అవినీతి, అక్రమాలు తేలాలంటే.. ఘోష్ కమిషన్ నివేదిక సరిపోయేనా?

అవినీతి, అక్రమాలు తేలాలంటే.. ఘోష్ కమిషన్ నివేదిక సరిపోయేనా?

కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్. దాని గురించి ఏది చెప్పినా కనీవినీ ఎరుగని రీతిలో ఉంటాయి. కేవలం నిర్మాణ సమయమే కాదు, భారీ మోటార్ల దగ్గర నుంచి అతి భారీ మూటల దాక, నీటి నిలువ సామర్థ్యమే కాక విలువలకు సమాధి వరకు, అన్నీ గొప్పగా చెప్పుకునే విధంగా ఉన్నాయి. ఏకవ్యక్తి నిర్ణయాల నుంచి బహుముఖ వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి. 

కాళేశ్వరం నిర్మాణం ద్వారా రాజకీయ పునాదులు గట్టిగా చేసుకుందామని ఒక నాయకుడు తలిస్తే దాని వైఫల్యం ద్వారా రాజకీయ ప్రయోజనాలు సుస్థిరం చేసుకుందామని ఇంకా రెండు జాతీయ పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మూడు పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏదోవిధంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇంజినీర్లు, ఇంకా ఇతరులు కాస్త అటుఇటుగా పార్టీలు ప్రస్తావిస్తున్న అంశాలను తిరగతోడుతున్నారు. దీనికి సంబంధించి ప్రజల ముందు అనేక అంశాలు ఉన్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 3 సాధికార నివేదికలు ఉన్నాయి – కాగ్, విజిలెన్స్, ఘోష్ కమిషన్. ఇవిగాక వ్యక్తులు సొంత పరిశోధన చేసి వెలికితీసిన అనేక కోణాలు కూడా ఉన్నాయి. 2015 నుంచి దీనిమీద మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. వాదోపవాదాలు జరుగుతున్నాయి. అచ్చంగా ప్రజలకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల, చర్చల వల్ల, తదుపరి విచారణ వల్ల ఏం ఒరిగింది? అనే ప్రశ్న 
నాకు తరచూ అనిపిస్తుంది.

తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్టులు కొత్త కాదు. అయితే కాళేశ్వరం ఒక భారీ ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతల ప్రాజెక్టులు చిన్నవైనా, పెద్దవైనా నిర్వహణ ఖర్చులు భారమే.  నిర్మాణ ఖర్చులు,  నిర్వహణ ఖర్చులు కలిపి తడిసిమోపెడు అయినాయి. ఏండ్లకు ఏండ్లు ఈ ఖర్చుల భారం భరించని ప్రభుత్వాలు, అధికారులు నిర్లక్ష్యానికి గురి అయ్యి ఎత్తిపోతల పథకాలు అనేకం నిర్వీర్యం కూడా అయినాయి. అటువంటి ఎత్తిపోతల పథకాల అనుభవం ఉన్నా భారీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం  ఆలోచన గత తెలంగాణ  ముఖ్యమంత్రికి వచ్చింది. నీటిని ఎక్కడికి అక్కడ ఆపుకుని, ఉపయోగించుకునే  సాగునీటి ప్రాజెక్టులు (చెరువులు) అనేకం ఉన్నాయి. 

వాటిమీద పెట్టుబడి పెట్టకుండా, మన నెత్తిన పడ్డ వర్షాన్ని, మన కాళ్ళ కింద నుంచి సుదూరంగా ఉన్న మేడిగడ్డకు పారినాక మళ్లీ మనదాకా ఎత్తిపోసే ఆలోచన సుస్థిరమైనది కాదు. సున్నితంగా చెప్పాలంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచనలో ఉన్న డొల్లసూత్రం అప్పడప్పుడూ  ప్రస్తావనకు వచ్చినా దాని మీద మాత్రం కూలంకషంగా చర్చలు జరగలేదు. అయితే ఈ ఏకవ్యక్తి ఆలోచన మీద దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి జరిగింది. ఇంత భారీ పెట్టుబడితో కూడిన నిర్వహణ ఖర్చులు గురించిన లోతైన చర్చ జరగలేదు. 

అనుమతుల కంటే ముందే నిర్మాణాలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ శాసనసభలో చర్చించిన తరువాత ముందుకు సాగింది. శాసనసభలో చర్చ జరిగిన దాదాపు రెండేండ్ల తరువాత వివిధ సంస్థలు అనుమతులు ఇచ్చాయి. మార్చి 2017 నుంచి మే 2018 మధ్య కాళేశ్వరం ప్రాజెక్ట్ తొమ్మిది ప్రధాన అనుమతులను పొందింది. ప్రాజెక్ట్  వివిధ భాగాలు  ప్యాకేజీల కోసం మార్చి 2022 నాటికి 73ప్రత్యేక పరిపాలనా అనుమతులు మంజూరు అయ్యాయి. అయితే,  అనుమతుల  తోవ  నెమ్మది కాగా, ప్రాజెక్టు నిర్మాణం 10 అడుగులు ముందు ఉన్నది అని ఘోష్ కమిషన్ చెప్పింది. 

