దీదీకి ఎదురు లేదా..? : మల్లంపల్లి ధూర్జటి

దీదీకి ఎదురు లేదా..? : మల్లంపల్లి ధూర్జటి

ప శ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టి.ఎం.సి) విజయ దుందుభి మోగించింది. గ్రామీణ ప్రాంతాలపై తనుకున్న పట్టు చెక్కుచెదరలేదని నిరూపించుకుంది. పోటీ ప్రధానంగా టీఎంసీ, బీజేపీల మధ్యనే అయినప్పటికీ వామపక్షాలు, కాంగ్రెస్, అబ్బాస్ సిద్దికీ ఏర్పాటు చేసిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐ.ఎస్.ఎఫ్) వంటివి కూడా ఎన్నికల బరిలోకి దిగి నామమాత్రంగానైనా సీట్లను చేజిక్కించుకున్నాయి. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బెంగాల్ లో టీఎంసీ సాధించిన విజయాన్ని స్థూలంగానైనా విశ్లేషించుకోవడం అవసరం. పంచాయతీ ఎన్నికలు కనుక సంఖ్యా వివరాల లోతుల్లోకి పోనవసరం లేదు. 

ఫలించిన అభిషేక్ యాత్ర

ఈ ఎన్నికల్లో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆయన డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యునిగా ఉన్నారు. టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి మేనల్లుడైన అభిషేక్ 2011 నుంచి తృణమూల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గత జూన్ లో సిలిగుడీ సమీపంలోని సేవోక్ వైమానిక స్థావరంలో అత్యవసరంగా దిగినపుడు, దాని నుంచి దిగే క్రమంలో ఆమె నడుముకు, కాళ్లకు గాయాలయ్యాయి. తర్వాత, ఆమె బాగ్ డోగ్రా నుంచి విమానంలో కోల్ కతా చేరుకున్నారు. ఫలితంగా, ఆమె పంచాయతీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయలేదు. కొన్ని సభల్లో మాత్రమే స్వయంగా పాల్గొన్నారు. మరికొన్నింటినుద్దేశించి ఆన్ లైన్ లో ప్రసంగించారు. దాంతో ప్రచార బాధ్యతను అభిషేక్ తన భుజాలకెత్తుకున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన నబొ జోవార్ పేరుతో 54 రోజుల రాష్ట్ర వ్యాప్త యాత్ర చేశారు. ఇది కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడంలో బాగా సహాయపడింది.

మమత వెంటే మైనారిటీలు, గిరిజనులు

మైనారిటీలు టీఎంసీ వెంటే ఉన్నట్లు ఈ ఎన్నికల ద్వారా మరోసారి నిరూపితమైంది. మైనారిటీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తర దినాజ్ పూర్, మాల్డా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో టీఎంసీ గణనీయమైన విజయాలు సాధించింది. కాంగ్రెస్, ఐ.ఎస్.ఎఫ్ లు టీఎంసీని ఓడించగలవు అనుకున్న కొన్నిచోట్ల మాత్రం ఓటర్లు వాటివైపు మొగ్గు చూపారు. మిగిలిన చోట్ల తృణమూల్ కే ఓటు వేశారు. పోటీ ప్రధానంగా టీఎంసీ, బీజేపీ మధ్యనే సాగింది.  బెంగాల్ పశ్చిమ ప్రాంతంలోని జిల్లాల్లో, ఉత్తర బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో టీఎంసీ ఊహించిన దానికన్నా మెరుగైన ఫలితాలను సాధించింది. ఇంతవరకు ఆ ప్రాంతాలు బీజేపీకి కంచుకోటలుగా ఉంటూ వచ్చాయి. 

అవినీతిపైనే ప్రతిపక్షాల ప్రచారం

బెంగాల్ లో దాదాపు 12 ఏళ్ళుగా అధికారంలో ఉన్న  టీఎంసీ పట్ల ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుందని అది ఈ ఎన్నికల్లో పనిచేస్తుందని ప్రతిపక్షాలు ఆశించాయి. రాష్ట్రంలోని పాలక పార్టీ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలను అవి ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. కేంద్రం ఇస్తున్న నిధులను టీఎంసీ నేతలు స్వాహా చేస్తుండటం వల్లనే ఆచితూచి నిధులు మంజూరు చేయాల్సి వస్తోందని బీజేపీ నాయకులు చెబుతూ వచ్చారు. ఉపాధ్యాయుల నియామకాల్లో  చోటుచేసుకున్న కుంభకోణం గురించి బీజేపీతో సహా ఇతర ప్రతిపక్షాలు గత కొద్ది నెలలుగా ప్రచారం చేస్తూ వచ్చాయి. కరువు భత్యం (డి.ఏ) చెల్లింపులో కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల మధ్యనున్న అంతరం గురించి పేర్కొంటూ వచ్చాయి. ఇవి ముఖ్యమైన అంశాలే అయినా అవి గ్రామీణులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. లక్ష్మీ భాండార్ వంటి పథకాల ద్వారా గ్రామీణుల కష్టాలు తీర్చడానికి తృణమూల్ ప్రభుత్వం ఎలా కృషి చేస్తున్నదీ టీఎంసీ నేతలు వివరిస్తూ వచ్చారు. అవినీతిపై ప్రతిపక్షాలు చేసిన ప్రచారం కన్నా, ఇదే ఓటర్లను ఆకట్టుకుంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలకు మమతా బెనర్జీ ప్రభుత్వం 2021 ఫిబ్రవరి నుంచి లక్ష్మీ భాండార్ పథకాన్ని అమలు జరుపుతోంది. స్వస్థ్య సాథీ లో పేరు నమోదు చేసుకున్న 25 నుంచి 60 ఏండ్ల వయసుగల మహిళలకు ఆ పథకం కింద నెలకు రూ. 1000 చొప్పున అందిస్తున్నారు. 

