ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ విజయం

ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ విజయం

ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి  మార్గరెట్ అల్వా పై 346 ఓట్ల తేడాతో గెలుపొందరు. ఎన్నికల్లో మొత్తం 725 ఓట్లు పోలవ్వగా అందులో జగదీప్ కు 528, మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.  లెక్కింపు పూర్తైన అనంతరం ఉప రాష్ట్రపతిగా  ధన్కర్ ఎన్నికైనట్లు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రకటించారు. ఈ నెల 11న ఆయన వైస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

 

92.94శాతం పోలింగ్

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ, లోక్ సభకు చెందిన మొత్తం 780 ఎంపీలకు ఓటు హక్కు ఉండగా 725 మంది ఓటు వేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించగా 92.94శాతం మంది ఓట్లు వేసినట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.

రైతు కుటుంబంలో పుట్టి

1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్‌ సైనిక్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన.. జైపూర్‌ రాజస్థాన్‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.  జనతాదళ్‌ తరపు నుంచి 9వ లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝును స్థానం నుంచి జగదీప్ ధన్కర్ ఎంపీగా విజయం సాధించారు. 1993లో కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2019లో కేంద్రం జగదీప్ ను బెంగాల్ గవర్నర్ గా నియమించింది. 

సుప్రీంకోర్టు లాయర్
జగదీప్ ధన్కర్ రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో మెంబర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్ల పాటు సుప్రీం కోర్టులోనూ పని చేశారు.