మరి, అనుమతులు దేనికి? ఇట్లాంటి నూకుడు వ్యవహారాలు ఇంకా జరగకుండా, అనుమతుల ప్రక్రియలో మార్పులు తీసుకురావాలి. అనుమతులు లేకుండా పనులు చేపడితే బాధ్యుల మీద తీవ్రచర్యలకు ఆస్కారం ఉండే చట్టం రావాలి.  ప్రస్తుతం మాత్రం అనుమతులు లేకుండా పనులు చేపట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసినా శిక్షలు పడే అవకాశం లేదు.

అనుమతుల దరఖాస్తుల్లో తేడాలు

కాళేశ్వరం అనుమతుల ప్రక్రియలలో  ఇంకొక కోణం ఉన్నది. అనుమతులకు ఇచ్చిన దరఖాస్తు, దస్త్రాలు, సమాచారం డేటాలో తేడాలు ఉండడం. అదే ప్రాజెక్టు సమాచారం వివిధ సంస్థల దగ్గర వివిధ రకాలుగా ఉండడం. ఈ కోణం ఘోష్ కమిషన్ విశదీకరించి ఉండాల్సింది.  కీలకంగా, ఇక్కడ ఆనాటి ప్రభుత్వ అధికారులు అనుసరించిన చాణక్య పద్ధతి ఏమిటంటే అవసరంబట్టి ప్రాజెక్టు ప్రతిపాదనలలో మార్పులతో ‘దరఖాస్తు’ చేయడం. శాసనసభలో చెప్పినదానికి ఆ తరువాత సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతిపాదనలలో అనేక మార్పులు వచ్చినాయి. ఈ విషయం మరి ఘోష్ కమిషన్ ప్రస్తావించిందో లేదో పూర్తి నివేదిక చూస్తే తెలుస్తుంది.

 అనుమతుల్లో కేంద్రసంస్థల వ్యవహారం 

కేంద్ర సంస్థలు తమ ముందు వచ్చిన దరఖాస్తులలో ఉన్న  తేడాలు   లేదా మార్పులను పసిగట్టి వాటిని సరిచేసేపని ఎందుకు చేయలేకపోయినాయి? స్థూలంగా, కాళేశ్వరం విషయంలో  కేంద్ర సంస్థల వ్యవహారం ఒక లోతైన సమస్యను ప్రతిబింబిస్తున్నది. - మేఘా  కంపెనీ నిర్మాణ ప్రాజెక్టులలో  పారదర్శకమైన  పర్యవేక్షణ లేకపోవడం. ఇప్పటికైనా ఆయా ఏజెన్సీలు తమ అంచనాలను పునఃపరిశీలించి ప్రజలకు వాస్తవాలు చెప్పడం అవసరం. 

ప్రధాన కాంట్రాక్టర్ విచారణలో భాగం కాదా?

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రధాన కాంట్రాక్టర్  ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ ఇది సివిల్ పంపింగ్ మౌలిక సదుపాయాలలో అధిక భాగాన్ని నిర్వహించింది.  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల  వంటి కీలకమైన వాటితో సహా 22 పంప్ హౌస్‌‌‌‌లలో 15 పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లను కంపెనీ నిర్మించింది. మేఘా సంస్థ 100కి పైగా పంపింగ్ యంత్రాలను కూడా ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ అంతటా సబ్‌‌‌‌స్టేషన్లు, ట్రాన్స్​మిషన్ లైన్లతో సహా విస్తృతమైన విద్యుత్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. 

ఎలక్ట్రో-మెకానికల్ భాగాల  కోసం బీహెచ్​ఇఎల్​ ప్రాథమిక కాంట్రాక్టర్ కాగా,  బ్యారేజీలను ఎల్ అండ్ టి, ఆఫ్కాన్స్, నవయుగ నిర్మించాయి. అయితే ఘోష్ కమిషన్ కేవలం ఎల్ అండ్ టి సంస్థ మీదనే దృష్టి కేంద్రీకరించడానికి కారణం ఏమిటి? బహుశ కమిషన్ ఏర్పాటులో నిర్దేశించిన పరిమిత లక్ష్యాలు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధాన కాంట్రాక్టర్ అయిన మేఘా సంస్థను కమిషన్ విచారణకు పిలిచిందా? మేఘా సంస్థతో ఎల్ అండ్ టి సంస్థ చేసుకున్న ఒప్పందం దాని వివరాలు విచారణలో భాగం అయినాయో లేవో తెలియదు. 

