- జగిత్యాల బల్దియాలో ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ కోసం అధికారుల అడ్డదారులు
- ఎస్పీ ఆఫీస్, బంగ్లా, ఫైర్ స్టేషన్లను రికార్డుల్లోంచి మాయం చేసిన వైనం
- దాదాపు రూ.అరకోటికి పైగా బకాయిలు తగ్గించి చూపినట్లు అనుమానం
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీలో ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ రీచ్ అయ్యేందుకు అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ట్యాక్స్ వసూళ్లు తగ్గడంతో, ఆ లోటును కప్పిపుచ్చేందుకు ఏకంగా ఎస్పీ ఆఫీస్, బంగ్లా, ఫైర్ స్టేషన్లను సైతం రికార్డుల్లో మాయం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. దీంతో సుమారు రూ. 28 లక్షలకు పైగా ట్యాక్స్ బకాయిలను తగ్గించినట్లు, ఆన్‌లైన్ రికార్డులను సవరించినట్లు సమాచారం. మరో రూ.20 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గతేడాదితో పోలిస్తే 11 శాతం తగ్గిన వసూళ్లు
జగిత్యాల బల్దియాలో వివిధ రకాల ఆస్తులకు సంబంధించి మొత్తం 27,821 అసెస్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 వరకు 54 శాతం మాత్రమే ట్యాక్స్ కలెక్షన్ కాగా, గతేడాది ఇదే సమయానికి 65 శాతం వసూలయ్యాయి. ఈ ఏడాది మొత్తం రూ. 14.01 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, మార్చి 31 నాటికి రూ. 7.36 కోట్లు (54 శాతం) మాత్రమే కలెక్ట్ అయ్యాయి. కాగా ట్యాక్స్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, అధికారులు ఆన్‌లైన్‌లో కొన్ని అసెస్మెంట్లను డియాక్టివ్ చేసి బకాయిలను తగ్గించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్చి 26న రూ. 10.20 లక్షల ట్యాక్స్ వసూళ్లు కాగా, రూ. 7.33 కోట్లు బకాయి ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. 27న రూ.7.80 లక్షల వసూళ్లు జరిగితే, బకాయి రూ. 7.26 కోట్లకు తగ్గాలి. కానీ రికార్డుల్లో మాత్రం రూ. 6.98 కోట్లుగా చూపించారు. ఈ లెక్కన దాదాపు రూ.28 లక్షల బకాయిలు తగ్గినట్లు తేడా కనిపిస్తోంది. అయితే 26న ఉన్న 27,821 అసెస్మెంట్లు, 27న 27,818గా ఆన్ లైన్‌లో చూపించడంతో మూడు అసెస్మెంట్లు డియాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తేడాలపై ఆరా తీయగా, గతేడాదితో పోలిస్తే ఈసారి 11 శాతం తక్కువగా ట్యాక్స్ వసూల్ కావడంతో ఉన్నతాధికారుల ఒత్తిడిని తప్పించుకునేందుకు అధిక ట్యాక్స్ ఉన్న ప్రభుత్వ ఆస్తులను డియాక్టివ్ చేసినట్లు సమాచారం.
దాదాపు రూ.అరకోటికి పైగా టాక్స్ తగ్గింపు
దాదాపు అరకోటికి పైగా ట్యాక్స్‌ను తగ్గించేందుకు కొన్ని అసెస్మెంట్లను కావాలనే తగ్గించి చూపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డోర్ నంబర్ 8-1-8/1/100తో ఉన్న జగిత్యాల ఎస్పీ ఆఫీస్‌కు రూ.23,16,184 ట్యాక్స్ బకాయి ఉండగా, డోర్ నంబర్ 8-1-8/1/101తో ఉన్న ఎస్పీ బంగ్లాకు రూ. 66,536, డోర్ నంబర్ 2-–4–-318తో ఉన్న ఫైర్ స్టేషన్‌కు రూ. 2,17,116 ట్యాక్స్ బకాయిలను ఆన్‌లైన్ నుంచి తొలగించినట్లు సమాచారం. ఇవే కాకుండా మరో సుమారు రూ.2 లక్షల ట్యాక్స్ విలువ చేసే అసెస్మెంట్‌ను కూడా తొలగించినట్లు తెలుస్తోంది.
ఇలా మరిన్ని అసెస్మెంట్లు తొలగించి దాదాపు రూ. 50 లక్షల బకాయిలను తగ్గించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఆస్తి వినియోగంలో లేకపోయినా లేదా భౌతికంగా తొలగించినా, బల్దియాకు ట్యాక్స్ నష్టం లేకపోతే మాత్రమే అడిషనల్ కలెక్టర్ అనుమతితో అసెస్మెంట్‌ను డియాక్టివ్ చేయాలి. కాగా కళ్ల ముందే ఉన్న జిల్లాలో కీలక ప్రభుత్వ ఆఫీసుల్లోనే రికార్డుల్లో మాయం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అడిషనల్ కలెక్టర్ (ఏసీఎల్బీ) రాజా గౌడ్ దృష్టికి తీసుకువెళ్లగా, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
