నింగిలో ఇస్రో ఘనత.. విదేశాల చూపు మనవైపే

నింగిలో ఇస్రో ఘనత.. విదేశాల చూపు మనవైపే

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ఎంతో ప్రగతిని సాధించింది. రిమోట్​ సెన్సింగ్​ రాకెట్​లతో ఇస్రో ప్రయాణం మొదలైంది. అక్కడి నుంచి విదేశాలు సైతం మన దేశం వైపు చూసేలా ఎదిగింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఘనకీర్తిని సాధించింది. విజయవంతంగా చంద్రుడిపైకి సైతం చంద్రయాన్​ ప్రయోగాలను చేసిన ఇస్రో మూడో ప్రయోగానికి సిద్ధమవుతోంది. మరోవైపు మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్​యాన్​, సూర్యుడిపైకి ఆదిత్య ఎల్​–1, శుక్రగ్రహంపైకి శుక్రయాన్​–1 ప్రయోగాలకు ఏర్పాట్లు చేస్తోంది.

చంద్రుడిపై భవిష్యత్తులో పూర్తిస్థాయి మానవ స్థావరం ఏర్పాటు చేసి, రోదసి పరిశోధనకు ఉద్దేశించిన కార్యక్రమం చంద్రయాన్​–1. ఈ కార్యక్రమానికి 2003లో భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోలార్​ శాటిలైట్​ ల్యాంచ్​ వెహికిల్​ – సి11(పీఎస్​ఎల్వీ–సి11) ద్వారా విజయవంతంగా 2008, అక్టోబర్​ 22న ప్రయోగించింది. అధిక పరిమాణం ఉన్న స్ట్రాప్​ ఆన్ బూస్టర్​ మోటార్లను తొలిసారిగా పీఎస్​ఎల్వీ–సి11లో వినియోగించారు. చంద్రుని ఉపరిత 3డి చిత్రీకరణ, ఖనిజ నిర్మాణం, నీటి నిక్షేపాల అన్వేషణ, చంద్రుని ఆవిర్భావ విషయాలు చంద్రుని గుర్వాతకర్షణ లక్ష్యాలతో ఇస్రో చంద్రయాన్​–1ను నిర్వహించింది. చంద్రయాన్​–1 ఉపగ్రహంలో భాగంగా 11 పరికరాలను ఇస్రో ప్రయోగించింది. వాటిలో భారత్​–5, అమెరికా–2, యూరోపియన్​ ఏజెన్సీ –3, బల్గేరియా–1కు చెందినవి ఉన్నాయి. 5.5 రోజుల ప్రయాణం తర్వాత 2008, అక్టోబర్​ 28న చంద్రయాన్​ –1 చంద్రుడి 100కి.మీ. ధ్రువ కక్ష్యలోకి చేరింది. 2008, నవంబర్​ 14న భారత్​కు చెందిన మూవ్​ ఇంపాక్ట్​ ప్రోబ్​ అనే పరికరం చంద్రయాన్​–1 నుంచి విడిపోయి చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పతనమై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఈ ప్రాంతాన్ని జవహర్​ స్థల్​ అంటారు. చంద్రయాన్​–1 నుంచి సమాచారం సేకరించేందుకు బెంగళూరు సమీపాన బ్యాలాలు గ్రామం వద్ద 18 మీటర్ల వ్యాసం ఉన్న ఒక భారీ ఏంటెన్నాను డీప్​స్పేస్​ నెట్​వర్క్​లో భాగంగా ఇస్రో ఏర్పాటు చేసింది. రెండేండ్ల జీవితకాలం ఉన్న చంద్రయాన్–1తో 2009, ఆగస్టు 29న ఇస్రో సంబంధాలను కోల్పోయింది. 

చంద్రయాన్​–3 

చంద్రయాన్​–2కు కొనసాగింపుగా త్వరలో ఇస్రో చంద్రయాన్​–3 కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో కేవలం ల్యాండర్ ను మాత్రమే ఇస్రో ప్రయోగిస్తుంది. దీనిని తొలుత చంద్రుని కక్ష్యలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి చంద్రుని దక్షిణ ధ్రువంపైకి సాఫ్ట్​ ల్యాండింగ్​ను నిర్వహిస్తారు. చంద్రయాన్​–3ను ల్యాండర్​ నుంచి సమాచారం చంద్రయాన్​–2 ఆర్బిటర్​ సేకరించి భూమి పైకి పంపిస్తుంది.

