టీ20లో పాక్ గెలుపుపై కశ్మీర్ మెడికల్ స్టూడెంట్స్ సంబురాలు

టీ20లో పాక్ గెలుపుపై కశ్మీర్ మెడికల్ స్టూడెంట్స్ సంబురాలు

శ్రీనగర్: టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియాపై పాక్ విజయం సాధించడంతో జమ్ము కశ్మీర్ మెడికల్ స్టూడెంట్స్ సంబురాలు చేసుకోవడంపై యాంటీ టెర్రర్ లా (ఉపా చట్టం) కింద కేసు నమోదయ్యాయి. శ్రీనగర్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (జీఎంసీ) వుమెన్స్ హాస్టల్, షేర్ కశ్మీర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్) కాలేజీల్లో స్టూడెంట్స్ పాక్ గెలుపుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ డాన్సులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కొంత మంది అమ్మాయిలు పాక్ ను పొడుగుతూ నినాదాలు చేశారు. దీంతో వాళ్లపై కరణ్ నగర్, సౌరా పోలీస్ స్టేషన్లలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

స్కిమ్స్ కాలేజీలో పాక్ అనుకూల సెలబ్రేషన్స్ పై ఆ ఇన్ స్టిట్యూట్ అధికారులు ఫ్యాక్ట్ ఫైండింగ్ (నిజ నిర్ధారణ) కమిటీని నియమించారు. 48 గంటల్లో ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. తమ ఇన్ స్టిట్యూట్ ఆవరణ లోపల ఆ సంబురాలు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, అయినప్పటికీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.