
డెయిర్ అల్ బలా(గాజా స్ట్రిప్): గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం 33 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గాజాలోని 100 టార్గెట్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. గాజా సిటీలోని 2 ఇండ్లపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన తాజా దాడుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ట్రీట్మెంట్ ఇస్తున్నామని షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మహ్మద్ అబు సెల్మియా తెలిపారు. అదేవిధంగా, దక్షిణ గాజాలోని మువాసిపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానికదాడులు చేసింది.
ఈ ఘటనలో 13 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గాయపడిన వారిని దగ్గర్లోని నసీర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ఆదివారం నాటికి గడిచిన 24 గంటల్లో గాజా స్ట్రిప్‌లోని 130 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, స్టోరేజ్ కేంద్రాలు, వెపన్స్, లాంచర్లను ధ్వంసం చేశామని తెలిపింది.
ట్రంప్‌తో చర్చలకు సిద్ధమైన బెంజమిన్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా వెళ్లనున్నారు. వైట్ హౌస్‌లో ట్రంప్‌తో సీజ్ఫైర్ పై చర్చించనున్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించుకోవడంతో పాటు 60 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనను ట్రంప్ సిద్ధం చేశారు. ఈ రెండు అంశాలపై ట్రంప్, నెతన్యాహు చర్చించుకోనున్నారు. కాగా.. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో వార్ మొదలైంది. ఇప్పటి వరకు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 57వేలకు పైగా పాలస్తీనియన్లు చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.