టీఎంసీ జోరు కొనసాగేనా?

పంచాయతీ ఎన్నికల ఫలితాలు సహజంగానే టీఎంసీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ‘నో ఓట్ ఫర్ మమత’ అన్న బీజేపీ నినాదాన్ని ‘నౌ ఓట్ ఫర్ మమత’ అన్న నినాదంగా మార్చినందుకు అభిషేక్ బెనర్జీ బెంగాల్ ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కానీ, వచ్చే లోక్ సభ ఎన్నికల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని చెప్పలేం. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో బీజేపీ అనేక రకాల ప్రయోగాలు చేస్తోంది. టీఎంసీ 2018లో ఇలాగే ఆకర్షణీయమైన ఫలితాలు సాధించింది. కానీ, ఆ మరుసటి ఏడాది 2019 ఎన్నికల్లో  బీజేపీ 18 లోక్ సభ స్థానాలు గెలిచింది. పైగా, నందిగ్రామ్ శాసనసభా నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 17 గ్రామ పంచాయతీల్లో  బీజేపీ ఈసారి తొమ్మిదింటిని గెలుచుకుంది. అసెంబ్లీకి 2021లో జరిగిన ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్వల్ప మెజారిటీతో మమతపై గెలుపొంది అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఇపుడు శాసనసభలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో నందిగ్రామ్ లో బీజేపీకి చోటు లేకుండా చేయాలని టీఎంసీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం కనిపించలేదు. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో కాంగ్రెస్, వామపక్షాలు కొన్ని పంచాయతీలనైనా దక్కించుకోగలిగాయి. ప్రతిపక్షాలు గట్టిగా ప్రతిఘటిస్తే  టీఎంసీ కాళ్ళ కింద నేల కుంగుతుందని ఆ ఫలితాలు పరోక్షంగా వెల్లడించాయి. 

రక్తం చిందించిన ఎన్నికలు

పార్టీల గెలుపోటములను పక్కనపెట్టి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో అంశం ఎన్నికల హింస.  పంచాయతీ ఎన్నికల  సందర్భంగా చోటుచేసుకున్న హింసలో చనిపోయినవారు  ఏ పార్టీ వారైతేనేం పదుల సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ కేంద్ర భద్రతా బలగాలను వినియోగించేటట్లుగా చూడవలసిందని కోల్ కతా హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ముందే ఆదేశించింది. అయినా రక్తం చిందక మానలేదు. ఎన్నికల హింస బెంగాల్ కు కొత్తేమీ కాదు. ఆమాటకొస్తే, ఆ విషయంలో దానిది సుదీర్ఘ చరిత్రే. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్​బీ) డాటా ప్రకారం 2018లో జాతీయంగా 54 రాజకీయ హత్యలు సంభవిస్తే, అందులో అత్యధికంగా 13 హత్యలు బెంగాల్ లోనే చోటుచేసుకున్నాయి. 

బిహార్, ఉత్తర ప్రదేశ్, కేరళ, జార్ఖండ్ లలో కూడా ఎన్నికల నెత్తుటి మరకలు ఎక్కువే. మావోయిస్టులు, సీపీఎం మధ్య 1970లలో మొదలైన రక్తపాతం ఈ ధోరణికి ఒక రకంగా బీజం వేసింది. ఎన్నికలను బూర్జువా జిమ్మిక్కులుగా చూసే ఆ రెండు పక్షాలవారు ఎన్నికల హింసకు వెనకాడకపోవడం మాత్రం వింతే. వర్గ పోరాటం పేరుతో హింసను ప్రేరేపించడంలో ప్రధాన పాత్ర వామపక్షాలదే. ఆయా రాష్ట్రాల్లో వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు హింసకు దిగిన కార్యకర్తలపై పోలీసు కేసులు లేకుండా చేస్తూ, రక్షిస్తూ రావడంతో అది బాగా వేళ్ళూనుకుంది. నిరుద్యోగ యువత గణనీయమైన సంఖ్యలో ఉండడం కూడా అల్లర్లకు కొంత కారణమవుతోంది. నిధుల మంజూరులో కేంద్రం ఉపేక్ష వహిస్తోందని నిందిస్తూ వచ్చిన పశ్ఛిమ బెంగాల్ ప్రభుత్వం తనవంతుగా పంచాయతీలకు ఏపాటి నిధులు 

కేటాయిస్తుందో చూడాలి.

నరేంద్ర మోదీపై విమర్శలు జరుగుతున్నవి పంచాయతీ ఎన్నికలైనా అభిషేక్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బెంగాల్ కు రావలసిన నిధులు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో   బీజేపీని గెలిపించనుందుకు మోదీ అలా ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆయన దుమారం రేపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ గృహ నిర్మాణ పథకాలకు అందుకనే తగినంతగా నిధులు ఖర్చు చేయలేకపోతున్నామని అభిషేక్ చెప్పుకొచ్చారు. రాష్ట్రం నుంచి పది లక్షల మందిని ఢిల్లీ తీసుకెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటామని కూడా ఆయన ప్రకటించారు. మమతా బెనర్జీ చేపట్టిన సంక్షేమ పథకాల చుట్టూ ఆయన ప్రచారం సాగింది. గతంలో, వామపక్షాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు ఇదే రకమైన ఆరోపణలు చేసేవి. తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి ఆ ఆరోపణ తన పసను కోల్పోలేదని వెల్లడవుతోంది. 

- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్​