- ఆసియా క్వాలిఫయర్స్‌లో
- రెండు గోల్డ్ మెడల్స్ సొంతం
- వరుణ్ తోమర్‌కూ పారిస్ బెర్త్
జకర్తా: హైదరాబాద్ షూటింగ్ సెన్సేషన్ ఇషా సింగ్ తన గురితో మరోసారి అదరగొట్టింది. ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ లో రెండు గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకుంటూ పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయింది. విమెన్స్10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ఒలింపిక్ కోటా సంపాదించింది. 19 ఏండ్ల ఇషా సోమవారం జరిగిన విమెన్స్ ఈవెంట్ ఫైనల్లో 243.1 స్కోర్‌తో టాప్ ప్లేస్ సాధించింది.
పాక్ షూటర్ కిష్మల తాటత్ (236.3) సిల్వర్ నెగ్గగా, ఇండియన్ రిథమ్ సాంగ్వాన్ (214.5) బ్రాంజ్ సాధించింది. విమెన్స్ 10 మీటర్ల టీమ్ ఈవెంట్‌లో రిథమ్, సురభి రావుతో కలిసి ఇషా టీమ్ గోల్డ్ కూడా గెలిచింది. ఫైనల్లో ఈ ముగ్గురు యంగ్ షూటర్లు 1736 స్కోరుతో ఇండియాను టాప్ ప్లేస్‌లో నిలిపారు. మరోవైపు మెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో గోల్డ్ గెలిచిన ఇండియా యంగ్ స్టర్ వరుణ్ తోమర్ కూడా పారిస్ బెర్తు దక్కించుకున్నాడు.
20 ఏండ్ల తో మర్ ఫైనల్లో 239.6 స్కోరుతో గోల్డ్ నెగ్గగా, ఇండియాకే చెందిన అర్జున్ చీమా (237.3) సిల్వర్, మంగోలియా షూటర్ దవాంఖు (217.2) బ్రాంజ్ గెలిచారు. ఇక, మెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో తోమర్, చీమా, ఉజ్వల్ మాలిక్‌తో కూడి ఇండియా 1740 స్కోరుతో గోల్డ్ సొంతం చేసుకుంది. ఇషా, వరుణ్ సాధించిన బెర్తులతో ఈ ఏడాది జులై–ఆగస్టులో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే ఇండియా షూటర్ల సంఖ్య 15కి చేరుకుంది. ఈ టోర్నీకి ముందు రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ విభాగాల్లో ఇండియా 13 ఒలింపిక్ కోటా స్థానాలను గెలుచుకుంది.
ఆసియా క్వాలిఫయర్స్‌లో మరికొన్ని కోటాలు లభించే అవకాశం ఉంది. దాంతో టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధికంగా 15 షూటర్లు బరిలోకి దిగగా ఈసారి ఆ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. కాగా, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్, 25 మీ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లలో వరల్డ్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్ అయిన ఇషా సింగ్ 25మీ. పిస్టల్ ఈవెంట్‌లోనూ పోటీ ఉంది. అయితే, ఒకసారి కోటా దక్కించుకున్న తర్వాత రెండు ఈవెంట్లలోనూ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగొచ్చు. ఇందుకు నేషనల్ షూటింగ్ ఫెడరేషన్ అనుమతించాల్సి ఉంటుంది.
రేసర్ అయిన తండ్రి సచిన్ సింగ్ స్ఫూర్తితో ఆటల్లో అడుగు పెట్టి ఎయిర్ పిస్టల్ పట్టుకున్న హైదరాబాదీ ఇషా సింగ్‌కు తెలిసింది ఒక్కటే. టార్గెట్‌ను గురి చూసి కొట్టడమే. బరిలోకి దిగితే పతకం రాబట్టడం.. కుదిరితే రికార్డులు బ్రేక్ చేయడం ఆమెకు అలవాటే. అందుకే ఆమె పేరు కొన్నేండ్లుగా ఇండియన్ షూటింగ్‌లో మార్మోగుతోంది. 13 ఏండ్లకు ప్రొఫెషనల్ షూటర్‌గా మారిన ఇషా చూస్తుండగానే దేశంలోనే టాప్ షూటర్లలో ఒకరిగా ఎదిగింది. పోటీ పడ్డ ప్రతీ టోర్నీలోనూ మెడల్స్ నెగ్గుతూ.. రికార్డులు కొల్లగొడుతూ ముందుకెళ్తోంది.
సక్సెస్ రేటు 99 శాతం ఉందంటేనే ఆమె ఆట ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. 2018లో నేషనల్ చాంపియన్ అయినప్పటి నుంచి ఇషా వెనుదిరిగి చూసింది లేదు. ఐదేండ్ల పాటు జూనియర్ సర్క్యూట్‌లో మెడల్స్ మోత మోగించింది. మను భాకర్ లాంటి స్టార్లను సైతం వెనక్కు నెట్టింది. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో మూడు గోల్డ్, ఓ సిల్వర్, మరో బ్రాంజ్ గెలిచింది. 2023లోనే సీనియర్ కేటగిరీలోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. బాకూ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్, 25 మీ. పిస్టల్ టీమ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకుంది. గతేడాది ఆసియా గేమ్స్‌లో నాలుగు మెడల్స్‌తో ఔరా అనిపించింది. ఇదే జోరు కొనసాగిస్తే ఒలింపిక్స్‌లోనూ ఇషా నుంచి గోల్డ్ ఆశించొచ్చు.
ఇక ఒలింపిక్ గోల్డ్‌పైనే ఫోకస్
దేశానికి ఒలింపిక్ కోటా తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. క్వాలిఫికేషన్ రౌండ్ కష్టంగా సాగినా ఫైనల్లో మాత్రం భారీ తేడాతో గెలిచి ఒలింపిక్ బెర్త్ సాధించడం మరింత గొప్ప అనుభూతిని ఇచ్చింది. ప్రతీ విషయంలో నేను ఒక టార్గెట్‌ను పెట్టుకొని, పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తా . ఈ విషయంలో మా నాన్న (సచిన్ సింగ్) నాకు ఎంతో హెల్ప్ చేస్తారు.
నా కోచ్‌తో కలిసి నా టోర్నీలు, మ్యాచ్‌ల షెడ్యూల్ అంతా చూసుకుంటున్నారు. క్రమశిక్షణతో ట్రెయినింగ్ తీసుకుంటూ గురి చూసి కొట్టడమే నా పని. ప్రశాంతంగా ఉంటూ టెక్నిక్‌కు ప్రాధాన్యత ఇవ్వడమే నా విజయ రహస్యం. ఒలింపిక్ బెర్త్ సాధించడంతో నా తలపై కొంత భారం దిగింది. ఇప్పుడు ఫోకస్ అంతా నా అల్టిమేట్ గోల్ ఒలింపిక్ గోల్డ్ నెగ్గడంపైనే ఉంటుంది.
- ఇషా సింగ్
