విదేశీ రాకెట్ తో దేశీ ప్రయోగం

విదేశీ రాకెట్ తో దేశీ ప్రయోగం

జీశాట్​ 31ను నింగికి చేర్చనున్న ఏరియన్ రాకెట్​.. 6న ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. విదేశీ రాకెట్ తో స్వదేశీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఫిబ్రవరి 6న ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్​ 5 (వీఏ247) రాకెట్ ద్వారా జీశాట్‌ 31 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతామని ఇస్రో శుక్రవారం ప్రకటించింది. తెల్లవారుజామున 2.31 గంటలకు ప్రయోగం ఉంటుంది. జీశాట్ 31 బరువు 2,535 కిలోలు. గతంలో ఇస్రో ప్రయోగించిన ఇన్​శాట్ /జీశాట్ కాల పరిమితి పూర్తి కావడంతో జీశాట్ 31 ప్రయోగాన్ని చేపడుతోంది. వీశాట్ నెట్ వర్క్​, టీవీ అప్ లింకులు, డిజిటల్​ శాటిలైట్ వార్తా సేకరణ, డీటీహెచ్ సేవలు, సెల్​ఫోన్​ కనెక్టివిటీ తదితర సేవలను జీశాట్ 31 అందిస్తుంది. దాదాపు 15 ఏళ్ల పాటు పనిచేసే ఈ ఉపగ్రహం.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర ఉపరితలాలపై సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేయనుంది. సౌదీ జియోస్టేషనరీ శాటిలైట్ 1/హెల్లా స్​ శాట్ 4నూ నిం గిలోకి మోసుకెళ్లనుంది ఏరియన్​ రాకెట్.