రేపు జగదీప్ ధన్‌కర్‌ నామినేషన్

 రేపు జగదీప్ ధన్‌కర్‌ నామినేషన్

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌  రేపు (జులై 18న) మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.  జులై 19తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో రేపు ధన్‌కర్ నామపత్రాలను సమర్పించనున్నారు.  నిన్న సాయంత్రం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా  జగదీప్ ధన్‌కర్‌ను ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  అటు కర్నాటకకు చెందిన మాజీ మహిళా గవర్నర్‌ మార్గరెట్‌ ఆల్వాను విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిపారు. 

ప్రస్తుతం బెంగాల్ గవర్నర్గా ఉన్న జగదీప్ ధన్‌కర్‌ 1951 మే 18న రాజస్థాన్లోని కుగ్రామంలో జన్మించారు. చిత్తోఢ్ఘడ్ సైనిక్ స్కూల్ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జగదీప్.. సుప్రీంకోర్టులో పలు కేసులు వాదించారు. రాజస్థాన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 

1989లో ధ‌న్‌క‌ర్‌ జ‌న‌తాద‌ళ్ త‌ర‌ఫున జున్ జునూ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 1993 నుంచి 1998 వరకు కిషన్ఘడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 జులై 30న జగదీప్ ధన్కర్ వెస్ట్ బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.