
రాష్ట్రానికి పెట్టుబడులు భవిష్యత్ తరాలకు ఆశాదీపంగా కాంతినిస్తాయి. పెట్టుబడులతో పరిశ్రమలొస్తాయి. పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఈ అవకాశాలు కొత్త తరంలో ఆశలు నింపడమే కాకుండా, సమాజంలో మార్పులకు కూడా నాంది పలుకుతాయి. ఒక ఉద్యోగం ఒక కుటుంబంలో వెలుగులు, ఆశలు తీసుకొస్తుంది. పెట్టుబడులు ఉద్యోగాల సృష్టికే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులుగా నిలుస్తాయి. విదేశీ, దేశీయ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికవ్యవస్థను దృఢంగా నిలబెడతాయి.
తెలంగాణ ఉద్యమంలో కీలక నినాదమైన ‘నియామకాలు’ అంశానికి పెద్దపీట వేస్తూ భారీగా ప్రభుత్వ నియామకాలు చేపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మరోవైపు సహజ వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలను పెంచడానికి కృషి చేస్తోంది. రాష్ట్ర యువతకు ప్రైవేట్ ఉద్యోగాల కల్పనతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి కూడా చర్యలు తీసుకుంటోంది.
దావోస్ వేదికగా నిర్వహించిన 2024–25 ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ సమావేశాలలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పెట్టుబడులను ఆకర్షించింది. 2024లో రూ.40,832 కోట్లతో 18 పరిశ్రమల ఏర్పాటుకు, 2025లో రూ.1,78,950 కోట్లతో 26 పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకోవడంతో రాష్ట్రంలో సుమారు 75 వేలకుపైగా ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. వీటిలో 50 శాతానికిపైగా ఉద్యోగాలు ఐటీ రంగంలోనే ఉన్నాయి.
ఐటీ రంగాన్ని ఆకర్షిస్తున్న హైదరాబాద్
ఆధునిక సాంకేతికతలో గ్రేటర్ హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకతలు ఐటీ రంగాలను ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడుల కోసం కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఏరో స్పేస్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. 2024లో వచ్చిన పెట్టుబడుల్లో ఐటీ, డేటా సెంటర్లకుగాను రూ.15,200 కోట్లు, ఎనర్జీ రంగంలో రూ.23,000 కోట్లు, లైఫ్ సైన్సెస్‌లో రూ.2,632 కోట్ల ఒప్పందాలు జరిగాయి. ఇక 2025 పెట్టుబడుల్లో ఐటీ, డేటా సెంటర్లకుగాను రూ.1,04,500 కోట్లు, ఎనర్జీ రంగంలో రూ.66,500 కోట్లు, లైఫ్ సైన్సెస్‌లో రూ.7,950 కోట్లు ఒప్పందాలు జరిగాయి. వీటిలో ఇప్పటికే 70శాతానికి పైగా ప్రాజెక్టులు పూర్తికాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయి.
ఈ పెట్టుబడులతో ప్రస్తుతం రెండు శాతం ఉన్న రాష్ట్ర జీడీపీ వృద్ధి చెందే అవకాశాలున్నాయి. దావోస్ ఒప్పందాల అమలు తీరుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పెట్టుబడుల రాక కోసం అధికారులను ప్రోత్సహిస్తున్నారు. ప్రాజెక్టుల ఏర్పాటుకు భూముల కేటాయింపులు, స్థలాల కొనుగోలు, డీపీఆర్ తయారుచేయడం ప్రక్రియలు పూర్తి చేయడానికి ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది. దావోస్ ఒప్పందాల ఎంవోయూలు పూర్తిగా కార్యరూపం దాలిస్తే తెలంగాణ రాష్ట్రం ఆసియా డేటా సెంటర్ హబ్‌గా మారుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీ
అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీ నెలకొల్పి రానున్న రెండేళ్లలో 2 లక్షల మంది ఏఐ నిపుణులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దేశంలో తొలి ఏఐ ఎక్స్చేంజ్ ‘తెలంగాణ డేటా ఎక్స్చేంజ్’ (టీజీడెక్స్)ను ఇప్పటికే ప్రారంభించిన ప్రభుత్వం ఏఐను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు జెకా సహకారంతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధకులకు, యువతకు సాంకేతిక తోడ్పాటు అందిస్తోంది.
టీజీడెక్స్ ద్వారా రైతులకు సంబంధించిన అగ్రిటెక్ స్టార్టప్స్కు డేటా అందుతుంది. ఐటీ రంగాన్ని గ్రేటర్ హైదరాబాదుకే పరిమితం చేయకుండా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, షాద్‌నగర్ ప్రాంతాల్లో కూడా విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ప్రారంభించేందుకు ముందుకొచ్చేవారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామం.
నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ
రాష్ట్రానికి పెట్టుబడులు అవసరమని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్లో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మించాలని నిర్ణయించారు. పెట్టుబడుల కోసం వ్యాపారవేత్తలకు అనువుగా సకల సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని 30 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి 2025 మార్చి 6వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగర శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 6 మండలాలను ఫ్యూచర్ సిటీ కోసం ఎంపిక చేశారు.
రాజధాని గ్రేటర్లో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాదులకు అదనంగా నాలుగో నగరంగా ‘ఫ్యూచర్ సిటీ’ రూపొందుతోంది. ఇక్కడ ఐటీతోపాటు ఇతర రంగాలకు కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. యాపిల్ ఫోన్ విడిభాగాల పరిశ్రమ, ఎలక్ట్రిక్ ఈవీ బస్సుల తయారీ యూనిట్, ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, రేస్ క్లబ్, గోల్ఫ్ క్లబ్, ట్రేడ్ సెంటర్లు రానున్నాయి. కాలుష్య రహితంగా అభివృద్ధి చేస్తున్న ఈ ఫోర్త్ సిటీలో పరిశోధనలు చేసే సంస్థలకు, ముడి సరుకు తెచ్చి మందులను తయారుచేసే ఫార్మా కంపెనీలకే భూములను కేటాయిస్తారు.
తెలంగాణ రైజింగ్
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉండడంతో పాటు రహదారుల విస్తరణ, మెట్రో పొడగింపుతో నాలుగో నగరానికి రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా రాష్ట్రాన్ని పెట్టుబడులకు, పరిశ్రమలకు కేరాఫ్‌గా మలిచేలా ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు ఫలిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబర్చడంతో రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెరగడం యువతకు వరం.
పరిశ్రమలను తేవడంతోపాటు వాటికి అవసరమైన నైపుణ్యంగల యువతను తయారుచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకించి స్కిల్ డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులతోపాటు ప్రభుత్వం అందిస్తున్న పలు ప్రోత్సాహకాలు, స్థానికంగా నైపుణ్యమున్న యువత లభిస్తుండడంతో దేశ, విదేశీ పెట్టుబడుదారులు పరిశ్రమలను స్థాపించేందుకు తెలంగాణ రాష్ట్రం గేట్వేగా మారుతోంది. ఇది రాష్ట్ర యువతలో ఉపాధి భరోసా నింపుతోంది.
-ఐ.వి. మురళీకృష్ణ శర్మ