
- 2017 ల్యాండ్ ఆక్విజిషన్ రూల్స్ ప్రకారం నోటిఫికేషన్ జారీ
- ఎకరానికి రూ.13.50 లక్షలతో పాటు 150 గజాల ప్లాట్
- భూ యజమానుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్న ఆఫీసర్లు
- 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని బాధితుల డిమాండ్
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి శివారులో ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియ స్పీడందుకుంది. అయితే ఇక్కడ మార్కెట్ వాల్యూ రూ. 50 లక్షల పైనే ఉండగా.. ప్రభుత్వం మాత్రం రూ. 13.50 లక్షలే ఇస్తోందని, దీని వల్ల తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తే తమకు న్యాయం జరుగుతుందని, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కొందరు యజమానులు ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్ట్‌ను ఆశ్రయించారు. కానీ భూ యజమానులు ఫైల్ చేసిన రిట్ పిటీషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.
2017 రూల్స్ ప్రకారం నోటిఫికేషన్
భూసేకరణ ప్రక్రియ వివాదాస్పదం కావడంతో పాటు కోర్టు ఆదేశాలతో తెలంగాణ స్టేట్ ల్యాండ్ ఆక్విజిషన్ (కాన్సెంట్ అవార్డు, వాలంటరీ అక్విజిషన్ అండ్ లమ్‌సం పేమెంట్ టువార్డ్స్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) రూల్స్2017 ప్రకారం భూ సేకరణకు మంచిర్యాల కలెక్టర్ గత నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు. ఐటీ, ఇండస్ర్టియల్ పార్క్ కోసం 212 ఎకరాలను సేకరిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
భూ యజమానులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తేదీ నుంచి రెండు నెలల వ్యవధిలో ఆబ్జెక్షన్స్ ఫైల్ చేయాలని సూచించారు. మొదట్లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే భూ సేకరణ కోసం సంతకాలు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో, అధికారులు తమ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
అటకెక్కిన 2013 యాక్ట్
ప్రభుత్వ, ప్రైవేట్ అవసరాల కోసం ప్రజల భూములను సేకరించాల్సి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి. ఈ చట్టం ప్రకారం సదరు ఏరియాలో గత మూడేండ్లలో జరిగిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకొని నష్టపరిహారాన్ని నిర్ణయించాలి. అలా నిర్ణయించిన రేటుకు మూడు రెట్ల పరిహారం, దానికి వంద శాతం సొలాటియం చెల్లించడంతో పాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాలి.
దీంతో ఎక్కువ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో గత బీఆర్‌ఎస్ సర్కార్ 2017లో తెలంగాణ స్టేట్ ల్యాండ్ ఆక్విజిషన్ రూల్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ రూల్ ప్రకారమే మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణ చేస్తున్నారు. దీంతో తమకు తక్కువ పరిహారం వస్తుందని, 2013 చట్టాన్ని అమలు చేయాలని భూయజమానులు డిమాండ్ చేస్తున్నారు.
రూ. 13.50 లక్షల పరిహారం, 150 గజాల ప్లాట్
టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం 212 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, ఎకరానికి రూ.13.50 లక్షల నష్టపరిహారం నిర్ణయించారు. దీంతో పాటు భూయజమానులకు ఇండస్ట్రియల్ పార్క్‌లో 150 గజాల ప్లాట్‌ను సైతం కేటాయించనున్నారు. వేంపల్లి శివారులోని సర్వే నంబర్లు 155, 156, 157, 158, 159, 160తో పాటు పోచంపహాడ్ శివారులోని సర్వే నంబర్లు 1, 2, 8,9, 10లలో అసైన్డ్, సీలింగ్ పట్టా భూములన్నిటికీ ఇదే పరిహారం డిసైడ్ చేశారు.
ఈ భూములు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ ఎకరానికి రూ.50 లక్షల పైనే ఉంది. దీంతో 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసినట్లయితే తమకు న్యాయం జరుగుతుందని భూయజమానులు అంటున్నారు. దశాబ్దాల కిందట అప్పటి ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు ఎకరం రెండెకరాలు పంపిణీ చేసి అసైన్డ్ పట్టాలు జారీ చేశాయి. ఇందులో చాలా మంది ఈ భూములను సాగు చేసుకుంటుండగా, కొంతమంది మాత్రం పడవుగా వదిలేశారు.
డిక్లరేషన్లు తీసుకుంటున్న ఆఫీసర్లు
ఓ వైపు తక్కువ నష్టపరిహారం ఇస్తున్నారని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని యజమానులు కోరుతుండగా మరోవైపు ఆఫీసర్లు రైతుల నుంచి డిక్లరేషన్లు తీసుకునే పనిలో పడ్డారు. ఈ భూముల విషయంలో ఏమైనా సమస్యలు వస్తే తామే పరిష్కరిస్తామని, లేదంటే పరిహారం వాపస్ ఇస్తామని రాసి సంతకాలు తీసుకుంటున్నారు. రైతులు డిక్లరేషన్లు ఇచ్చేలా మండలానికి చెందిన కొంతమంది లీడర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారని పలువురు చెబుతున్నారు.
నష్టపరిహారం చెల్లింపుల కోసం ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో అకౌంట్లు సైతం తీయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొందరు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు అసైన్డ్ పట్టాలు లేవు. వీటిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని భయపెట్టి రూ. 13.50 లక్షలు ఇచ్చి లీడర్లే భూములను కొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.