గూండారాజ్​కు గుణపాఠం.. అవినీతి, అరాచకాల వల్లే ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థులు

గూండారాజ్​కు గుణపాఠం.. అవినీతి, అరాచకాల వల్లే ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థులు
  •     మంచిర్యాల జిల్లాలోని మూడు స్థానాలో ఘోర పరాజయం
  •     చెన్నూర్​, బెల్లంపల్లిలో సెకండ్​, మంచిర్యాలలో థర్డ్​ ప్లేస్​
  •     ల్యాండ్​, సాండ్​, కోల్​ దందాలతో కోట్లకు పగడలెత్తిన సుమన్​
  •     అక్రమ కేసులు, భౌతిక దాడులను సహించని చెన్నూర్​ ప్రజలు
  •     భూకబ్జాలు, లైంగిక వేధింపుల ఆరోపణలతో చిన్నయ్యకు మచ్చ 
  •     దివాకర్​రావు కొంపముంచిన కొడుకు విజిత్​రావు దందాలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అవినీతి, అక్రమాలు, అరాచకాల వల్లే బీఆర్ఎస్ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారన్న చర్చ జరుగుతోంది. మంచిర్యాల, చెన్నూర్​, బెల్లంపల్లి సిట్టింగ్​ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్​రావు, బాల్క సుమన్​, దుర్గం చిన్నయ్యల ఓటమిపై పోస్టుమార్టం మొదలైంది. ఈ ముగ్గురూ మొన్నటివరకు తామే గెలుస్తామనే ధీమాను ప్రదర్శించారు. కానీ ఎన్నికల ఫలితాలు వారి అంచనాలను తారుమారు చేశాయి. ఓట్ల లెక్కింపులో ఫస్ట్​ రౌండ్​ నుంచే పతనం కనిపించింది.

ప్రజల నాడీని పసిగట్టడంలో దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా చెన్నూర్, బెల్లంపల్లిలో బీఆర్ఎస్​ రెండో స్థానంలో నిలువగా, మంచిర్యాలలో ఏకంగా థర్డ్ ప్లేస్​కు దిగజారడం బీఆర్ఎస్​ తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. చెన్నూర్​లో కాంగ్రెస్​అభ్యర్థి వివేక్ కు 87,529 ఓట్లు రాగా, బీఆర్​ఎస్​ అభ్యర్థి సుమన్ కు 50,016 ఓట్లు వచ్చాయి. వివేక్ 37,513 ఓట్లతో గెలిచారు.

బెల్లంపల్లిలో కాంగ్రెస్​అభ్యర్థి వినోద్ కు 82,217 ఓట్లు, బీఆర్​ఎస్​ అభ్యర్థి చిన్నయ్యకు 45,339 ఓట్లు వచ్చాయి. 36,878 ఓట్లతో వినోద్ విజయం సాధించారు.  మంచిర్యాలలో కాంగ్రెస్​అభ్యర్థి  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 66,116 ఓట్ల భారీ  మెజారిటీతో దక్కించుకునారు. ఆయనకు 1,05,945 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ రావుకు 39,829 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్​ అభ్యర్థి దివాకర్ రావు 37,989  ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. 

అడ్డగోలు అరాచకాలు

చెన్నూర్​లో బాల్క సుమన్​ ఓటమికి అవినీతి, అక్రమాలతో పాటు అహంకారం, అనుచరుల అరాచకాలే కారణమని చర్చించుకుంటున్నారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్​తో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన సుమన్​... 2018లో చెన్నూర్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సీటును లాక్కొని ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఇక్కడ పాగా వేయడం కోసం నియోజకవర్గంలోని కీలక నాయకులందరినీ టార్గెట్​ చేశారు.

నల్లాల ఓదెలు, పురాణం సతీశ్​, మూల రాజిరెడ్డి వంటి లీడర్లను రాజకీయంగా అణగదొక్కారు. ప్రతి మండలంలో అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకొని వారి అన్యాయాలను, అక్రమాలను ఎంకరేజ్​చేశారు. 2014లో తనపై వంద కేసులు, రెండు జతల బట్టలు ఉన్నాయన్న సుమన్​... ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విచ్చలవిడిగా సంపాదించారన్న టాక్​ ఉంది.

