ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో రూ.కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే.. అబ్బా లైఫ్ సెటిల్ అయిపోయింది, ఫ్యామిలీకి ఇక ఏ ఢోకా ఉండదు అని అనుకునేవారు. కానీ బాస్.. ఇప్పుడు కాలం మారింది. పెరిగిపోతున్న బిర్యానీ ధరల నుంచి హాస్పిటల్ బిల్లుల వరకు ద్రవ్యోల్బణం రాకెట్‌లా దూసుకెళ్తోంది. అందుకే ఒకప్పుడు ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన ఆ రూ. కోటి మార్క్ ఇప్పుడు సరిపోవడం లేదు. ఇప్పుడు సిటీల్లో ఉండే ఉద్యోగులు కనీసం కోటిన్నరకు పైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవటం బెటర్ అని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రుతి అభిప్రాయపడ్డారు.
ఇంటి యజమాని లేకపోయినా ఫ్యామిలీ అదే లైఫ్ స్టైల్‌ను లీడ్ చేయడానికే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కానీ ఈ రోజుల్లో హోమ్ లోన్స్, పిల్లల ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు, మెడికల్ ఎమర్జెన్సీలు, మారుతున్న జీవన ప్రమాణాల వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రూ.కోటి అనేది వినడానికి పెద్ద నెంబర్ లాగే అనిపించవచ్చు.. కానీ లాంగ్ రన్‌లో అది కుటుంబ అవసరాలను పూర్తిగా తీర్చలేదు. అందుకే ఇప్పుడు కనీసం కోటిన్నర లేదా అంతకంటే ఎక్కువ కవరేజ్ ఉండటం సేఫ్ ఆప్షన్.
త్వరగా కొంటే తక్కువ ప్రీమియం.. అదే మ్యాజిక్
చాలామంది 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకిప్పుడే పెళ్లి కాలేదు, బాధ్యతలు లేవు.. నాకెందుకు ఇన్సూరెన్స్? అని లైట్ తీసుకుంటారు. 25 లేదా 28 ఏళ్ల వయసులో.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు టర్మ్ ప్లాన్ తీసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రీమియానికే భారీ కవరేజ్ లాక్ అయిపోతుంది. అదే 40 ఏళ్ల వయసులో తీసుకుంటే జబ్బుల రిస్క్ పెరుగుతుంది కాబట్టి భారీగా ప్రీమియం కట్టాల్సి వస్తుంది.
రైట్ కవరేజ్ ఎంతో ఎలా లెక్కించాలి?
సాధారణంగా మీ వార్షిక ఆదాయానికి10 నుంచి 15 రెట్లు ఎక్కువ కవరేజ్ ఉండాలనేది థంబ్ రూల్. అయితే అందరి లైఫ్ ఒకేలా ఉండదు కదా. మీకున్న హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు ఎంత? పిల్లల భవిష్యత్తు చదువుల ఖర్చు ఎంత అవుతుంది? వృద్ధులైన తల్లిదండ్రుల మెడికల్ ఖర్చులు ఎంత? వీటన్నింటి బట్టి కవరేజ్ అమౌంట్ డిసైడ్ అవ్వటం మంచిది. ఒకే జీతం తీసుకునే ఇద్దరు వ్యక్తులకు, వారికున్న బాధ్యతలను బట్టి ఇన్సూరెన్స్ అవసరాలు వేర్వేరుగా ఉంటాయి.
లైఫ్ స్టేజ్ బెనిఫిట్స్.. పెళ్లికి, పిల్లలకి అప్‌గ్రేడ్
ఇన్సూరెన్స్ అనేది ఒకసారి కొని వదిలేసే వస్తువు కాదు. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న మోడరన్ టర్మ్ ప్లాన్స్‌లో "లైఫ్ స్టేజ్ బెనిఫిట్స్" అనే క్రేజీ ఫీచర్ ఉంది. దీనివల్ల మీరు పాలసీ తీసుకున్న కొత్తలో కవరేజ్ తక్కువ ఉన్నా.. మీకు పెళ్లయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఎలాంటి మెడికల్ టెస్ట్‌లు లేకుండానే మీ కవరేజ్ అమౌంట్‌ను పెంచుకోవచ్చు. సో మారుతున్న కాలంతో పాటు ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసుకోండి. ఫ్యామిలీకి సరైన ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ అందించండి.
