!

పీస్​ డీల్​పై సంతకాల తడి అలాగే ఉంది. తాలిబన్లను క్షమించేది లేదని అఫ్ఘానిస్థాన్​ ప్రెసిడెంట్​ అష్రాఫ్​ ఘనీ తెగేసి చెబుతున్నారు. అఫ్ఘాన్​ జైళ్లలో బందీలుగా ఉన్న వేలాదిమంది తాలిబన్లను వదిలిపెట్టనని చెప్పారు. రెగ్యులర్​గా ఎటాక్స్​, కౌంటర్​ ఎటాక్స్​ చేస్తూ అమెరికా సైన్యం, తాలిబన్లు ఊపిరి సలుపుకోవడం లేదు. డీల్​ అమలుకు 14 నెలల కూల్​ పీరియడ్ ఉంది. ఈలోగా అఫ్ఘాన్​ ప్రభుత్వం తాలిబన్​ టెర్రరిస్టుల్ని వదిలిపెట్టాలి. పీస్​ డీల్​ పేరుతో తాలిబన్లు ఓపెన్​గా తిరిగే అవకాశాలుంటాయి. అమెరికా సైన్యంపై వత్తిడి తగ్గుతుంది.  ఏ రకంగా చూసినా… శాంతి ఒప్పందం​వల్ల అమెరికాకే ప్రయోజనం ఉందని ఎనలిస్టుల అంచనా.

అమెరికా ఖర్చు $ 82 వేల కోట్లు

అఫ్ఘానిస్థాన్​ను అమెరికా తొలిసారిగా 2001 అక్టోబర్​లో ముట్టడించింది. ఆ దేశం నుంచి తాలిబన్లను తరిమి కొట్టడానికే ఆ పని చేసింది. తమ దేశంపై జరిగిన 9/11 ఎటాక్​లకు సూత్రధారి అయిన అల్​ ఖైదా టెర్రరిస్ట్​ గ్రూప్​ చీఫ్​ ఒసామా బిన్​ లాడెన్​ను, ఆ సంస్థకు చెందిన ఇతర లీడర్లను దాచిపెట్టారనే కోపంతో వాళ్ల అంతు చూడటానికి రంగంలోకి దిగింది. అఫ్ఘాన్​​లో తాలిబన్ల తిరుగుబాటు అణచివేతకు, ఆ దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవటానికి పెద్ద సంఖ్యలో బలగాలను దింపింది. లక్షల డాలర్లు ఖర్చుపెట్టింది.

అఫ్ఘాన్​లోకి ఎంటరైనప్పటి (2001 అక్టోబర్​) నుంచి 2019 సెప్టెంబర్​ వరకు పెట్టిన ఖర్చు 77,800 మిలియన్​ డాలర్లని అమెరికా చెప్పింది. నేలమట్టమైన కనీస వసతులను తిరిగి అందుబాటులోకి తేవటానికి​ స్టేట్​ డిపార్ట్​మెంట్​.. ఏజెన్సీ ఫర్​ ఇంటర్నేషనల్​ డెవలప్​మెంట్​, ఇతర గవర్నమెంట్​ ఏజెన్సీల వద్ద 44,00 మిలియన్​ డాలర్లు ఇప్పించింది. దీంతో మొత్తం ఖర్చు 82,200 మిలియన్​ డాలర్లు అయింది. అఫ్ఘాన్​​లో చేపట్టాల్సిన ఆపరేషన్ల కోసం అమెరికా పాకిస్థాన్​ని బేస్​ చేసుకుంది. ఆ దేశానికి బోలెడు డబ్బు ఇచ్చింది. దాన్ని ఇందులో కలపలేదు.

తాలిబన్లపై యుద్ధం కోసం అమెరికా ఏటా దాదాపు 100,00 మిలియన్​ డాలర్లు కేటాయించినట్లు లెక్కలు చెబుతున్నాయి. టెర్రరిస్టులను ఎదుర్కోవటంపైనే కాక అఫ్ఘాన్​ ఆర్మీకి ట్రైనింగ్​ ఇవ్వటంపైనా యూఎస్​ ఫోకస్​ పెట్టింది. దీంతో ఖర్చు ఊహించినదాని కన్నా పెరిగింది. 2016–18లో ఏడాదికి సుమారు 40,00 మిలియన్​ డాలర్లు అయిపోయేవి. 2019లో సెప్టెంబర్​ నాటికే 38,00 మిలియన్​ డాలర్లు అవసరమని అంచనా వేశారు.