గత ఐదేండ్లలో ల్యాండ్​, సాండ్​, కోల్​దందాల ద్వారా వేల కోట్లకు పడగలెత్తాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు చెన్నూర్​లో సుమన్​ అనుచరుల ఆగడాలకు అంతే లేకుండాపోయింది. సమస్యలపై నిలదీస్తే కేసులు, అక్రమాలపై ప్రశ్నిస్తే భౌతికదాడులు పెరిగాయి. ఫలితంగా చెన్నూర్ ప్రజలు ఈ ఎన్నికల్లో గూండారాజ్​కు తగిన గుణపాఠం చెప్పారని పరిశీలకులు పేర్కొంటున్నారు. 

చిత్తుగా ఓడిన చిన్నయ్య.... 

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెండుసార్లు గెలవడంతో నియోజకవర్గంలో తనకు ఎదురే లేదన్నట్టు వ్యవహరించారు. చిన్నయ్య తన అనుచరులతో పెద్ద ఎత్తున గర్నమెంట్, అసైన్డ్​ భూములను కబ్జా పెట్టారు. చెరువులు, కుంటలను చెరబట్టడమే కాకుండా ఫారెస్ట్​ భూములను సైతం వదిలిపెట్టలేదు. అడ్డమొచ్చిన అధికారులను లొంగదీసుకోవడం, లేదంటే బెదిరించడం, అపోజిషన్​ లీడర్లపై అక్రమ కేసులు పెట్టి వేధించడం బెల్లంపల్లిలో పరిపాటైంది. సాయం పేరుతో తన వద్దకు వచ్చే మహిళలను చిన్నయ్య, అనుచరులు లొందీసుకుంటున్నారని, పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నారని, పద్ధతి మార్చుకోవాలని ఆ మధ్య మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు.

ఆ తర్వాత అరిజిన్​ డెయిరీ శేజల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే తన పలుకుబడితో అక్రమ కేసులు పెట్టించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని శేజల్​ ఆరోపించింది. ఆమె గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడినప్పటికీ న్యాయం జరుగలేదు. ఒక ఆడపిల్ల బెల్లంపల్లికి వచ్చి చిన్నయ్యకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్​ నుంచి ఎలాంటి మచ్చ లేని గడ్డం వినోద్​ బరిలో నిలువడంతో బెల్లంపల్లి ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. చిన్నయ్యను చిత్తుగా ఓడించారు. 

కొంప ముంచిన షాడో ఎమ్మెల్యే...

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావుకు సౌమ్యుడు, వివాద రహితుడనే పేరున్నప్పటికీ... ఆయన కొడుకు విజిత్​రావు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడం వల్ల ఓటమి తప్పలేదు. విజిత్​రావు నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలను తన కంట్రోల్​లోకి తెచ్చుకున్నారు. కొంతమంది యూత్​ లీడర్లను ఎంకరేజ్​ చేస్తూ చెడ్డపేరు మూటగట్టుకున్నారు. మంచిర్యాల, నస్పూర్​లో భూకబ్జాలు, కాంట్రాక్టుల్లో కమీషన్లు, అపోజిషన్​ లీడర్లపై అక్రమ కేసులతో దివాకర్​రావు గ్రాఫ్​దిగజారింది.

దీనికితోడు నాలుగుసార్లు గెలిపించినా నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదన్న అపవాదును ఎదుర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సమస్యలను పరిష్కరించకపోవడం, ప్రణాళిక లేని పనులతో ప్రజాధనాన్ని వృథా చేయడం వంటి కారణాలతో ప్రజల్లో విసుగుపుట్టింది. ‘ఎప్పటికీ ఆయననేనా?’ అన్న టాక్​ రావడంతో దివాకర్​రావును గద్దె దించారు.