బషీర్బాగ్, వెలుగు: బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంపై తెలంగాణ జాగృతి నాయకులు మంగళవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ సెల్ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాగృతి అధికార ప్రతినిధి మనోజా గౌడ్ డిమాండ్ చేశారు.
అసభ్య పోస్టుల స్క్రీన్షాట్లు, లింకుల ఆధారాలను పోలీసులకు అందజేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ప్రజా బాట’ పేరుతో కవిత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటుంటే.. బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు.
వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భూకబ్జాలను ప్రశ్నించినందుకు ఈ విధంగా వ్యక్తిగత దూషణలు, సైబర్ దాడులు చేస్తున్నారన్నారు. నిజమైన ఉద్యమకారులైన తమను పార్టీ నుంచి గెంటేసి, ఉద్యమ ద్రోహులతో కలిసి ఇలాంటి అసాంఘిక చర్యలకు బీఆర్ఎస్ పాల్పడుతోందని విమర్శించారు.
కార్యక్రమంలో జాగృతి యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ పాలే నిషా, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి మున్న, హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ మహేందర్ పటేల్, చార్మినార్ నియోజకవర్గ ప్రెసిడెంట్ రాధా కృష్, సిద్దార్థ్, సదానంద్ పాల్గొన్నారు.