మంగళ్​యాన్​

ఇస్రో నిర్వహించిన మొదటి గ్రహాంతర కార్యక్రమం. 2013, నవంబర్​ 5న పీఎస్​ఎల్వీ–25 ద్వారా ఇస్రో మంగళ్​​యాన్​ ప్రయోగించింది. తొలుత భూ అనువర్తిత కక్ష్యలోకి ప్రవేశించి ఆ తర్వాత కక్ష్యా మార్పిడి ద్వారా 2013, డిసెంబర్​ 1న అంగారక ట్రాజెక్టరీలోకి మంగళ్​యాన్​ ప్రవేశించింది. సుమారు 9 నెలలపాటు ప్రయాణించిన మంగళ్​యాన్​ 2014, సెప్టెంబర్​ 14న విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. నాసా, యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ, రష్యా అంతరిక్ష కార్యక్రమం తర్వాత అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన నాలుగో అంతరిక్ష సంస్థ ఇస్రో. మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం భారత్​. మంగళ్​యాన్​ బరువు 1337 కిలోలు. ఇందులో 5 సాంకేతిక పరికరాలున్నాయి. 

లైమన్​ ఆల్ఫాఫొటో మీటర్​ 2. మీథేన్​ సెన్సర్​ ఫర్​ మార్స్​ 3. మాస్​ ఎక్సోస్ఫెరిక్​ న్యూట్రల్​ కంపోజిషన్​ ఎనలైజర్​ 4. థర్మల్​ ఇన్​ఫ్రారెడ్​ ఇమేజింగ్​ స్పెక్ట్రోమీటర్​ 5. మార్స్​ కలర్​ కెమెరా. 

ఆదిత్య ఎల్​ –1 

సూర్యుడి కరొనా అధ్యయనానికి ఉద్దేశించిన ప్రత్యేక ఉపగ్రహం. 2019–20 మధ్యకాలంలో పీఎస్​ఎల్వీ–ఎక్స్​ఎల్​ ద్వారా ఇస్రో ప్రయోగించనుంది. 400 కిలోల బరువుండే ఈ ఉపగ్రహంలో సూర్యుడి కరొనా అధ్యయనానికి విజిబుల్​ ఎమిషన్​ లైన్​ కరొనాగ్రఫ్​(వీఈఎల్​సీ) అనే ప్రత్యేక పరికరం ఉంటుంది. సూర్యుని భూమి వ్యవస్థలోని ల్యాగ్రాంజియన్​ పాయింట్​ వన్​ (ఎల్​1) అనే కక్ష్యలోకి ఆదిత్యను ఇస్రో ప్రయోగించనుంది. 

శుక్రయాన్​ 

త్వరలో భారత్​ నిర్వహించనున్న రెండో గ్రహాంతర కార్యక్రమం శుక్రయాన్​. మొదట 2024 డిసెంబర్​ నాటికి వీనస్​/ శుక్రగ్రహంపైకి ఇస్రో శుక్రయాన్​ను ప్రయోగించాలనుకుంది. కరోనా  కారణంగా ఈ ప్రయోగాన్ని 2031కు వాయిదా వేసింది. ప్రతి 19 నెలలకు ఒక్కసారి శుక్రగ్రహం భూమికి సమీపంగా వస్తుంది. ఈ లెక్కన 2024లో తప్పితే 2026, 2028లో కూడా శుక్రయాన్​కు అనుకూలం. కానీ ప్రతి ఎనిమిందేండ్లకు ఒక్కసారి శుక్రుడు భూమికి మరింత చేరువగా వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని 2031లో శుక్రయాన్​ను ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. ఇందులో సింథటిక్​ అపెర్చర్​ రాడార్​ పరికారాన్ని ఇస్రో ప్రయోగించనుంది. 

చంద్రయాన్​–2

చంద్రుడిపైకి ఇస్రో నిర్వహించిన రెండో కార్యక్రమం చంద్రయాన్​–2. దీనిని జీఎస్​ఎల్వీ – మార్క్​3 ఎం1 నౌక ద్వారా సతీష్​ ధావన్​ అంతరిక్ష కేంద్రం నుంచి 2022, జులై 19న ఇస్రో ప్రయోగించింది. చంద్రయాన్​–2 ఉపగ్రహం బరువు 3850 కిలోలు. ఇందులో 3 భాగాలున్నాయి. 