ఈ డబ్బులో ఎక్కువ శాతాన్ని తాలిబన్ల తిరుగుబాటును కట్టడి చేయడానికే ఖర్చు చేశారు. అమెరికా జవాన్ల తిండి తిప్పలు, బట్టలు, మందులు, స్పెషల్​ పేతోపాటు ఇతర ప్రయోజనాలకు కొంత ఇచ్చారు. 16 శాతం ఫండ్స్ ​(13,700 మిలియన్​ డాలర్లు) కనీస వసతుల కల్పనకు కేటాయించారు. సగానికిపైగా నిధులు (86,00 మిలియన్​ డాలర్లను) అఫ్ఘాన్​ నేషనల్​ ఆర్మీ సహా పోలీస్​ తదితర సెక్యూరిటీ ఫోర్స్​ల బలోపేతానికి సరిపోయాయి. మిగతా బడ్జెట్​ను పాలన, యాంటీ డ్రగ్​ కార్యకలాపాలు, ఎకనమిక్​ ప్రోగ్రామ్స్​, హ్యుమానిటేరియన్​ సర్వీసులకు వాడారు.

పాక్​ ఆలోచన  వేరు

అఫ్ఘానీయుల విషయానికి వస్తే… తాలిబన్లను, పాకిస్థాన్​ను బుజ్జగిస్తూ అమెరికా ఈ కథంతా​ నడిపించడంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇది అఫ్ఘాన్​ దేశభక్తులకు, తాలిబన్లకు మధ్య మరో యుద్ధానికి దారి తీస్తుందని ఆందోళన చెందుతున్నారు ఎనలిస్టులు. తాలిబన్లతో అఫ్ఘాన్ సైన్యం 1994–2001 నడుమ సొంతంగానే తలపడింది. వేరే దేశాల సపోర్ట్​ తీసుకోలేదు. ఈ ప్రాసెస్‌లో పాకిస్థాన్‌ స్వలాభంకూడా ఉంది. తాలిబన్లతో ఖలీల్​జాద్​ చర్చలకు పాకిస్థాన్​ సహకరించింది. దీని వెనక… అమెరికాతో ఆర్థిక, సైనిక సాయాన్ని తిరిగి పొందాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ వంటివి పాకిస్థాన్​ని ఎంకరేజ్​ చేశాయి. మతపరమైన మైనారిటీలు, మహిళలు, ముస్లిమేతరుల పట్ల ఓర్పుతో, సహనంతో వ్యవహరించాలనే ప్రయత్నాన్ని తాలిబన్లు ఇప్పటివరకూ చేయకపోవటం గమనించాల్సిన విషయమే.

పదేళ్లలో చనిపోయినోళ్లే లక్ష మంది

2001 నుంచి తాలిబన్లతో నాన్​–స్టాప్​గా చేస్తున్న యుద్ధంలో అమెరికా సోల్జర్లు 2,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20,660 మంది గాయపడ్డారు. 2010–12లో అఫ్ఘాన్​లో అమెరికా సైనికుల సంఖ్య లక్ష చిల్లర ఉండేది. పోయినేడాది చివరి నాటికి​ 13 వేలకు తగ్గింది. వీరికితోడు మరో 11 వేల మంది అమెరికన్లు ఆ దేశంలో ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. 2009–19లో అఫ్ఘాన్​​లో చనిపోయిన, గాయపడ్డవారి సంఖ్య లక్షకు పైనేనని ఆ దేశంలోని యునైటెడ్​ నేషన్స్​ అసిస్టెన్స్ మిషన్ (ఉనామా) చెప్పింది. ఈమధ్య అఫ్ఘాన్​ అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సెక్యూరిటీ ఫోర్స్ రోజుకు యావరేజ్​గా 30–40 మధ్య నమోదైందని కొన్ని మీడియా రిపోర్ట్​లు చెప్తున్నాయి. యుద్ధంలో ఎంత మంది సైనికులు, ప్రజలు మృతి చెందారనే విషయాన్ని మొదట్లో అఫ్ఘానిస్థాన్​, అమెరికా చెప్పేవి కావు. కానీ..​ 2014లో అష్రాఫ్​ ఘనీ ప్రెసిడెంటయ్యాక ఈ వివరాలను బయట పెట్టారు.

