సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ..ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ..ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

పెగడపల్లి, వెలుగు :  భూమి కొనుగోలు, అమ్మకం విషయంలో వివాదం తలెత్తడంతో జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంటకు చెందిన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఒకరు పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో తీసుకుని గ్రామ వాట్సాప్​ గ్రూపులో పోస్ట్ చేయగా, ఇది చూసిన మరొకరు కూడా పురుగుల మందు తాగడంతో కలకలం మొదలైంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంటలో మూడేండ్ల కింద మాజీ సర్పంచ్​ మణెమ్మ భర్త బండారు శ్రీనివాస్​కు చెందిన రెండెకరాలను తొట్ల కొమురయ్య కొన్నాడు.

దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్​ కూడా పూర్తయ్యింది. ఈ భూమి పక్కనే శ్రీనివాస్​కు చెందిన మరో 20 గుంటలు ఉండడంతో దాన్ని కూడా కొనేందుకు కొమురయ్య బయానా ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం రిజిస్ట్రేషన్ ​చేయకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇది ఎటూ తెగలేదు. దీంతో శ్రీనివాస్​భూమిని తిరిగి అతడికే రిజిస్ట్రేషన్ ​చేయాలని, కొమురయ్య డబ్బులు తిరిగివ్వాలని శ్రీనివాస్​కు చెప్పారు.

దీనికి ఇద్దరూ ఒప్పుకున్నారు. కొమురయ్య ..శ్రీనివాస్​ దగ్గర రెండెకరాలు కొన్నప్పుడు రూ.47 లక్షలు ఇచ్చాడని, వడ్డీతో కలిపి రూ.67 లక్షలు ఇవ్వాలని తీర్పు చెప్పారు. దీంతో శ్రీనివాస్....రూ.40 లక్షలు తిరిగిచ్చాడు. మరో రూ.27 లక్షలను ఇవ్వకుండా ఆలస్యం చేస్తుండడంతో, ఆ డబ్బులు ఇస్తేనే  రిజిస్ట్రేషన్ ​చేస్తానని కొమురయ్య తేల్చిచెప్పాడు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే సోమవారం శ్రీనివాస్​ తన పొలంలో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దీన్ని గ్రామ వాట్సాప్​ గ్రూపులో పోస్ట్​ చేశాడు. ఇది చూసిన అతడి కుటుంబసభ్యులు వెంటనే దవాఖానకు తరలించారు. వీడియో వైరల్ ​కావడంతో కొమురయ్య కొడుకు శేఖర్​తమను బద్నాం చేసేందుకే శ్రీనివాస్​ఇలా చేస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని ఇంటి దగ్గర సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. ఇద్దరిని చికిత్స కోసం జగిత్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు.