- రెండు రిపోర్టులను తయారు చేసిన అధికారులు.. ఎన్డీఎస్ఏ కమిటీకి అందజేత
- ఇయ్యాల, రేపు మూడు బ్యారేజీలను పరిశీలించనున్న కమిటీ
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీతో అధ్యయనం చేయించినట్టు తెలిసింది. బ్యారేజీకి జరిగిన డ్యామేజీ తీవ్రత.. బ్యారేజీని తిరిగి వాడుకోవచ్చా లేదా అన్న అంశాలపై వర్సిటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్లు, ఇంజనీర్లతో స్టడీ చేయించినట్లు సమాచారం. ఒక్క మేడిగడ్డ బ్యారేజీకే పరిమితం కాకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైనా రీసెర్చ్ చేయించినట్టు తెలిసింది.
రాష్ట్ర ఇరిగేషన్ అధికారులే దగ్గరుండి ఆ స్టడీని పర్యవేక్షించినట్టు సమాచారం. ఆ స్టడీకి సంబంధించి రెండు రిపోర్టులను కూడా తయారు చేశారని అధికారులు అంటున్నారు. ఆ 2రిపోర్టులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీకి అందించినట్టు సమాచారం.
గేట్లు ఎత్తొచ్చా..!
మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీ చూశాక గేట్లు ఎత్తడం దాదాపు కష్టమేనని తొలుత నిపుణులు అభిప్రాయపడ్డారు. వానాకాలంలోపు పరిస్థితి ఇలాగే ఉంటే పెద్ద వరదొస్తే కుంగిన పిల్లర్ల పక్కనున్న పిల్లర్లు కూడా దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. గేట్లను కట్ చేస్తే ఫ్లడ్స్ టైం నాటికి వరద వచ్చినా సాఫీగా ముందుకు వెళ్తుందని అభిప్రాయపడ్డారు. అయితే, జాదవ్‌పూర్ యూనివర్సిటీ నివేదికలు, రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారుల పరిశీలనలో మాత్రం ఆ గేట్లను ఎత్తేందుకు వీలవుతుందని తేలినట్టు తెలుస్తున్నది.
గేట్ల పైభాగాన ఉండే సీల్స్‌ను తీసేస్తే గేట్లను పైకి ఎత్తవచ్చని ఓ సీనియర్ అధికారి చెప్పారు. మరోవైపు పిల్లర్ల కింద ఉన్న ఇసుక పోవడం వల్లే పిల్లర్లు కుంగి క్రాక్స్ వచ్చాయని తెలిపారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేయలేదని నిపుణులు చెప్తున్నట్టు తెలిసింది. ఇవన్నీ కలిపి రెండు రిపోర్టులను జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఇంజనీర్లు తయారు చేసిచ్చినట్టు సమాచారం.
ఎల్లుండి వరకు కమిటీ పర్యటన
ఎన్డీఎస్ఏ వేసిన నిపుణుల కమిటీ మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండనుంది. బుధవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో కమిటీ సమావేశమైంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ను అడిగి తీసుకుంది. గురువారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనుంది. దాదాపు నాలుగైదు గంటల పాటు అక్కడే ఉండి బ్యారేజీ డ్యామేజీలను విశ్లేషించనుంది. అనంతరం మధ్యాహ్నం అన్నారం బ్యారేజీకి వెళ్లి పరిశీలించనుంది. అక్కడి నుంచి రామగుండం వెళ్లి రాత్రి బస చేయనుంది. శుక్రవారం ఉదయం సుందిళ్ల బ్యారేజీకి వెళ్లి దానిని విశ్లేషించనుంది.
అక్కడ ఇన్స్పెక్షన్ పూర్తికాగానే సాయంత్రం వరకు హైదరాబాద్‌కు నిపుణులు రానున్నారు. శనివారం ఉదయం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కాగా, కమిటీ పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో నాడు భాగమైన ఇంజనీర్లు, అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తున్నది.
