
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలను ఇస్రో చేపట్టనున్నట్లు కేంద్ర రాజ్యసభకు వెల్లడించింది. ఇందులో 6 పీఎస్‌ఎల్వీ (PSLV) ప్రయోగాలతోపాటు 3 జీఎస్‌ఎల్వీ (GSLV), ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM 3) మిషన్ ఉన్నట్లు తెలిపింది. ఆరు ఉపగ్రహాల్లో.. అంతరిక్ష పరిశోధన, భూ పరిశీలన ఉపగ్రహాలు, సాంకేతిక అభివృద్ధికి దోహదం చేసే 2 శాటిలైట్లు, 2 వాణిజ్య ఉపగ్రహాలు ఉన్నాయి.
3 జీఎస్‌ఎల్వీ ప్రయోగాల్లో వాతావరణ శాస్త్ర ఉపగ్రహం, నేవిగేషన్ శాటిలైట్‌తోపాటు, నాసా-ఇస్రో ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న సింథటిక్ అపెర్చర్ రేడార్ (SAR) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెట్ (ఎన్‌ఎస్‌ఐఎల్)తో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. జిశాట్ 20 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు.. 2 పునర్వినియోగ వాహక నౌక (Reusable Launch Vehicle)ల ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.
డిసెంబర్ 7వ తేదీ గురువారం జరిగిన రాజ్యసభ సమావేశంలో ఇస్రోకు సంబంధించిన సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇస్రో అభివృద్ధి చేసిన సరికొత్త ప్రయోగ వాహక నౌక ఎస్‌ఎస్‌ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ద్వారా ప్రయోగాత్మకంగా ఓ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నట్లు ఆయన చెప్పారు.
భారత్ చేపడుతున్న ప్రతిష్ఠాత్మక మిషన్ 'గగన్‌యాన్' ద్వారా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధారించుకునేందుకు మానవ రహిత మిషన్‌ను చేపట్టాలని ఇస్రో యోచిస్తుందని.. అత్యవసర పరిస్థితుల్లో గగన్‌యాన్ లోని వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా అభివృద్ధి చేసిన 'క్రూ ఎస్కేప్ సిస్టమ్'ను ధ్రువీకరించేందుకు ప్రయోగం చేపట్టాలని జితేందర్ సింగ్ తెలిపారు.