వన్ నేషన్ వన్ ఎలక్షన్ వైపు భారత్ నివేదిక సమర్పించిన జమిలీ ఎన్నికల కమిటీ

వన్ నేషన్ వన్ ఎలక్షన్ వైపు భారత్ నివేదిక సమర్పించిన జమిలీ ఎన్నికల కమిటీ

దేశంలో లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఓకేసారి ఎన్నికలు జరిపే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ జమిలీ ఎన్నికలపై సాద్యాసాధ్యాలు పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ నివేదికను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ నెలలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీకు ఛైర్మన్ కాగా, కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్ధిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, పలువురు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 190 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాలు తిరిగి, విభిన్న వర్గాల ప్రజలతో సమావేశమై సలహాలు, సూచనలు స్వీకరించింది. అన్నింటినీ క్రోడీకరించి 18వేల 626 పేజీల నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. 

జమిలీ ఎన్నికలపై రామ్‌నాథ్ కమిటీ సూచనలు
> మొదటి దశలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలి
> రెండవ దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
> లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకటే ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలి
>  జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్ సవరణ చేయాలి

మొత్తానికి రాజ్యాంగ సవరణలు మినహా మిగిలినవన్నీ చిన్న చిన్న సూచనలే. రాజ్యాంగ సవరణలు కూడా పూర్తయితే ఇక జమిలీ ఎన్నికలకు అడ్డంకి లేనట్టే. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయవచ్చని కమిటీ సిఫారసు చేసింది.