పూరీ రథయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులు

పూరీ రథయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులు

పూరీ జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసి పోయింది. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా పూరీ జగన్నాథ రథయాత్ర చేపట్టలేదు. కరోనా తగ్గిన నేపథ్యంలో ఈసారి భక్తులకు యాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో నిన్నటి నుంచే పూరీ నగరంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ యాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.ఈసారి రథయాత్రకు దాదాపు పదిహేను లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు అధికారు.

కాగా, పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాదిపాటు గర్భాలయంలో కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథాయాత్ర జరిగే రోజున తన సోదరి సుభధ్ర, సోదరుడు బలభద్రుడితో కలసి రథం అధిరోహిస్తాడు. పూరీ అంటే పూరించేదని అర్థం. భక్తుల కోర్కెలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరీ అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదమైందని భక్తుల విశ్వాసం.