
చిగురుపాటి జయరాం హత్యకేసులో మిస్టరీ వీడింది. జయరాం మేనకోడలు శిఖాచౌదరి బాయ్ ఫ్రెండ్ రాకేష్ రెడ్డే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల్లో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు. జయరాంను హైదరాబాద్ విజయవాడ మధ్యలోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దారి మధ్యలోనే డబ్బు వ్యవహారంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేసులో రాకేష్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు…పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జయరాం హత్యకు విషప్రయోగం జరిగిందా..లేదా దాడిచేసి హత్య చేశారా అనేది పోలీసులు తేల్చనున్నారు.
జయరాం డెడ్ బాడీ బసవతారకం హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి చేరుకుంది. భార్యాపిల్లలు కూడా ఉదయం అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చారు. జయరాం అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం మహాప్రస్థానంలో జరుగనున్నాయి. అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కుటుంబసభ్యులు.