విచారణ మూడు బ్యారేజీలకే పరిమితం  

కాళేశ్వరం ప్రాజెక్ట్ న్యాయ విచారణ కమిషన్ టర్మ్స్ అఫ్  రిఫరెన్స్ 3 బ్యారేజీలకే  పరిమితం చేశారు.  ఘోష్ కమిషన్ మొత్తం ప్రాజెక్ట్ గురించి విచారణ చేయలేదు.  విచారణ అక్కడికే పరిమితం చేస్తే, గుర్తించిన అవకతవకలు, అవినీతి వగైరా కూడా అక్కడికే పరిమితమా? మొత్తం ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం విచారణ చేయకపోవడం గమనార్హం.  ఉత్తర్వులలో ఘోష్​ కమిషన్ విచారణ పరిధి కేవలం 6 అంశాలకు పరిమితం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో నిర్లక్ష్యం, అవకతవకలు, లోపాలను విచారించడం మొదటి లక్ష్యంగా పేర్కొన్నారు. 

మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆరోపణలున్న నేపథ్యంలో, కమిషన్ పరిధి మొత్తం ప్రాజెక్టుకు కాకుండా ఈ మూడు బ్యారేజీలకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పరిమితం చేసింది?  కాంట్రాక్టు ఇచ్చిన పద్ధతి,  కాంట్రాక్టు అమలు చేసిన తీరు,  పాటించిన ఆర్థిక  క్రమశిక్షణ, వగైరా వాటి మీద విచారణ చెయ్యాలి.   ఘోష్   కమిషన్ నివేదిక ఇచ్చిన పరిధికే పరిమితమా లేక మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు వర్తిస్తుందా అని విషయాన్ని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.  మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిపించాలి.

 ఆర్థిక పరమైన ఆడిట్​ చేస్తేనే అవినీతి బయటపడుతుంది

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది అని ఆరోపణలు చూస్తున్నాం. మొత్తం పెట్టుబడి లక్ష కోట్లు అయితే ఆసాంతం అవినీతి సొమ్ముగా భావించలేము. అవినీతి లెక్కలను నిర్ధారించే ఆర్థికపరమైన ఆడిట్ అవసరం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతి పనికి అంచనాలు ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, 
కాంట్రాక్టర్​కు ఇచ్చింది ఎంత వగైరా లెక్కలను ఆడిట్ చేయడం ద్వారా అవినీతి సొమ్ము నిర్ధారించవచ్చు. ఘోష్ కమిషన్ అవినీతి వివిధ రూపాలలో జరిగినట్లు నిర్ధారించింది కానీ, ప్రజాధనం ఆడిట్ చేయలేదు.  ఆడిట్ చేస్తే అవినీతి ఎక్కడ జరిగింది, ఎవరి పాత్ర ఉండే అవకాశం ఉంది, ఏ రూపంలో ఎవరు లబ్ధి పొందారు వగైరా అంశాలు నిగ్గు తేల్చవచ్చు.

కాళేశ్వరం ప్రాజెక్టు దస్త్రాలు, ఫైళ్ళు సరిగా లేవు, కొన్ని కనపడడం లేదు, కొన్ని పోయినాయి, వగైరా వార్తలు చూస్తున్నాం. ఏకంగా మంత్రివర్గ సమావేశాల దస్త్రాలు లేవు అంటున్నారు. మంత్రివర్గం అనుమతులు తీసుకోకుండా అనేక ఉత్తర్వులు జారీ చేశారు అని ఘోష్ కమిషన్ నిర్ధారించింది. విచారణ పరిధి తక్కువ కాబట్టి ఘోష్ కమిషన్ కాళేశ్వరం పబ్లిక్ రికార్డుల విషయంలో లోతుగా పరిశీలించినట్లు లేదు. మొదటగా, ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్రభుత్వ ఉత్తర్వులను, ప్రతిపాదనలు, డిపిఅర్ లు, నివేదికలు, ఫైళ్ళను  బహిరంగపరచాలి.

భవిష్యత్తులో ఉండాల్సిన విధానాలు 

కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ నివేదికలో వివిధ రూపాలలో జరిగిన తప్పులు, లోపాలు, అవకతవకలు నేపథ్యంలో మిగతా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో, భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధి, విధానాలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. నిర్మాణంలో ఉన్న పాలమూరు, ప్రతిపాదిస్తున్న కొడంగల్ ఇంకా ఇతర ఎత్తిపోతల పథకాల డిజైన్, రూపకల్పన, ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ వగైరా అంశాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధమైన దిద్దుబాటు చర్యలు చేపడతాయో వేచి చూడాల్సిందే.


