
సైంటిస్ట్, మోడల్.. ఈ రెండింటి మధ్య ఏమైనా సంబంధం ఉందా? రెండూ పూర్తిగా వేర్వేరు రంగాలు. కానీ, జాక్ హసిల్వుడ్ అనే 27 ఏండ్ల బ్రిటన్ రాకెట్ సైంటిస్టుకు మాత్రం ఈ రెండు పనులూ భలే ఇష్టం! అందుకే.. అతడు ‘మిస్టర్వరల్డ్–2019’ అయ్యాడు. ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం జరిగిన మిస్టర్వరల్డ్ పోటీల్లో అతడు 71 దేశాల నుంచి వచ్చిన అందగాళ్లను వెనక్కి నెట్టి ఈ కిరీటం సొంతం చేసుకున్నాడు. బ్రిటన్ నుంచి మిస్టర్ వరల్డ్అయిన తొలి వ్యక్తి కూడా ఇతడే కావడం విశేషం.
181 ఐక్యూ.. తెలివైనోళ్లకే తెలివైనోడు
మామూలుగా ఐక్యూ160 ఉంటేనే వారిని అబ్బా అంత తెలివా అంటాం. జాక్ ఐక్యూ ఎంతో తెలుసా.. 181! అందుకే, అతడిని తెలివైనోళ్లకే తెలివైనోడు అంటూ తెగ పొగిడేస్తున్నారు. మిస్టర్వరల్డ్ పోటీలు రెండేండ్ల కోసారి జరుగుతాయి. ఐదు అంశాల్లో టెస్టులు పెట్టి, విజేతను ప్రకటిస్తారు. శరీర దారుఢ్యం, నైపుణ్యం, అంకితభావం, ఫ్యాషన్, మల్టీమీడియా అంశాల్లో పరీక్షలు ఉంటాయి. 6.3 అడుగుల ఎత్తుండే జాక్ ఈ టెస్టులన్నింటిలోనూ సత్తా చాటాడు. ఐక్యూలోనూ నెం.1గా నిలిచి జడ్జిలను ఆశ్చర్యపరిచాడు.
చిన్నప్పటి నుంచే రెండు పడవలపై కాళ్లు..
ఐదేళ్ల వయసులోనే జాక్‌కు ఒక చిన్న మోటారు బైకు ఉండేది. దానిని విప్పి పార్ట్లు పీకి వేరు చేసేవాడు. దీంతో ఇంజన్లు, టెక్నాలజీ వైపు అతడికి అప్పుడే ఆసక్తి ఏర్పడింది. స్కూల్లోనూ అతడు సైన్స్ ప్రయోగాల్లో ముందుండేవాడు. జాక్ అక్కలిద్దరు అప్పటికే మోడలింగ్‌లో ఉన్నారు. దీంతో అతడికి పదిహేనేళ్ల వయసులో మోడలింగ్‌పైనా ఆసక్తి కలిగింది. ‘బ్లడ్‌హౌండ్’ అనే బ్రిటిష్ సూపర్ సోనిక్ ల్యాండ్ వెహికల్ప్రాజెక్టుకు మోడలింగ్ కూడా చేశాడు. ఆ ప్రాజెక్టులో టెక్నాలజీకి సంబంధించి అనేక విషయాలు తెలుసుకున్న అతడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్చదవాలని నిర్ణయించుకున్నాడు. 21 ఏండ్లకు కింగ్ స్టన్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చదివి, మార్షల్స్ ఏరోస్పేస్ అనే కంపెనీలో చేరాడు. ప్రస్తుతం ఆ కంపెనీకి టెక్నికల్అడ్వైజర్గా పనిచేస్తున్నాడు. మిస్టర్ వరల్డ్ కోసం కొన్నాళ్లు సెలవు పెట్టి ఇప్పుడు కిరీటాన్నే గెలిచేశాడు.