పాక్ పై నిఘాకు ఎమిశాట్

పాక్ పై నిఘాకు ఎమిశాట్

ఏప్రిల్ 1న నింగిలోకి పంపనున్న ఇస్రో

న్యూఢిల్లీ: శత్రుదేశాల ఎత్తుల్ని చిత్తు చేసే అత్యాధునిక నిఘా ఉపగ్రహం (శాటిలైట్) ఎమిశాట్‌ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహాన్ని ఏప్రిల్ 1న ఉదయం 9:30 రోదసిలోకి ప్రయోగించనున్నారు. దీంతోపాటు 28 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. శత్రు దేశాల రాడార్లను పసిగట్టడం, ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, హై రిజల్యూషన్ చిత్రాలను సేకరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పొరుగుదేశం పాకిస్థాన్​లో కదలికల్ని ముందే పసిగట్టడంలో దోహదపడుతుంది. 436 కిలోల బరువున్న ఈ శాటిలైట్‌ ను రోదసిలో 763 కి.మీ.ల కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో సోమవారం వెల్లడించింది. ఎమిశాట్ ఉపగ్రహం మూడు ప్రత్యేకతలు కలిగి ఉందని రక్షణరంగ నిపుణుడు రవిగుప్తా చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో శత్రుదేశాల రాడార్ల కార్యకలాపాల్ని కనుగొనడం,శత్రు దేశాల భూభాగానికి సంబంధించిన మెరుగైన చిత్రాలను అందిస్తుందన్నారు. ఆప్రాంతంలో కమ్యూనికేషన్ పరికరాలు ఎన్ని పని చేస్తున్నాయో కనిపెట్టి అందజేస్తుందని వివరించారు. శత్రు రాడార్లకు చిక్కకుండా ఇవి పనిచేస్తాయని తెలిపారు. సరిహద్దుల్లోని కీలకప్రాంతాల్లో సెల్‌‌ఫోన్ వంటి కమ్యూనికేషన్ పరికరాలు ఎన్ని పనిచేస్తున్నాయనే విషయాన్ని భద్రతా, నిఘా సంస్థలకు చేరవేస్తాయనిచెప్పారు. ఇస్రో చరిత్రలోనే తొలిసారిగా పే లోడ్లని మూడు వేర్వేరు కక్ష్యల్లో కి పీఎస్‌ ఎల్వీరాకెట్ వదిలిపెట్టనున్నది.