 ‘కాళేశ్వరం కార్పొరేషన్’ పై లోతైన విచారణ జరగాలి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వహణకు అప్పటి ప్రభుత్వం ప్రత్యేక కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కంపెని చట్టానికి లోబడి ఉండే ఈ కార్పొరేషన్ అన్ని ప్రభుత్వ విధి విధానాలకు లోబడి ఉండదు. అప్పులు తీసుకోవడానికి కార్పొరేషన్ ఏర్పాటు అని ఒప్పుకున్నా అది ఒకటే కారణం కాదు.  ప్రభుత్వ విభాగం అయితే కాంట్రాక్టులు ఇవ్వడంలో, ఇంకా అనేక విషయాలలో పాలనాపర నిబంధనలు పాటించాల్సి వస్తుంది.  విశ్రాంత అధికారులకు కూడా ఉద్యోగం కల్పించడానికి ఇది ఉపయోగపడుతున్నది. అయితే, కాళేశ్వరం కార్పొరేషన్​తో తెలంగాణ ప్రభుత్వానికి  ఉన్న వ్యవహార  ఒప్పందాల మీద విచారణ చేయాలి. కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక వ్యవహారాల మీద, సమకూర్చుకున్న ఆస్తుల మీద, అప్పుల మీద, వడ్డీల మీద,  ఆడిట్ చేసి తెలంగాణ శాసనసభ ముందు పెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక సంస్థాగత పాత్ర పోషించిన కాళేశ్వర కార్పొరేషన్ అవినీతికి రాజమార్గం అయ్యి ఉండవచ్చు. కాబట్టి ఈ కార్పొరేషన్ గురించి లోతైన విచారణ చేయడం అవసరం.

పర్యావరణ నివేదిక తప్పుల తడక

కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ మీద చేసిన పర్యావరణ ప్రభావ నివేదిక కూడా తప్పుల తడకగా తయారు చేశారు. ఈ నివేదికలో అధ్యయన ప్రాంతం గురించి విస్తృత శాస్త్రీయ సమాచారం లేదు. ఆయా గ్రామాలలో అధ్యయన బృందం పర్యటించిన పరిస్థితి లేదు. కేవలం నాలుగు గ్రామాలలో భూసార పరీక్షలు చేసి, మొత్తం 1527 గ్రామాలకు ఆపాదించే ప్రయత్నం జరిగింది.  కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్​ అంశాలకు , పర్యావరణ ప్రభావ నివేదికలోని వివరాలకు పొంతన లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఒనగూరే ప్రయోజనాల లెక్కలకు శాస్త్రీయత లేదు. అప్పట్లో 12 పంటల నికర ఆదాయం రూ.431.85 కోట్లు లెక్కించి, ప్రాజెక్ట్ వలన ఏకంగా రూ.12,730.25 కోట్లకు పెరుగుతుంది అని అంచనా వేశారు - ఇది 29 రెట్ల పెరుగుదల. కేవలం నీటిని అందించడం ద్వారా ఈ స్థాయిలో ఆదాయం పెరగడం అసాధ్యం. అయినా అనుమతులు ఇచ్చే సంస్థలు పట్టించుకోలేదు.

పర్యావరణ నివేదిక తప్పుల తడక

కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ మీద చేసిన పర్యావరణ ప్రభావ నివేదిక కూడా తప్పుల తడకగా తయారు చేశారు. ఈ నివేదికలో అధ్యయన ప్రాంతం గురించి విస్తృత శాస్త్రీయ సమాచారం లేదు. ఆయా గ్రామాలలో అధ్యయన బృందం పర్యటించిన పరిస్థితి లేదు. కేవలం నాలుగు గ్రామాలలో భూసార పరీక్షలు చేసి, మొత్తం 1527 గ్రామాలకు ఆపాదించే ప్రయత్నం జరిగింది.  కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్​ అంశాలకు , పర్యావరణ ప్రభావ నివేదికలోని వివరాలకు పొంతన లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఒనగూరే ప్రయోజనాల లెక్కలకు శాస్త్రీయత లేదు. అప్పట్లో 12 పంటల నికర ఆదాయం రూ.431.85 కోట్లు లెక్కించి, ప్రాజెక్ట్ వలన ఏకంగా రూ.12,730.25 కోట్లకు పెరుగుతుంది అని అంచనా వేశారు - ఇది 29 రెట్ల పెరుగుదల. కేవలం నీటిని అందించడం ద్వారా ఈ స్థాయిలో ఆదాయం పెరగడం అసాధ్యం. అయినా అనుమతులు ఇచ్చే సంస్థలు పట్టించుకోలేదు.

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​