రేపు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన మారుతున్న క్యాండిడేట్ల పేర్లు

రేపు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన మారుతున్న క్యాండిడేట్ల పేర్లు

హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఢిల్లీకి చేరింది. రేపు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో క్యాండిడేట్ల అంశం చర్చించి ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ముంబై లో భారత్ జోడో  న్యాయ్ యాత్ర ముగింపు సభకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్నించి అటే ఢిల్లీ వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపటి సమావేశం కోసం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను  ప్రకటించింది. 

అందులో నల్లగొండ, జహీరాబాద్, మహబూబాద్, మహబూబ్ నగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో 13 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. దాదాపు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావించినప్పటికీ చివరి క్షణంలో  ఏఐసీసీ పెండింగ్ లో పెట్టింది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్  భావించింది. అయితే నిన్న సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సీన్ మారిపోయింది. దీంతో సునీతా మహేందర్ రెడ్డిని ఎక్కడ అకామిడేట్ చేస్తారన్నది తేలడం లేదు. సికింద్రాబాద్ టికెట్ ను బొంతు రామ్మోహన్ కు, మల్కాజ్ గిరి సీటును చంద్రశేఖ్ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరిగింది. ఫ్లాష్ సర్వేతో ఈ రెండు స్థానాలపై వెనుకడుగు పడినట్టు తెలుస్తోంది. 

ALSO READ :- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాటికొండ రాజయ్య..వరంగల్ టికెట్ దక్కేనా..?

సికింద్రాబాద్ నుంచి నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ ను బరిలోకి దించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. అదే నిజమైతే ఖమ్మం,  నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, భువనగిరి స్థానాలను అభ్యర్థుల ప్రకటన రేపు ఉండకపోవచ్చననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నాలుగు స్థానాలను చివరి దాకా లాగి ఫ్లాష్​ సర్వే, అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకున్న మీదటే ఫైనల్ చేస్తారనే చర్చ సాగుతోంది. పొత్తులో భాగంగా తమకు ఒక్క సీటైనా ఇవ్వాలని సీపీఐ అడుగుతోంది. దీనిపై ఏఐసీసీ ఎలాంటి  నిర్ణయం తీసుకుంటనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి స్థాయిలో క్లారిటీ కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.