ఉద్యోగులు అన్న ఆ మాటతోనే వెనుకడుగేశా

ఉద్యోగులు అన్న ఆ మాటతోనే వెనుకడుగేశా

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఇవాళ ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ ర్యాలీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పందించారు. లక్షల సంఖ్యలో ఉద్యోగులు, టీచర్లు రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడ చేరుకుని జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంపై ఆయన మాట్లాడారు.  ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు, స్కూళ్లలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఇవాళ రోడ్డుపైకి రావడం చాలా బాధగా అనిపించిందన్నారు. వాస్తవానికి పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న నిరసనలపై ముందే స్పందించే వాడినని, అయితే ఉద్యోగ సంఘాలు మొదట సీఎం, అధికారులతో చర్చలు జరుపుతూ.. తమ ఉద్యమంలో ఏ రాజకీయ పార్టీ భాగస్వామ్యం వద్దని అన్నారని, ఆ వ్యాఖ్యలతోనే తాను ఒకడుగు వెనక్కి వేశానని పవన్ చెప్పారు. వారు అడిగినప్పుడే తమ మద్దతు ఇవ్వాలని అనుకున్నామని, కానీ ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగులు, టీచర్లు రోడ్లపైకి వచ్చి ఎండలోనూ నిరసన తెలపడం బాధకలిగించి మాట్లాడుతున్నానని అన్నారు. పైగా ఉద్యోగులను చర్చలకు వాళ్లను అర్ధరాత్రి వరకూ వెయిట్ చేయించి, అవమానించడం దారుణమన్నారు. తానూ ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకునేనని, వాళ్ల బాధలు ఎలా ఉంటాయో తనకు తెలుసని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెంచుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. కనీసం ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా కూడా జీతాలు పెంచలేదని పవన్ అభిప్రాయపడ్డారు. 

వైసీపీ ఎన్నికల ప్రచారం సమయంలో తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్‌ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి.. ఇంత వరకూ దాని ఊసే ఎత్తలేదని పవన్ తప్పుబట్టారు. కొత్త పీఆర్సీ ద్వారా ఓ వైపు జీతాలు పెంచామని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు వారి జీతాల్లో కోత విధించడం ఉద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. జీతాలు పెరిగితే తమ కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు అని ఇలా ఎన్నో లెక్కలు వేసుకుంటారని, ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా వారి ఆలోచనలు ఎలా ఉంటాయో తనకు తెలుసని అన్నారు. ఉద్యోగుల బాధలను ప్రభుత్వం సరిగా వినకపోవడం, వాళ్లను అవమానించి, చీత్కరించడం వాళ్లను రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. ఇవాళ ఉద్యోగులు రోడ్లపైకి రావడానికి కారణం వైసీపీ నిర్లక్ష్య ధోరణే అని, ఇప్పటికైనా వారిని సుహృద్భావ వాతావరణంలో చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని తాము కోరుకుంటున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

తొలి దశలో 9 వేల స్కూళ్లు.. రూ.3 వేల కోట్ల ఖర్చు

ప్రధాని మోడీ మాట తప్పారు

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.3 వేల కోట్లు