అఫ్ఘాన్​ను అల్లాడించిన తాలిబన్లు

ఇస్లాం మత రక్షణ పేరుతో హింసకు మారుపేరులా మారి అఫ్ఘానిస్థాన్​, పాకిస్థాన్​లను ముప్పు తిప్పలు పెడుతున్న తాలిబన్​ సంస్థ 1994లో పుట్టింది. రెండు దేశాల్లోనూ పాతికేళ్లకు పైగా అరాచకం సృష్టిస్తోంది. ముల్లా ఒమర్: తాలిబన్ ఫౌండర్, స్పిరుచ్యువల్​ లీడర్. 2013లోనే అఫ్ఘానిస్థాన్​లో చనిపోయినా ఈ విషయాన్ని అటు ఆ దేశ ప్రభుత్వం గానీ ఇటు తాలిబన్లు గానీ రెండేళ్ల దాకా ఖాయం చేయలేదు.ముల్లా అక్తర్ మన్​సూర్: ఒమర్​ తర్వాత ‘కమాండర్’​గా ఎన్నికయ్యాడు. 2016లో అమెరికా డ్రోన్​ దాడి​లో హతమయ్యాడు. అబ్దుల్​ ఘనీ బరాదర్​: తాలిబన్​​ కో–ఫౌండర్లలో ఒకడిగా, డిప్యూటీ లీడర్​గా చెబుతారు. హెరాత్​, నిమ్రుజ్​ ప్రావిన్స్​లకు గవర్నర్​గా చేశారు. పాక్​​ మిలటరీ 2010లో బంధించి 2018లో యూఎస్​ రిక్వెస్ట్​తో విడుదల చేసింది. హిబతుల్లా అకుంద్​జదా:  అక్తర్​ తర్వాత కమాండర్​ అయ్యాడు. కానీ ఈ పోస్టులో కొద్ది రోజులే ఉన్నాడు. ఇతన్నీ అమెరికాయే డ్రోన్​ ఎటాక్​లో మట్టుబెట్టింది.

ముల్లా ఒబైదుల్లా అకుంద్​

సీనియర్​ లీడర్​. తాలిబన్​ ప్రభుత్వంలో డిఫెన్స్​ మినిస్టర్​. 2007లో పాకిస్థాన్​ పట్టుకొని జైల్లో పెడితే 2010లో గుండె సంబంధ జబ్బుతో చనిపోయాడు.

వాళ్ల అరాచకాలకు అంతే లేదు

తాలిబన్ల అరాచకాలు, అఘాయిత్యాలకు అంతే లేదు. నిజానికి తాలిబన్ అంటే  స్టూడెంట్ అని అర్థం. అయితే తాలిబన్లకు తెలిసిన చదువు ఒకటే. అదే హింస…బాంబులు పేల్చడం…. అమాయకుల ఉసురుతీయడం. అంతకుమించి మరో చదువు వాళ్లకు తెలియదు. చదువుకునేవాడని పేరు పెట్టుకుని అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుంటారు.

బుద్ధ విగ్రహాల ధ్వంసం

కళాత్మక దృష్టితో చూడాల్సిన బమియన్ బుద్ధ విగ్రహాలను మూర్ఖత్వంతో తాలిబన్లు ధ్వంసం చేశారు. అఫ్ఘానిస్థాన్ లోని హజరాజత్ ప్రాంతంలోని బమియాన్ లోయ దగ్గర ఇసుకరాతి కొండల్లో ఈ విగ్రహాలను చెక్కారు. తమ నాయకుడైన ముల్లా ఒమర్ ఆదేశాలు ఇవ్వడంతో అద్భుతమైన కళా ఖండాలుగా పేరున్న రెండు పెద్ద విగ్రహాలను 2001లో తాలిబన్లు డైనమైట్లతో ధ్వంసం చేశారు.

