రూ.300తో దివ్యాంగ బతుకు అతుకుతుందా.?

రూ.300తో దివ్యాంగ బతుకు అతుకుతుందా.?

రోజుకి పది రూపాయల లెక్కన నెలకు రూ.300 మాత్రమే. అదే కేంద్ర ప్రభుత్వం  ‘ఇందిరా గాంధీ జాతీయ దివ్యాంగుల పెన్షన్ పథకం’ కింద దివ్యాంగుల జీవనాధారంగా అందించే మొత్తం. ఈ నిధితో ఒక దివ్యాంగుడు జీవనం సాగించగలడా? కేంద్రం మాత్రం  80% పైగా దివ్యాంగత ఉన్నవారికే,  18 ఏళ్లకు పైబడినవారికే,  బీపీఎల్ కుటుంబాల్లో మాత్రమే  పెన్షన్ మంజూరు చేస్తోంది. అంటే ఈ కఠినమైన అర్హతలతో నెలకు కేవలం రూ.300 మాత్రమే! అంతేకాకుండా, 80 ఏళ్ల వయసు తర్వాతే ఆ మొత్తం రూ.500కు పెరుగుతుంది. ఇదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం రూ.3,716 అదనంగా మంజూరు చేస్తూ, మొత్తం రూ.4016గా అందిస్తోంది. కేంద్రం మాత్రం తన బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 4,83,573 మంది దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ.200 కోట్లు పెన్షన్ రూపంలో అందిస్తోంది. కానీ, ఇందులో కేంద్రం వాటా  కేవలం 20,578 మందికే రూ.300 చొప్పున రూ.61 లక్షలే!  కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలో కేవలం 20,578 మందికే నెలకు రూ.61 లక్షలు మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 4,83,573 లక్షల మందికి నెలకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది! ఈ సంఖ్యలే కేంద్ర ప్రభుత్వ అసమానత, అన్యాయాన్ని బయటపెడుతున్నాయి.  వికలాంగులచట్టం 2016 ప్రకారం, 40% పైగా దివ్యాంగత ఉన్నవారిని ‘బెంచ్​మార్క్​ డిసేబుల్డ్’గా గుర్తించాలి.  హక్కులు, పథకాల్లో ఈ ప్రమాణం ఆధారంగా లబ్ధి కలగాలి. కానీ, కేంద్ర పెన్షన్ పథకంలో మాత్రం 40% కాకుండా 80% దివ్యాంగత కలిగి ఉండాలని నిబంధన పెట్టడం చట్ట విరుద్ధం.  మానవత్వాన్ని అవమానించే చర్య. ఈ తీరు మారాలి.
- ఎం.డి. షఫీ 
అహ్మద్ ఖాన్