పెన్షన్ స్కీమ్​గా మార్చాలి : నిమ్స్ స్టాఫ్​ నర్సుల నిరసన

పెన్షన్ స్కీమ్​గా మార్చాలి  : నిమ్స్ స్టాఫ్​ నర్సుల నిరసన

ఖైరతాబాద్, వెలుగు: నిమ్స్ హాస్పిటల్​లో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న తాము, ఈపీఎఫ్ తో నష్టపోతున్నామని.. దాన్ని నిమ్స్ పెన్షన్ కు కన్వర్ట్ చేయాలని స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. మంగళవారం లంచ్ అవర్​లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిమ్స్ పారా మెడికల్ యూనియన్ ప్రెసిడెంట్ శాంతి మాట్లాడుతూ.. 1994లో పెన్షన్ స్కీమ్ ను అమలు చేశారని, అప్పుడు 800 మంది నిమ్స్ పెన్షన్ లోకి ఆప్షన్ పెట్టుకుని మారారన్నారు. 200 మంది ఈపీఎఫ్​లోనే ఉండిపోయారని తెలిపారు. 

2011లో మళ్లీ ఆప్షన్ ఓపెన్ చేసి సర్క్యులర్ ఇచ్చారని, అప్పుడు మిగిలిన 20శాతం మంది ఆప్షన్ ఇచ్చారన్నారు. 2011 నుంచి ఈపీఎఫ్ అనేది 5సార్లు ఎగ్జిక్యూటివ్​ బోర్డ్ లో తీర్మానాన్ని అప్రూవల్ చేస్తూ, గవర్నింగ్ కౌన్సిల్ కు సబ్మిట్ పంపించాలన్నారు. 15ఏండ్లుగా గవర్నింగ్ కౌన్సిల్ జరగకపోవడంతో తమ ఫైల్ పెండింగ్ లో ఉందన్నారు. కొన్నిసార్లు నిమ్స్ మేనేజ్​మెంట్​ చర్చలకు పిలిచి.. పెన్షన్ స్కీం కుదరదని చెప్పిందని తెలిపారు. కార్యక్రమంలో పోదెటి చంద్ర శేఖర్, దేవదానం తదితరులు పాల్గొన్నారు.