మాస్క్ లేకుండా బయటికొస్తే.. ఆరు నెలల జైలు, 5 వేల ఫైన్

మాస్క్ లేకుండా బయటికొస్తే.. ఆరు నెలల జైలు, 5 వేల ఫైన్
  • ఆర్డినెన్స్ పాస్ చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలు అమల్లోకి తెచ్చింది. అందుకు కావాల్సినట్లుగా రాష్ట్రంలో క్వారంటైన్ రూల్స్ ను కఠినతరం చేస్తూ..ఎపిడమిక్ డిసీజెస్ యాక్టు–1897 కు పలు మార్పులు చేసింది. కరోనా ప్రొటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి భారీ పెనాల్టీ విధించనున్నట్లు ప్రకటించింది. మాస్కు పెట్టుకోకుండా ఓపెన్ ప్లేసుల్లోకి వచ్చిన వారికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5,000 పెనాల్టీ విధిస్తామని ఆర్డర్స్ పాస్ చేసింది.

కేంద్రం సడలింపులు ప్రకటించిన తర్వాత చాలామంది ప్రజలు రూల్స్ ఉల్లంఘిస్తున్నారని, మాస్కులు లేకుండా వీధుల్లో, మార్కెట్లలో తిరుగుతున్నట్లు గుర్తించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ పై రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య శనివారం సంతకం చేశారని, ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,700 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 21 మంది చనిపోయారు. కేరళ, ఒడిశా రాష్ట్రాలు లాక్​డౌన్ రూల్స్ ను కఠినతరం చేస్తూ డీసీజెస్ యాక్టుకు ఇప్పటికే సవరణలు చేశాయి.