
- మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
చండూరు, వెలుగు : కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగడం లేదని, రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం చండూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఇందుకు నిదర్శనం చండూరు మున్సిపల్ చైర్మన్ దుకాణ నిర్మాణాన్ని కూల్చివేయడమేనని చెప్పారు. అభివృద్ధి పనులు చేయపోవడంతో బీఆర్‌ఎస్ చేసిన పనులకే కొత్తగా బోర్డులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ వచ్చే నాటికి నల్గొండ జిల్లా అభివృద్ధిలో ఆఖరులో ఉంటే.. కేసీఆర్ పాలనలో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతున్నట్టు.. రివ్యూ మీటింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్పారని అన్నారు. సమీక్షలో మంత్రులు మాత్రమే మాట్లాడితే మేం ఎందుకు అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని తెలిపారు. కొంతమంది ప్రజాప్రతినిధులు పోలీసుల నుంచి మామూళ్లు తీసుకోవడం దురదృష్టకరమన్నారు.
మంత్రి ఉత్తమ్ నీటి పారుదల, సివిల్ సప్లై శాఖలపై ఏ మాత్రం అవగాహన లేదన్నారు. కృష్ణానదితోపాటు గోదావరి జలాలను సైతం ఆంధ్రాకు అప్పగిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ దుర్మార్గులకు చెక్ పెట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.