జమ్మూకశ్మీర్ లో దంచికొడుతున్న వానలు 

జమ్మూకశ్మీర్ లో దంచికొడుతున్న వానలు 

జమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కథువా జిల్లాలో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కథువా జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చీనాబ్ నది ఉథృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 

రానున్న 24 గంటల్లో జమ్మూకాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్ హైవేను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పడితే మళ్లీ యథావిధిగా వాహనాలు వెళ్లేందుకు జాతీయ రహదారిని ఓపెన్ చేస్తామని చెప్పారు.