రూల్స్ కు విరుద్ధంగా బాండ్ల కొనుగోలు: జైరాం రమేశ్

రూల్స్ కు విరుద్ధంగా బాండ్ల కొనుగోలు: జైరాం రమేశ్
  • బాండ్స్​కు కార్పొరేట్ మురికి
  • స్కీం అంతా గందరగోళమేనని ఆరోపించిన కాంగ్రెస్ నేత

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల స్కీం అంతా గందరగోళంగా ఉందని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్  చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తూ 20 కంపెనీలు సుమారు రూ.103 కోట్ల విలువైన బాండ్లు కొన్నాయని ఓ వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ఆయన ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన ఎలక్టోరల్ బాండ్ల స్కీం.. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఇచ్చిన డొనేషన్లపై క్లారిటీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ‘రూల్స్ ప్రకారం మూడేండ్ల కంటే ముందు స్థాపించిన కంపెనీలు మాత్రమే డొనేషన్లు ఇవ్వాలి. కానీ వాస్తవంలో ఒకటి రెండేండ్ల కిందట స్థాపించిన కంపెనీలు కూడా భారీ మొత్తం విరాళం అందించాయి.

 ఇలాంటి 20 కంపెనీలు రూ.103 కోట్ల విలువైన బాండ్లు కొన్నాయి. అలాగే గత మూడేండ్లలో కంపెనీలకు వచ్చిన నికర లాభాల నుంచి 7.5%  డొనేషన్లు మాత్రమే ఇవ్వాలని రూల్ ఉండగా.. ఆ కంపెనీలు చాలా ఎక్కువ మొత్తానికి బాండ్లు కొన్నాయి. అసలు బాండ్లు ఎవరు కొన్నారో కూడా ప్రజలకు తెలీదు. అంటే అవన్నీ షెల్  కంపెనీలే” అని రమేశ్ అన్నారు. బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు ఎలక్టోరల్  బాండ్లను ఉపయోగించుకునే ప్రమాదం ఉందని ఎన్నికల సంఘం 2017లోనే హెచ్చరించిందని జైరాం రమేశ్​ గుర్తుచేశారు.

బీజేపీ ధ్యాసంతా ప్రతిపక్ష నేతలను కొనడంపైనే

బీజేపీ ధ్యాసంతా ప్రతిపక్ష నేతలను కొనడంపైనే తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోదని జైరాం రమేశ్  విమర్శించారు. మహారాష్ట్ర ప్రజలను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎన్ని డొనేషన్లు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలోని రామ్ టెక్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బాఘెల్​ను ఇరికించాలని అబద్ధాలు..

చత్తీస్​గఢ్​లో లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం భూపేశ్ బాఘెల్​ను ఇరికించడానికి బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల ముందు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారని జైరాం రమేశ్ అన్నారు. ఆ కేసులో మాజీ ఐఏఎస్, ఆయన కొడుకుకు వ్యతిరేకంగా ఈడీ నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈడీ కావాలనే వారిపై కేసు పెట్టినట్లు సుప్రీంకోర్టు వెల్లడించిందని తెలిపారు.