భయపడుతున్న మహిళలు

అఫ్ఘానిస్థాన్​​​లో ప్రశాంత వాతావరణం కోసం శాంతి ఒప్పందం చేసుకోవటం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఆ దేశంలోని ఆడవాళ్లు మాత్రం ఆందోళన చెందుతున్నారు. 2001లో అఫ్ఘాన్​లోకి అమెరికా ఆర్మీ రాకముందు ఐదేళ్లు తాలిబన్లదే రాజ్యం. జనానికి నరకం చూపించారు. అమెరికా మిలటరీ వెనక్కి వెళితే తాలిబన్లు మళ్లీ పెత్తనం చెలాయిస్తారేమోనని వణికిపోతున్నారు.  తాలిబన్​ పేరు చెబితేనే అఫ్ఘాన్​ ఆడవాళ్లు భయపడిపోతున్నారు. ‘తాలిబన్ల మైండ్​సెట్​ మారనంత కాలం మాకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. మా హక్కుల్ని కాపాడతామంటూ వాళ్లు చెప్పే కబుర్లు నమ్మొద్దు’ అని స్టూడెంట్లు, ప్రొఫెషనల్స్​, హౌస్​​వైఫ్​లు హెచ్చరిస్తున్నారు. తాము బయటికి వెళ్లకపోతే, ఉద్యోగాలు చేయకపోతే కుటుంబాలు గడవటం కష్టమని ఆవేదన చెందుతున్నారు.

ఆడవాళ్లంటే బానిసలే!

తాలిబన్ల దారుణాలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది మనుషుల అక్రమ రవాణా. ముఖ్యంగా ఆడవాళ్లను పట్టుకెళ్లి వాళ్లను బానిసలుగా అమ్మేసేవారు. ఇలా పట్టుకెళ్లిన ఆడవాళ్లను ఎడారిలో టెంట్లు వేసి అక్కడ దాచేవారు. చాలా చిత్రహింషలు పెట్టేవారు. ఎవరూ దగ్గరకు రాకుండా పహారా పెట్టేవారు. మంచి బేరం కుదరగానే టెంట్ల నుంచి తీసుకెళ్లి మార్కెట్లో కూరగాయలు అమ్మినట్లుగా డబ్బుకోసం ఆడవాళ్లను బానిసలుగా అమ్మేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీనిపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

అమ్మాయిలను స్కూళ్లకెళ్లనీయరు

ఆడవాళ్ల పట్ల తాలిబన్లు  ప్రవర్తించే తీరు చాలా దారుణంగా ఉంటుంది. అమ్మాయిలు స్కూళ్లకు వెళ్లి చదువుకుంటే తాలిబన్లు సహించేవారు కాదు. స్కూళ్లు. కాలేజీల నుంచి వెళ్లిపోవలసిందిగా హుకుం జారీ చేసేవారు. అంతే…మర్నాటి నుంచి అమ్మాయిలు ఎవరూ స్కూళ్లకు వెళ్లేవారు కాదు. కాదు కూడదని ఎవరైనా వెళితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవలసిందే. ఆడపిల్ల అని కూడా చూడకుండా బుల్లెట్స్ కురిపిస్తారు. స్కూల్​కు వెళ్లడానికి అమ్మాయికి పర్మిషన్ ఇస్తే వాళ్ల అమ్మానాన్ననుకూడా కాల్చి పారేస్తారు.

ఆచారాలు పాటించాల్సిందే

ఆడవాళ్ల విషయంలో తాలిబన్లు చాలా సీరియస్​గా ఉంటారు. ఆడవాళ్లు ఎవరైనా షాపింగ్ కెళితే పక్కన తండ్రో, తోబుట్టువో ఇలా ఎవరైనా తోడుగా ఉండాల్సిందే. రక్త సంబంధం లేని మగవాళ్లతో కలిసి కిరాణా కొట్టుకు వెళ్లినా తాలిబన్లు ఊరుకోరు. చేయరాని తప్పు చేసినట్లు భావిస్తారు. నడిరోడ్డుపై ఆ మహిళలను తీవ్రంగా కొడతారు. ఇలాంటిదే ఓ  సంఘటనలో ఓ మహిళకు వంద కొరడా దెబ్బలు కొట్టి కానీ తాలిబన్లు శాంతించలేదు.

ఫుడ్ కూడా అందచేయలేదు

అఫ్ఘానిస్థాన్​లో తిండిలేక నానా ఇబ్బందులు పడుతున్న వారి విషయంలోకూడా తాలిబన్లు చాలా క్రూరంగా ప్రవర్తించారు. దాదాపు 1,60,000 మందికోసం ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం’ కింద యునైటెడ్ నేషన్స్ ఆహార పదార్థాలను పంపింది. అయితే, యునైటెడ్ నేషన్స్ పంపిన ఈ ఆహార పదార్థాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరో ఫుడ్ పంపితే దానిని ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు  కూడా కావాలని అందచేయకుండా క్రూరంగా వ్యవహరించారు.