గోల్డ్​ కొనేందుకు ఇదే మంచి టైమ్​!

గోల్డ్​ కొనేందుకు ఇదే మంచి టైమ్​!

న్యూఢిల్లీ : బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.50 శాతం నుండి 12.50 శాతానికి పెంచిన తర్వాత, దీని ధర మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్​)  రిటైల్ దేశీయ మార్కెట్లలో పెరిగి రూ.51,950 స్థాయిల వద్ద ముగిసింది. స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2.81 డాలర్లు పెరిగి 1810.10 డాలర్ల వద్ద ముగిసింది. అందుకే  ఈ వారంలో దేశీయ మార్కెట్‌‌లో పుత్తడి రేట్లు పెరిగాయి. నిజానికి ఈ ఫైనాన్షియల్​ ఇయర్ మొదటి క్వార్టర్​లో బంగారం ధర 6.74 శాతం తగ్గింది. బులియన్ ఎక్స్​పర్టులు అభిప్రాయం ప్రకారం, బంగారం ధర ఎంసీఎక్స్​లో రూ.50,600 వద్ద,  స్పాట్ మార్కెట్‌‌లో  1770 డాలర్ల వద్ద కీలక మద్దతు కంటే బాగానే ఉంది. ఆయా మార్కెట్లలో ఈ మద్దతు స్థాయిలు చెక్కుచెదరకుండా ఉండే వరకు  ప్రతి డిప్‌‌లో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేయాలని సూచించారు.  

ఐఐఎఫ్​ఎల్​ సెక్యూరిటీస్‌‌లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ ‘‘స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1770 డాలర్ల వద్ద దాని ప్రధాన మద్దతు కంటే ఎక్కువగా నిలుపుకోగలిగింది. శనివారం స్పాట్ బంగారం ధర  1770 డాలర్ల నుండి  1835 డాలర్ల రేంజ్​లో ఉంది. ఈ చిన్న అడ్డంకిని  1835 డాలర్ల స్థాయిల వద్ద దాటేస్తే, స్పాట్ గోల్డ్ తదుపరి లక్ష్యం 1865  డాలర్లు,1900 డాలర్ల వరకు ఉంటుంది. స్పాట్ బంగారానికి 1770 డాలర్ల   వద్ద బలమైన సపోర్ట్​ దొరుకుతోంది. దీంతో స్పాట్​ ధర  1790 డాలర్ల  –  1800 డాలర్ల మధ్య కదిలే చాన్స్​ ఉంటుందని ఎనలిస్టులు అంటున్నారు. బంగారం కొనేందుకు ఇది మంచి సమయం. షార్ట్ పొజిషన్‌‌ను తీసుకోకుండా,  స్వల్పకాలానికి 'బై ఆన్ డిప్స్' వ్యూహాన్ని కొనసాగించాలి’’  అన్నారు.