
- మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్
సూర్యాపేట, వెలుగు: సీఎం రేవంత్ కి పరిపాలన చేతకావట్లేదనేది ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుందని, వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో క్యాంపు ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ తీరు ఓనమాలు రాని వాడు పదో తరగతి చదివినట్లుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఢోకా లేదని, అప్పులతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ రెండున్నర లక్షల కోట్ల ఆదాయానికి తెచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తుందని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం లూటీ చేసి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని ఆరోపించారు. హామీలు ఎగ్గొట్టడం కోసమే రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ప్రజలను రెచ్చగొట్టి హామీలిచ్చి ప్రస్తుతం చేతులెత్తేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో ఇంకా కేసీఆర్ పెట్టిన రూ. లక్ష చెక్కులే ఇస్తున్నారన్నారు. తులం బంగారం ఎప్పుడిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్ లో 306 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.