  •     ఆర్బిటర్​ – ఇది చంద్రుని చుట్టూ తిరుగుతుంది.
  •     ల్యాండర్​ – ఆర్బిటర్​ నుంచి విడిపోయి చంద్రుడిపై సాఫ్ట్​ ల్యాండింగ్​ జరుగుతుంది. దీనికి విక్రమ్​ అని పేరు పెట్టారు.
  •     రోవర్​ – దీనిని ప్రజ్ఞా అంటారు. ఇది రోవర్​ నుంచి బయటకు వచ్చి చంద్రునిపై చక్రాలతో తిరుగుతుంది. 

2019, సెప్టెంబర్​ 7న నిర్వహించిన సాఫ్ట్​ ల్యాండింగ్​లో ఇస్రో​ విఫలం చెందింది. చంద్రయాన్​–2 కూలిన ప్రాంతాన్ని గుర్తించడంలో నాసాకు చెందిన లూనార్​ రికన్నైసెన్స్​ ఆర్బిటర్​(ఎన్​ఆర్​ఓ) భారత్​కు సాయపడింది. చంద్రయాన్​–2లో భాగంగా విక్రమ్​ ల్యాండర్​ను చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇస్రో సాఫ్ట్​ ల్యాండింగ్​ నిర్వహించాలని అనుకుంది. ఇదీ సాధ్యం కాలేదు. మొదట చంద్రయాన్​–2 ఆర్బిటర్​ జీవితకాలం ఏడాదిగా నిర్దేశించినా తర్వాత దాని జీవిత కాలాన్ని ఏడేండ్లకు పొడిగించారు. 

గగన్​యాన్​

ఇస్రో నిర్వహించబోతున్న తొలి మానవ సహిత అంతరిక్షయాన్​ కార్యక్రమం గగన్​యాన్. ఇందులో భాగంగా ఇస్రో జీఎస్​ఎల్వీ మార్క్​ – 3 నౌకను సిద్ధం చేస్తోంది. వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్​ను హిందూస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ అందిస్తుంది. వ్యోమగాములకు స్పేస్​గ్రేడ్​ ఆహారం, ఔషధాలను డీఆర్డీవో సిద్ధం చేస్తుంది.  మొదటి, రెండు దశలో వ్యోమగాములు లేకుండా ఆ తర్వాత మూడోసారి వ్యోమగాములతో ప్రయోగిస్తుంది. ఇందు కోసం బెంగళూరులో హ్యుమన్​ స్పేస్​ ఫ్లైట్​ సెంటర్​ ఏర్పడింది. గగన్​యాన్​లో వ్యోమగాముల పరిస్థితులను పర్యవేక్షించడానికి వోమ్యమిత్ర అనే రోబోను అభివృద్ధి చేసింది. 

ఆస్ట్రోశాట్​ 

దేశ తొలి ఖగోళశాస్త్ర ఉపగ్రహం ఆస్ట్రోశాట్​. పీఎస్​ఎల్వీ–సి30 ద్వారా 2015, సెప్టెంబర్​ 28న సతీష్​ ధావన్​ స్పేస్​ సెంటర్​ నుంచి ఇస్రో ప్రయోగించింది. ఆస్ట్రోశాట్​ బరువు 1513 కిలోలు. ఇందులో ఐదు పేలోడ్లు ఉన్నాయి. అమెరికా, యూరప్​, రష్యా, జపాన్​ల తర్వాత ఈ తరహా ఉపగ్రహాన్ని భారత్​ ప్రయోగించింది. ఆస్ట్రాశాట్​ను బెంగళూరులోని ఇస్రో శాటిలైట్​ సెంటర్​ వద్ద అభివృద్ధి చేశారు. ఇది గ్రహవ్యవస్థలు, పాలపుంతలు, కృష్ణబిలాలు, భూమిలాంటి గ్రహాలను అన్వేషిస్తుంది. ముంబయిలోని టీఐఎఫ్ఆర్​, బెంగళూరులోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఆస్ట్రోఫిజిక్స్​, రామన్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​, పుణెలోని ఇంటర్​ యూనివర్సిటీ సెంటర్​ వఫర్​ ఆస్ట్రోనమి, ఆస్ట్రో ఫిజిక్స్​ ఈ ఉపగ్రహం అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి.