జంగా రాఘవ నిర్ణయంపై కాంగ్రెస్​లో ఉత్కంఠ

జంగా రాఘవ నిర్ణయంపై కాంగ్రెస్​లో ఉత్కంఠ
  •     హనుమకొండ డీసీసీ ఇస్తే  పశ్చిమలో నాయినికి సపోర్ట్‌ చేస్తానని షరతు
  •     ఇప్పటికే కాంగ్రెస్‍, ఏఐఎఫ్‍బీ నుంచి నామినేషన్ వేసిన జంగా
  •     పశ్చిమలో నాయినిని గెలిపించాలన్న హస్తం హైకమాండ్‍
  •     రాఘవ టీంతో రెండు దఫాలుగా రాష్ట్ర నేతల చర్చలు 
  •     జంగా నిర్ణయంపై దాస్యం, నాయిని వర్గాల్లో టెన్షన్
  •     కేసీ వేణుగోపాల్‍ రాష్ట్ర పర్యటనలో క్లారిటీ వచ్చే చాన్స్ 

వరంగల్‍, వెలుగు : కాంగ్రెస్‍  పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్ష పీఠం తనకు కేటాయిస్తే.. కాంగ్రెస్‍  అభ్యర్థి నాయిని రాజేందర్‍రె డ్డి విజయానికి సహకరిస్తానని కాంగ్రెస్‍  నేత జంగా రాఘవరెడ్డి కండిషన్‍  పెట్టినట్లు సమాచారం. ఉమ్మడి ఓరుగల్లుకు కేంద్రంగా ఉండే వరంగల్‍  పశ్చిమ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని బీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ అభ్యర్థులు దాస్యం వినయ్‍  భాస్కర్‍, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 

తాను నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరోసారి తనను గెలిపిస్తాయని వినయ్‍  భాస్కర్‍ కాన్ఫిడెంట్‍గా ఉన్నారు. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్‍  హవా నడుస్తోందని కేసీఆర్  సర్కారు, వినయ్‍ భాస్కర్‍పై ఉన్న వ్యతిరేకత తనను గెలిపిస్తాయని నాయిని నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‍  టికెట్ దక్కని జంగా రాఘవరెడ్డి రెబల్‍గా ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అదే జరిగితే కాంగ్రెస్‍  ఓటు బ్యాంకు చీలి తనకు మేలు జరుగుతుందని దాస్యం వర్గం భావిస్తోంది. తాను పోటీలో ఉండాలని బీఆర్‍ఎస్‍ నేతలు లోలోపల కోరుకుంటే.. ఏదోలా జంగా తన నిర్ణయం మార్చుకుని పార్టీ అభ్యర్థి కోసం పనిచేయాలని కాంగ్రెస్‍  పెద్దలు ఆశిస్తున్నారు. 

ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గంలో ప్రభావం చూపే జంగా రాఘవరెడ్డి తీసుకోబోయే నిర్ణయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలో ఉత్కంఠ  నెలకొంది.

పశ్చిమ టికెట్‍ లేదంటే డీసీసీ ఇయ్యాలే

వరంగల్‍  పశ్చిమలో కాంగ్రెస్‍  అభ్యర్థి గెలుపోటములను జంగా రాఘవ రెడ్డి ప్రభావితం చేయనున్నారని పార్టీ హైకమాండ్​కు తెలిసింది. జంగా బరిలో ఉంటే కాంగ్రెస్‍  ఓట్లు చీలి బీఆర్ఎస్ కు లాభం కలిగే అవకాశం ఉండడంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. పీసీసీ చీఫ్‍  రేవంత్ రెడ్డి సూచనతో జిల్లా ఇన్ చార్జులు దల్వీ, శోభ తదితరులు ఇప్పటికే రాఘవ రెడ్డిని సముదాయించే పనిలో పడ్డారు. ఆయనను రెండు సార్లు కలిసి చర్చలు జరిపారు. 

రేవంత్‍తో ఫోన్ లో మాట్లాడించినట్లు సమాచారం. ఎందుకైనా మంచిదని జంగాను పశ్చిమలో కాకుండా పాలకుర్తిలో నామినేషన్‍  వేయాలంటూ హైకమాండ్‍  పెద్దలు చెప్పగా ఆయన నిరాకరించినట్లు తెలిసింది. నామినేషన్‍  విత్‍డ్రా చేసుకుని నాయిని గెలుపు కోసం పనిచేయాలంటే హనుమకొండ జిల్లాతో పాటు సిటీ కాంగ్రెస్‍  అధ్యక్ష బాధ్యతలు తనకు ఇవ్వాలని, లేకపోతే తన దారి తాను చూసుకుంటానని జంగా షరతులు పెట్టినట్లు సమాచారం. డీసీసీ ఇస్తే జిల్లాలో పార్టీని బలోపేతం చేసి భవిష్యత్తులో నియోజకవర్గాలు పెరిగే క్రమంలో కాజీపేట నుంచి పోటీలో ఉండేలా ఆయన ముందస్తు ప్లాన్‍  చేసుకుంటున్నారు. 

మొత్తంగా ఏఐసీసీ జనరల్‍  సెక్రటరీ కేసీ వేణుగోపాల్‍  శుక్రవారం రాష్ట్ర పర్యటనలో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వరంగల్‍  పశ్చిమ ఫలితాలపై స్పష్టమైన ప్రభావం చూపే అంశం కావడంతో జంగా, హస్తం హైకమాండ్‍  నిర్ణయాలపై అధికార బీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍ పార్టీ క్యాండిడేట్లలో ఉత్కంఠ నెలకొంది.

చెప్పినట్లే నామినేషన్‍ వేసిన జంగా 

వరంగల్‍  పశ్చిమ టికెట్‍ కోసం ఎప్పటి నుంచో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్  రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‍ జంగా రాఘవరెడ్డి తీవ్రంగా పోటీపడ్డారు. ఈ క్రమంలో అధికార పార్టీ నుంచి నాలుగుసార్లు గెలిచిన దాస్యం వినయ్‍ భాస్కర్‍ను ఢీకొట్టే సత్తా తనకే ఉందని రాఘవ రెడ్డి అంటున్నారు. సర్వేలు కూడా తనకే అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. కానీ గత ఎన్నికల్లో నాయిని రాజేందర్ రెడ్డికి చివరి క్షణాల్లో టికెట్‍ క్యాన్సిల్‍  చేసిన నేపథ్యంలో పార్టీ హైకమాండ్‍  నాయిని వైపే మొగ్గు చూపింది. 

దీంతో జంగా నిరాశ చెందారు. తాను ఎట్టి పరిస్థితుల్లో అయినా పశ్చిమ బరిలో ఉంటానని,  తనకు కాంగ్రెస్‍  టికెట్ ఇవ్వకుంటే ఏఐఎఫ్‍బీ నుంచి పోటీ చేస్తానని జంగా పేర్కొన్నారు. అన్నట్లుగానే కాంగ్రెస్‍, ఏఐఎఫ్‍బీ తరఫున ఆయన నామినేషన్లు వేశారు.