110 కి. మీ స్పీడ్ లో వెళ్తున్న రైల్లో తుపాకీ కాల్పులు.. ప్రయాణికుల బాధ వర్ణణాతీతం

110 కి. మీ స్పీడ్ లో వెళ్తున్న రైల్లో తుపాకీ కాల్పులు.. ప్రయాణికుల బాధ వర్ణణాతీతం

110 కిలో మీటర్ల స్పీడ్ లో రైలు వెళ్తోంది. ప్రయాణికులంతా మాంచి నిద్రలో ఉన్నారు. అంతే ఒక్కసారిగా కాల్పులు..విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఎవరు అని  చూస్తే  ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. అదేంటి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దాడిచేయడం ఏంటీ అని ప్రయాణికులు అనుకున్నారు. బుల్లెట్ల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. 
 
12956 నెంబర్ గల జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ...జైపూర్ లో జులై 30వ తేదీ మధ్యా్హ్నం బయలుదేరింది. మరుసటి రోజు అంటే జులై 31వ తేదీ సోమవారం  ఉదయం 7 గంటల 40 నిమిషాలకు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. రైలు కోచ్ లన్నీ  మొత్తం  ప్రయాణికులతో కిక్కిరిపోయింది. 17 గంటల లాంగ్ జర్నీ కావడంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మరో గంటన్నర అయితే..ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ క్రమంలో రైలు మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చింది. అంతే ఒక్కసారిగా కాల్పులతో రైలు దద్దరిల్లింది.

జైపూర్ ఎక్స్ ప్రెస్ లో కాల్పులు జరిపిన నిందితుడు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ జులై 31వ తేదీ సోమవారం తెల్లవారుజామున 2:50 గంటలకు సూరత్ రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు ఎక్కాడు. రైల్లోనే విధులు నిర్వర్తి్స్తున్నాడు.  సమయం ఉదయం 5 గంటలు అవుతుంది. ఈ సమయంలో ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ..తన దగ్గర ఉన్న తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు.  ముందు తన  పైఅధికారి ఏఎస్ఐ టికా రామ్ పై కాల్పులు జరిపాడు. టికారామ్ తప్పించునే ప్రయత్నం చేశాడు. కానీ చేతన్ సింగ్ తూటాకు బలయ్యాడు. దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.  ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు.  అప్పర్ బెర్తుల్లో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు కాల్పుల శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైల్వే కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో ఒకింత ఆశ్చర్యానికి..ఒకింత భయాందోళనకు గురయ్యారు. 

ఏఎస్ఐ టికారామ్ ను హత్య చేసిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్..అంతటితో ఆగలేదు. B5 కోచ్ లోకి కూడా వెళ్లాడు. అక్కడ మరికొందరు ప్రయాణికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. రైల్వే కానిస్టేబుల్ కాల్పులు జరుతుండటంతో..ప్రయాణికులు అవాక్కయ్యారు. ఓ వైపు ట్రైన్ 110 కిలో మీటర్ల స్పీడ్ లో వెళ్తోంది. మరో వైపు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు...ఎలా తప్పించుకోవాలని మదన పడ్డారు.  ప్రాణభయంతో కొందరు పరిగెత్తారు. బాత్రూమ్ లోకి వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా చేతన్ సింగ్ వదల్లేదు. కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. ఈ కాల్పుల్లో  కోచ్ అద్దాల్లో నుంచి బుల్లెట్లు దూసుకుపోయాయి. అయితే ముగ్గురు ప్రయాణికులనే టార్గెట్ చేసిన చేతన్ సింగ్..వారిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత రన్నంటి ట్రైన్ నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేసి పట్టుబడ్డాడు.