బీజేపీకి వ్యతిరేకంగా.. ఇండియా బలం.. సరిపోతదా?

బీజేపీకి వ్యతిరేకంగా..  ఇండియా బలం.. సరిపోతదా?

కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ.. ‘ఇండియా’ కూటమిగా జట్టుకట్టడంపై.. మొదట్లో చాలా అనుమానాలు వ్యక్తమైనా.. ఇప్పటి వరకు జరిగిన3 సమావేశాల్లో ఎక్కడా పెద్ద విభేదాలు రాకపోవడం.. పరోక్షంగా అవి కొంత విజయం సాధించినట్టే లెక్క. ఇండియా కూటమి ప్రధాన ప్రణాళిక ఏమిటంటే.. విపక్షాలు సంయుక్తంగా బీజేపీని ఓడించడం. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ప్రతిపక్షాలు ఆయనను ఓడించేందుకు బాగా ప్రయత్నిస్తున్నాయి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతదేశంలో ప్రజాస్వామిక విలువలు నశించాయని విస్తృతంగా ప్రచారం చేశారు. 

కానీ దేశ ప్రజలు నరేంద్ర మోదీకి 2019లో ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని నిర్ణయించారు. రాజకీయంగా దేశాన్ని రెండు వర్గాలుగా విభజించవచ్చు. దాదాపు 10 రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ మాత్రమే ప్రత్యర్థులుగా ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు, కొన్నిచోట్ల ప్రత్యర్థులుగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట, విజయం సాధించిన చోట కాంగ్రెస్ క్షీణించింది. అందుకు తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్, గోవా, ఒడిశా, తెలంగాణ మంచి ఉదాహరణలు. ప్రాంతీయ పార్టీలు లేని, బీజేపీ మాత్రమే ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ మనుగడ సాగించింది. ఈ రాష్ట్రాలు రాజస్థాన్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం, కర్నాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్‌‌‌‌గఢ్, మధ్యప్రదేశ్.ఇండియా కూటమి బలాలుచాలా ప్రతిపక్ష పార్టీల ప్రధాన డిమాండ్​అయిన.. రాహుల్ గాంధీని కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకూడదని కాంగ్రెస్ ఒక అంగీకారానికి వచ్చింది. 

ఈ ఏడాది మార్చిలో హిమాచల్ ప్రదేశ్‌‌‌‌, మే నెలలో కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం ఆ పార్టీకి చాలా అవసరమైన విశ్వాసాన్ని ఇచ్చింది. దాదాపు 5 ఏళ్ల ఓటమి తర్వాత ఈ రెండు విజయాలు దక్కాయి. వాటిని చూపే.. మళ్లీ పుంజుకుంటున్నామని కాంగ్రెస్ విపక్షాలను ఒప్పించగలిగింది.  2019లో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌‌‌‌తో పొత్తును వ్యతిరేకించారు. అంటే పంజాబ్‌‌‌‌, ఢిల్లీ, బెంగాల్‌‌‌‌ రాష్ట్రాల్లో బీజేపీ చీలిపోయిన ప్రతిపక్షాలను ఎదుర్కొంది. ఈ 3 రాష్ట్రాల్లో 63 మంది ఎంపీలు ఉన్నారు. 2019లో బీజేపీ దాదాపు 30 మంది ఎంపీలను గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఈ పార్టీలు, కాంగ్రెస్‌‌‌‌ల మధ్య ఐక్యతతో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చు. 

400 ఎంపీ స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా తాము ఒక్కరే ప్రతిపక్ష అభ్యర్థిగా ఉంటామని ఇండి కూటమి కూడా చెబుతున్నది. అదే జరిగితే బీజేపీకి ఇబ్బంది తప్పకపోవచ్చు. ప్రస్తుత ఇండియా కూటమిలో నలుగురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మమతా బెనర్జీ, నితీష్ కుమార్, జార్ఖండ్‌‌‌‌కు చెందిన హేమంత్ సోరెన్, తమిళనాడు స్టాలిన్, ఢిల్లీకి చెందిన కేజ్రీవాల్, పంజాబ్‌‌‌‌కు చెందిన భగవంత్​మన్, కేరళ కమ్యూనిస్ట్ సీఎం పినరయి విజయన్ వంటి 6 ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు ఉన్నారు. మొత్తంగా ఇండియా కూటమికి 11 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కూటమికి వీరు అప్రతిహత బలంగానే భావించవచ్చు.

సరిదిద్దుకునేందుకు మోదీకి టైమ్​ఉంది..

పార్లమెంటు ఎన్నికలకు ఇంకా దాదాపు 8 నెలల సమయం ఉంది. ఇండియా కూటమి చాలా తొందరపాటుగా బీజేపీని ఓడించేందుకు ప్రగల్భాలు పలుకుతున్నది. ఈ మేల్కొలుపు తమ పాలనలో తప్పులను సరిదిద్దుకోవడానికి, యుద్ధానికి సిద్ధం కావడానికి బీజేపీకి బాగా ఉపయోగపడుతున్నది. మూడు సమావేశాలు నిర్వహించడం ఇప్పటికే విజయం సాధించినట్లేనని ఇండియా కూటమి ఇప్పుడే సంబురాలు చేసుకుంటే పొరపాటు. నరేంద్ర మోదీ కూడా వేగంగా నేర్చుకునే నాయకుడు. ఇండియా కూటమికి కొత్త ముఖాలు కావాలి. కానీ కూటమిలో రాజవంశాలు ఆధిపత్యం చెలాయిస్తాయి కాబట్టి, ప్రజలు మళ్లీ మళ్లీ అవే ముఖాలను చూడటం అలవాటు చేసుకోవాలి. మమత, స్టాలిన్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఠాక్రేలు, పవార్లు తమ కుర్చీలను మరొకరికి ఇస్తారా? అనేది ప్రశ్న.

- డా. పెంటపాటిపుల్లారావు,పొలిటికల్ ​ఎనలిస్ట్