దళిత అభివృధ్ది కార్యచరణకు సమయం వచ్చింది

దళిత అభివృధ్ది కార్యచరణకు సమయం వచ్చింది

దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురికావడానికి సభ్య సమాజమే కారణమన్నారు సీఎం కేసీఆర్. ఎన్నో పోరాటాలు,త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం.. తెచ్చుకున్న తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ ఇవాళ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ.. సాగు నీటి రంగాన్ని  పునరుజ్జీవనం చేసుకున్నామన్నారు. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నామని తెలిపారు. కరెంటు ను నిరంతరాయంగా ఇచ్చుకుంటున్నామన్నారు. ఒకనాడు కూలీ పనికి పోయిన రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నామన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు.. అర్థంకాని పరిస్థితుల నుంచి అర్థవంతమైన, గుణాత్మకాభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులేస్తోందన్నారు. ఆకలి చావుల నుంచి అన్నపూర్ణగా రాష్ట్రం ఎదిగిందన్నారు. కునారిల్లుతున్న కులవృత్తులను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా నిలబెట్టుకున్నామని తెలిపారు. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు  ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు. అన్ని రంగాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలను అండదండలు అందిస్తూ గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నేనున్నాననే ధీమాను స్ఫూర్తిని అందిస్తోందన్నారు.

రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించామన్నారు సీఎం కేసీఆర్. గత వలసపాలనలో అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ  ఇవాళ ఒక దరికి చేరుకుందన్నారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు.కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు వంటి  ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నామని తెలిపారు.

ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృధ్ది కార్యచరణకు ఇప్పుడు సమయం వచ్చిందన్నారు కేసీఆర్. సిద్దిపేట ఎమ్మెల్యేగా వున్నప్పుడు సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టి దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేసినట్లు తెలిపారు. దళితబంధు గతేడాది మే లోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. కానీ కరోనా కారణంతో ఆలస్యమైందని తెలిపారు.