ఆందోళనలో Cognizant టెక్కీలు.. 5 నిమిషాలు ఖాళీగా ఉన్నా అంతే సంగతి..

ఆందోళనలో Cognizant టెక్కీలు.. 5 నిమిషాలు ఖాళీగా ఉన్నా అంతే సంగతి..

దేశంలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న కాగ్నిజెంట్ సంస్థ తాజాగా తన ఉద్యోగులను రిమోట్ గా ట్రాకింగ్ చేసేందుకు టూల్స్ వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ఇందుకోసం కంపెనీ ప్రో‌హాన్స్ అనే సాఫ్ట్‌వేర్ కొన్ని ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ల్యాప్‌టాప్స్‌లో ఇన్‌స్టాల్ చేసింది. దీని ద్వారా ఉద్యోగులు పని గంటల సమయంలో ఎంత సమయం తమ ల్యాప్ టాప్ వినియోగిస్తున్నారో ట్రాకింగ్ చేస్తోంది. 

ఈ టూల్స్ సదరు ఉద్యోగి కీ బోర్డ్, మౌస్ యాక్టివిటీని ట్రాక్ చేస్తూ.. వారు ఏ వెబ్ సైట్లు, అప్లికేషన్స్ ఓపెన్ చేస్తున్నారు, వాటిని ఎంత సేపు వినియోగించారు వంటి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఎవరైనా ఉద్యోగి తన ల్యాప్ టాప్ 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం వినియోగించకుంటే లేదా 15 నిమిషాలు ఎక్కడికైనా వెళితే వారు ఖాళీగా ఉన్నట్లు రికార్డ్ చేస్తున్నాయి ట్రాకింగ్ టూల్స్. ఏ పనిపై ఎంతసేపు ఉద్యోగి సమయం గడుపుతున్నారనే వివరాల ద్వారా ఎక్కడ ఆలస్యాలు జరుగుతున్నాయి, దానిని ఎలా మెరుగుపరచొచ్చు అని కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఇటీవల వరుసగా ఏఐ కారణంగా ఐటీ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ సమయంలో ఇలా కంపెనీ ఉద్యోగి ప్రతి అడుగునూ ట్రాక్ చేయటంపై ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇలా చేయటం వల్ల పనిలో తమపై ఒత్తిడి పెరుగుతోందని కొందరు టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ మాత్రం దీనిని వ్యక్తిగత పనితీరు ట్రాకింగ్ కోసం ఉపయోగించటం లేదని చెబుతున్నప్పటికీ టెక్కీల్లో మాత్రం భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ట్రాకింగ్ పై కంపెనీ మాట ఇదే..
ఉద్యోగుల సిస్టమ్స్ ట్రాకింగ్ టూల్ వార్తతో పెరుగుతున్న ఆందోళలపై కాగ్నిజెంట్ క్లారిటీ ఇచ్చింది. ఈ విధానాన్ని కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే వాడుతున్నట్లు చెప్పింది. క్లయింట్స్ రిక్వెస్ట్ వల్లనే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కోసం ఇలా చేయాల్సి వస్తున్నట్లు చెప్పింది. ఈ టూల్ ఉద్యోగులు క్లయింట్ల అవసరాలను మెరుగ్గా అర్థం చేసుకోవటానికి వీలుపడుతుందని చెప్పింది. అలాగే పనిలో జరుగుతున్న ఆలస్యాలను గుర్తించి దానిని మెరుగుపరిచేందుకు మాత్రమే దీనిని వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది.